Tirupati District : కోలాట వేడుకలో విషాద ఘటన.. చిన్నారి తలను చిదిమేసిన జనరేటర్ మిషన్!-a child died after touching the generator in tirupati district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupati District : కోలాట వేడుకలో విషాద ఘటన.. చిన్నారి తలను చిదిమేసిన జనరేటర్ మిషన్!

Tirupati District : కోలాట వేడుకలో విషాద ఘటన.. చిన్నారి తలను చిదిమేసిన జనరేటర్ మిషన్!

HT Telugu Desk HT Telugu
Aug 18, 2024 10:02 AM IST

Tirupati district Crime News : తిరుపతి జిల్లాలోని వాకాడులో విషాదం చోటు చేసుకుంది. కోలాటం ఆడ‌టానికి వెళ్లిన చిన్నారి జనరేటర్ ను తాకి ప్రాణాలు కోల్పోయింది. త‌ల‌ వెంట్రుకలు జ‌న‌రేట‌ర్ బెల్టులో చిక్కుకుపోయిన క్షణాల వ్యవధిలోనే.. చిన్నారి తలను జనరేటర్ మిషన్ చిదిమేసింది.

చిత్తూరు జిల్లాలో విషాదం
చిత్తూరు జిల్లాలో విషాదం (image source from unsplash.com)

తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 11 ఏళ్ల చిన్నారిని జ‌న‌రేట‌ర్ రూపంలో మృత్యువు క‌బ‌లించింది. కోలాటం ఆడ‌టానికి వెళ్లిన చిన్నారి… కాన‌రాని లోకానికి వెళ్లిపోయింది. కోలాటం ఆడిన త‌రువాత సేద తీరుదామ‌ని ప‌క్క‌నే ఉన్న జ‌న‌రేట‌ర్ ప‌క్క కూర్చొంది. ఆ చిన్నారి త‌ల వెంట్రుక‌లు జ‌న‌రేట‌ర్‌లో చిక్కుకుపోయాయి. అంతే కొద్ది సేప‌టికే ఆమె మ‌ర‌ణించింది.

ఈ విషాద ఘ‌ట‌న తిరుప‌తి జిల్లాలోని వాకాడులో శ‌నివారం తెల్ల‌వారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండ‌లం మ‌ర్రిమాకుల కండ్రిగ‌కు గ్రామానికి చెందిన చిరంజీవి, చిట్టెమ్మ‌ల దంప‌తులకు ముగ్గురు సంతానం. కుమార్తె చందు, కుమార్తె న‌వ్య‌శ్రీ (11), కుమారుడు భ‌వేష్ ఉన్నారు. వీరులో ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్న న‌వ్య శ్రీ‌, కోలాటం నేర్చుకుంది. బృందంతో క‌లిసి ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తోంది.

అందులో భాగంగానే శుక్ర‌వారం రాత్రి తిరుప‌తి జిల్లా వాకాడులో జ‌రిగిన అమ్మ‌వారి పూజ‌ల్లోనూ ఆమె కోలాట ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింది. శ‌నివారం తెల్ల‌వారుజామున కోలాటం ఆడటంతో అల‌స‌ట‌గా ఉందని… సేద‌తీరేందుకు జ‌నరేట‌ర్ స‌మీపాన కూర్చోంది. ఏమ‌రుపాటుగా ఉండ‌టంతో ఆమె త‌ల‌వెంట్రుకలు జ‌న‌రేట‌ర్ బెల్టులో చిక్కుకుపోయాయి.

అంతే రెప్ప‌పాటులోనే జ‌రిగిన ఈ పరిణామాన్ని అక్క‌డి వారు గ‌మ‌నించేలోపే, ఆ చిన్నారి త‌ల‌ను జ‌న‌రేట‌ర్ మిష‌న్ చిదిమేసింది. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న న‌వ్య‌శ్రీ సోద‌రి, సోద‌రుడు, పెద‌నాన్న క‌న్నీరు మున్నీరు అయ్యారు. కేక‌లు వేస్తూ చిన్నారి న‌వ్య శ్రీ ఇక మ‌న మ‌ధ్య ఉండ‌ద‌ని భావించి త‌ల్ల‌డిల్లిపోయారు.

శ్రావ‌ణ‌ శుక్ర‌వారం పాఠ‌శాల‌కు సెల‌వు ఉండ‌టంతో కోలాటానికి వ‌చ్చింద‌ని, ఇంటివ‌ద్దే ఉంటే ఇలా జ‌రిగేది కాదేమోన‌ని విలపించారు. ఈ ప్ర‌మాదం తీరుచూసి అక్క‌డకు వ‌చ్చిన ప్ర‌జ‌లు సైతం క‌న్నీరు మున్నీరు అయ్యారు. చిన్నారి త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు రోద‌ల‌ను మిన్నంటాయి. ఇటు సొంత గ్రామం మ‌ర్రిమాకుల కండ్రిగ‌కులోనూ… అటు కోలాట ఆడిన గ్రామం వాకాడులోనూ విషాద చాయ‌లు అలుముకున్నాయి.

రిపోర్టింగ్ - జ‌గదీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు