Vizianagaram : పెళ్లైన 3 నెలలకే భార్యపై అనుమానం..!యూట్యూబ్‌లో చూసి హత్య చేసిన జవాన్
Jawan killed his wife in Vizianagaram: విజయనగరం జిల్లాలో దారుణం వెలుగు చూసింది. పెళ్లైన మూడు నెలలకే భార్యను భర్త హత్య చేశాడు. ఈ నేరాన్ని ఇతరులపైకి నెట్టేందుకు ప్రయత్నించాడు. పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది.
Jawan killed his wife in Vizianagaram: పెళ్లైన మూడు నెలలకే కట్టుకున్న భార్యను సీఆర్‌పీఎఫ్ జవాన్ హతమార్చాడు. భార్యపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దొరకుండా ఎలా హత్య చేయాలో యూట్యూబ్‌లో చూసి హత్యకు పాల్పడ్డాడు.
సీఆర్‌పీఎఫ్ జవాన్‌గా బాధ్యతలు ముగించుకుని సెలవులపై హత్య చేయడానికి వారం రోజుల ముందు గ్రామానికి వచ్చాడు. భార్య హతమార్చడానికి పథకం రచించాడు. నైలాన్ తాడును మెడకు బిగించి హతమార్చాడు. అయితే తనకేమీ తెలియనట్లు నటించి.. ఈ నేరాన్ని వేరొకరిపై మోపేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు వద్ద ఆయన పప్పులు ఉడకలేదు. భర్తపైనే అనుమానం వచ్చిన పోలీసులు, ఆయనను అరెస్టు చేశారు.
3 నెలల కిందటే పెళ్లి….
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం బంగారమ్మ పేట గ్రామానికి చెందిన తాడుతూరి అనూష (తనూజ) (22)తో అదే గ్రామానికి చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ నక్కా జగదీష్ (30)తో మూడు నెలల క్రితం వివాహం అయింది. మొదట్లో కాపురం బాగానే చేసిన జగదీష్, కొద్ది రోజులకే అనూష మీద అనుమానం పెంచుకున్నాడు. అనూషను తన పుట్టింట్లోనే వదిలి ఉద్యోగానికి వెళ్లిపోయాడు. భార్యకు కనీసం ఫోన్ కానీ, మెసేజ్ కానీ చేసేవాడు కాదు. భార్య చేసిన దానికి ఆన్సర్ చేసేవాడు కాదు. కానీ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఎలాగైన భార్య అనూషను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
యూట్యూబ్ లో చూసి……
అప్పుడు హత్య ఏలా చేయాలో ఆలోచన చేశాడు. తన చేతికి మట్టి అంటకుండా సాంకేతికతను ఉపయోగించి హత్య చేయాలని పథకం వేశాడు. తనపై నేరం పడకుండా, పోలీసులకు పట్టుబడకుండా, కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా హత్య ఏలా చేయాలనే దానిపై నిందితుడు యూట్యూబ్‌లో చూసి తెలుసుకున్నాడు.
హత్య చేయడానికి వారం రోజుల క్రితం గ్రామానికి వచ్చి భార్యను తీసుకుని విజయనగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగాడు. ఉద్యోగం పని మీద వచ్చానని చెప్పి ఆమెను పుట్టింటికి పంపించేశాడు. ఆయన అక్కడ నుంచి వైజాగ్ వెళ్లి, అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులంతా జగదీష్ మారిపోయాడని అనుకున్నారు. అయితే వారిని నమ్మించడానికి ఇదంతా చేశాడని తెలుసుకోలేకపోయారు.
తన పాత సెల్ ఫోన్ సిమ్ కార్డును మూడు రోజుల క్రితమే తీసేసి, కొత్త సిమ్ కార్డును తీసుకున్నాడు. వైజాగ్ నుంచి ఈనెల 16న రాత్రి బంగారమ్మపేటకు వచ్చి, భార్యను ఇంట్లోంచి బయటకు రమ్మని పిలిచాడు. ఇంటికి సమీపంలో ఉన్న పశువుల శాల వద్దకు ఆమెను తీసుకెళ్లాడు. అనూష ప్రవర్తనపై ప్రశ్నించాడు. కేకలు వేయడంతో అప్పటికే జేబులో ఉన్న నైలాన్ తాడును మెడకు బిగించి ఊపిరాకుండా చేసి హతమార్చాడు. అప్పటికే తన ఫోన్‌లో సిద్ధంగా ఉంచి మెసేజ్‌ను భార్య అనూష ఫోన్‌లోకి పంపించాడు. తాను పంపించిన మెసేజ్ భార్య ఫోన్‌లో డిలీట్ చేశాడు.
గతంలో ఉన్న పరిచయాలతో బోని ప్రసాద్ తనను వేధిస్తున్నడని, అందుకే చనిపోతున్నాననే మెసేజ్‌ను అనూష ఫోన్ నుంచి ఆమె తండ్రి, అన్నయ్య, స్నేహితురాళ్లకు నిందితుడు జగదీష్ పంపించాడు. దీంతో ఆందోళన చెందిన అనూష కుటుంబ సభ్యులు ప్రసాద్ ఇంటిపై దాడికి వెళ్లారు. అలాగే 100 నంబర్‌కు ఫోన్ చేయడంతో వెంటనే ఎస్ఐ యు. మహేష్ తన పోలీసు సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితిని అదుపు చేశారు. అలాగే సీఐ ఎన్వీ ప్రభాకరరావు, ఎస్ఐ మహేష్ విచారణ జరిపారు.
ఇంటికి కొంత దూరంలో పశువులపాక వద్ద అనూష మృతదేహం పడి ఉంది. వెంటనే పోలీసులు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతిరాలికి ప్రసాద్‌కు మధ్య ఏడాదిగా ఎలాంటి ఫోన్ సంభాషణలు లేకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. మృతురాలు పంపిన మెసేజ్‌లు ఒకేసారి నలుగురికి ఎలా వెళ్లాయనే కోణంలో ఆరా తీశారు. ఆ దిశగా భర్తను విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తే, భార్యను హత్య చేశాడని తెలుసుకున్న పోలీసులు, భర్త జగదీష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.