Tirupati Crime : తిరుపతి జిల్లాలో ఘోరం - చిన్నారిపై అత్యాచారం, ఆపై చంపేసి పూడ్చిపెట్టాడు..!
అభం శుభం తెలియని చిన్నారి హత్యాచారానికి గురైంది. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లాలో వెలుగు చూసింది. చాక్లెట్లు ఇప్పిస్తానని వెంట తీసుకెళ్లి మూడున్నరేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారం చేసి… ఆపై చంపేసి పూడ్చిపెట్టాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతి జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. అభంశుభం తెలియని మూడున్నరేళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు కర్కశంగా వ్యవహరించాడు. అప్పటిదాకా నవ్వుతూ ఆడుకుంటున్న ఆ బాలికకు చాక్లెట్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ చిన్నారిని హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టేశాడు. ఆ బాలిక నిందితుడికి సమీప బంధువు.
ఈ ఘోరమైన దారుణ ఘటన తిరుపతి జిల్లా వడమాట పేట మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన సుశాంత్ (22) తన సమీప బంధువైన మూడున్నరేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి వెంట తీసుకెళ్లాడు. ఓ దుకాణంలో తినుబండారాలు కొనిచ్చి సమీప పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది.
అనంతరం బాలికను చంపేసి అక్కడే పూడ్చిపెట్టేశాడు. రాత్రి అవుతున్నప్పటికీ పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతికారు. అయినప్పటికీ ఎంతకీ కనిపించలేదు. దీంతో వడమాల పేట మండలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అనుమానితుడు సుశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా ఈ ఘటన జరిగిన విషయం తెలిపాడు.
నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు చిన్నారి మృత దేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సుశాంత్‌పై పోక్సో చట్టం కింద కేసు, మర్డర్ కేసులతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు.
అల్లారి ముద్దుగా పెంచుకున్న బాలిక అర్థంతరంగా ఒక దుర్మార్గుడి కర్కశానికి బలికావడంతో ఆ కుటుంబం పుట్టెడు దుఃఖసాగరంలోకి వెళ్లింది. తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరు మున్నీరు అయింది. ఈ ఘటనతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మృత దేహం పుత్తూరు ఆసుపత్రిలో ఉండటంతో అక్కడే కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని చిన్నారి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం