కాకినాడ జిల్లాలో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. తల్లికి ఉరేసి, ఆపై కుమార్తె కూడా ఉరేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. తల్లి కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉండి పోయిన కుమార్తె ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషాద ఘటన కాకినాడలోని పెంకెవారి వీధిలో జరిగింది. కాకినాడ వన్‌టౌన్ సీఐ నాగదుర్గారావు తెలిపిన వివరాల ప్రకారం… బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం వై.కొత్తపల్లికి చెందిన ఆకాశం సరస్వతి (60), ఆమె కుమార్తె స్వాతి (28) పన్నెండేళ్లుగా కాకినాడ పెంకెవారి వీధిలోని ఓ భవనం మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. సరస్వతి భర్త నర్సింహారావు పదహారేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు.
అంతకు ముందు సరస్వతి దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో కొంతకాలం కర్ణాటకలో జీవనోపాధి కోసం ఉన్నారు. ఆ తరువాత వారు స్వగ్రామానికి తిరిగి వచ్చారు. వచ్చిన తరువాత భర్త చనిపోవడంతో సరస్వతి తన పిల్లలను తీసుకొని జీవనోపాధి కోసం కాకినాడకు వచ్చేశారు. పెద్ద కుమార్తె బుజ్జికి వివాహం కాగా విశాఖపట్నంలో ఉంటున్నారు. చిన్న కుమార్తె స్వాతి ఇంట్లోనే టైలరింగ్ చేస్తుండేది.
సరస్వతి కొన్నాళ్లుగా అనారోగ్యం, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో స్వాతి ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఇంట్లోని ఫ్యాన్ హుక్‌కు చీరతో తల్లికి ఉరేసి ఆమె చనిపోయాక మంచంపై మృత దేహాన్ని ఉంచి… స్వాతి కూడా ఉరేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మూడు రోజులుగా పాలు పోసే వ్యక్తి సీసాను గుమ్మం వద్ద ఉంచుతున్నా తీసుకోకపోవడంతో ఇంటి యజమాని గుర్రాల శ్రీనివాస్‌కు విషయం చెప్పారు.
తలుపులు ఎంత కొట్టినప్పటికీ తీయకపోవడం, ఇంట్లోంచి దుర్వాసన వస్తుండడంతో ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి చూశారు. మృతదేహాలు పాడైపోయి ఉండటంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగదుర్గారావు తెలిపారు. దీంతో దీపావళి పండగ సమయంలో ఆ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తల్లి, చెల్లి మరణవార్త తెలుసుకున్న పెద్ద కుమార్తె కాకినాడకు చేరుకుంది. అలాగే స్వగ్రామం నుంచి బంధువులు కూడా కాకినాడకు వచ్చారు. పెద్ద కుమార్తె, బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు.