ఎన్టీఆర్ జిల్లాలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. వేరొక వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని, భర్తకు దూరంగా ఉంటుంది. ప్రియుడి కోసం కన్న కూతురిపై తల్లి కర్కశంగా ప్రవర్తించింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని చిన్నారిపై అమానవీయతను ప్రదర్శించింది. చిన్నారికి వాతలు పెడుతూ వచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న చిన్నారి మేనత్త పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి, చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామానికి చెందిన శోభన్‌బాబు, సునీత దంపతులు ఉన్నారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే అదే గ్రామానికి చెందిన కాళిదాసు అనే వ్యక్తితో సునీతకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో భార్యాభర్తల శోభన్‌బాబు, సునీత మధ్య గొడవలు తరచూ జరుగుతుండేవి.
ఈ క్రమంలో సునీత తన భర్త శోభన్‌బాబుతో విడిపోయింది. కుమార్తెతో కలిసి కంచికచర్ల మండలం గండేపల్లిలో నివాసముంటోంది. అక్కడే ఉంటూ కాళిదాసుతో వివాహేతర సంబంధాన్ని నడుపుతోంది. అయితే ప్రియుడితో కలవడానికి తన కుమార్తె అడ్డుగా ఉందని సునీత భావించింది. దీంతో తన కుమార్తెను ఆమె తరచూ హింసిస్తూ ఉండేది. ఇటీవలే చిన్నారికి వాతలు పెట్టింది. దీంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. అభం శుభం తెలియని చిన్నారి బాధపడుతూ ఉంటుంది. కన్నతల్లే కర్కశంగా వ్యవహరిస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక చిన్నారి మనోవేదన వెలకట్టలేనిది.
తండ్రికి చెప్పుకుందామంటే ఆయన దూరంగా ఉన్నాడు. తల్లేమో కర్కశంగా వ్యహరిస్తుంది. దీంతో ఆ చిన్నారి అనుభవించిన నరకం అంతాఇంతా కాదు. తనలో తాను దిగమింగుకుంటూ చిన్నారి మనో వేదనకు గురవుతుండేది. ఆ చిన్నారికి అండగా నిలిచేవారే కరవయ్యారు. ఈ సమయంలో విషయం తెలుసుకున్న చిన్నారి మేనత్త అక్కడికి వెళ్లింది. చిన్నారి కన్నీళ్లను తుడిచింది. తాను అండగా ఉన్నానని ఆ చిన్నారికి భరోసా కల్పించింది.
మంగళవారం చిన్నారిని తీసుకుని మేనత్త పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. కంచికచర్ల పోలీస్ స్టేషన్‌లో ఆ బాలిక తనకు జరిగిన అన్యాయం, తాను అనుభవిస్తున్న బాధను పోలీసులకు వివరించింది. బాలిక మేనత్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను చికిత్స ఆ చిన్నారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మరోవైపు పోలీసులు విచారణ జరుపుతున్నారు. చిన్నారి తల్లిని విచారిస్తున్నారు.