Diamonds in Kurnool : కర్నూలు రైతుకు దొరికిన వజ్రం - ధర ఎంతో తెలుసా..?-a farmer from kurnool district got a valuable diamond ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Diamonds In Kurnool : కర్నూలు రైతుకు దొరికిన వజ్రం - ధర ఎంతో తెలుసా..?

Diamonds in Kurnool : కర్నూలు రైతుకు దొరికిన వజ్రం - ధర ఎంతో తెలుసా..?

HT Telugu Desk HT Telugu

Diamonds in Kurnool : కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు వజ్రం దొరికింది. రూ. 18 లక్షల రూపాయలకు వజ్రాన్ని కొనుగోలు చేశారు. మార్కెట్ విలువ రూ. 30 లక్షలుగా ఉంటుందని అంచనా.

కర్నూలులో వజ్రాల వేట

Diamonds in Kurnool : రాష్ట్రంలో వర్షాలు పడటంతో వజ్రాల వేటలో కర్నూలు, అనంతపురం రైతులు నిమగ్నమై ఉన్నారు. ఆ రెండు జిల్లాల్లో రైతులు పొలాల్లోకి వెళ్లి వజ్రాలు వెతికే పనిలో ఉన్నారు. ఒక్క వజ్రం దొరికినా తమ కష్టాలు గట్టెక్కుతాయని రైతులు పొలాల్లో గుంపులు గుంపులుగా వజ్రాలను వెతుకుతున్నారు. అందులో కొందరికి అదృష్టం కలిసి వచ్చి వజ్రాలు దొరుకుతున్నాయి.

కర్నూలు జిల్లా రైతుకు దొరికిన వజ్రం…

కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు విలువైన వజ్రం లభించింది. దీంతో ఆయన పంట పండింది. వజ్రం విలువైనది కావడంతో చుట్టుపక్కల వ్యాపారస్తులు ఆ రైతు ఇంటికి చేరుకున్నారు. ఆ వజ్రాన్ని కొనేందుకు పోటీ పడ్డారు.

వివరాల్లోకి వెళితే.. ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మదనంతపురంలో ఓ రైతు పొలంలో విలువైన వజ్రం బయటపడింది. వర్షాలు పడటంతో స్థానికులు వజ్రాల వేట మొదలు పెట్టారు. ఓ రైతుకు విలువైన వజ్రం లభించడంతో ఆయన ఇంటికి తీసుకెళ్లారు. దాన్ని పరీక్షించేలోపే వ్యాపారులు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు.

రూ.18 లక్షల నగదు, 10 తులాల బంగారు ఇచ్చి కొనుగోలు….

వజ్రాన్ని రూ.18 లక్షల నగదు, 10 తులాల బంగారు ఇచ్చి ఈ వజ్రాన్ని కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్ లో ఆ వజ్రం ధర రూ. 30 లక్షలు ఉంటుందని అంచానా వేస్తున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలియడంతో మదనంతపురం పొలాల్లోకి గ్రామస్థులు పోటెత్తారు.

కర్నూలు జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో తొలకరి వర్షాలు కురవగానే వజ్రాల వేట మొదలవుతుంది. కానీ ఈసారి వేసవివకాలంలోనే వజ్రాల కోసం జనాలు గాలింపు మొదలుపెట్టారు.

జిల్లాలోని తుగ్గలి మండలంలో తుగ్గలి, రామాపురం, చిన్నజొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, ఉప్పర్లపల్లి, గిరిగెట్ల, మదనంతపురంలో వజ్రాల కోసం గాలిస్తారు. మద్దికెర మండలంలోని పెరవలి, మద్దికెర, బసినేపల్లి ప్రాంతాల్లో కూడా వెతుకుతారు. ఇటు అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్‌, బేతాపల్లి, ఊటకల్లు, బసినేపల్లి తదితర ప్రాంతాల్లో వజ్రాల కోసం వేట మొదలైంది.

వర్షాలు బాగా కురవగానే జనాలు పొలాల బాటపడతారు. ప్రతి ఏటా విలువైన వజ్రాలు దొరుకుతుండటంతో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వెతుకుతుంటారు. పొలాల్లో దొరికిన వజ్రాలను రహస్యంగా వ్యాపారులకు అమ్మేస్తుంటారు.

వ్యాపారులు కూడా ఆ దగ్గరలోనే మక్కాం వేస్తారు. కొన్ని సందర్భాల్లో వేలం పాట నిర్వహించి వ్యాపారులు ఆ వజ్రాన్ని దక్కించుకుంటారు. అయితే ఇలా దొరికిన వజ్రం రంగు, జాతిని బట్టి క్యారెట్ల రూపంలో లెక్క చేసి.. ఆ విలువకు తగిన విధంగా డబ్బులతో పాటుగా బంగారం ఇచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు.

రిపోర్టింగ్ - జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు, ఏపీ.

సంబంధిత కథనం