APPSC Group1: గ్రూప్‌1 ఉద్యోగం కోసం అడ్డదారి.. అభ్యర్ధిపై కేసు నమోదు-a case has been registered against a candidate who gave a false certificate for a group 1 job ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  A Case Has Been Registered Against A Candidate Who Gave A False Certificate For A Group 1 Job

APPSC Group1: గ్రూప్‌1 ఉద్యోగం కోసం అడ్డదారి.. అభ్యర్ధిపై కేసు నమోదు

HT Telugu Desk HT Telugu
Aug 23, 2023 06:22 AM IST

APPSC Group1: ఏపీపీపఎస్సీ చేపట్టే గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల్లో‍ యూనిఫాం సర్వీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్ధి తప్పుడు పత్రాలతో మోసం చేయడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. నిందితుడిపై కేసు నమోదు చేశారు.

విజయవాడ ఏసీపీ రవికిరణ్
విజయవాడ ఏసీపీ రవికిరణ్

APPSC Group1: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్షల కోసం నిర్వహించిన రాతపరీక్షల్లో అర్హత సాధించిన ఓ అభ్యర్ధి శారీరక సామర్థ్య పరీక్షల్లో అక్రమాలకు పాల్పడటంతో పోలీసులకు చిక్కాడు. యూనిఫాం సర్వీస్ ఉద్యోగాలకు అవసరమైన నిర్దేశిత శారీరక ప్రమాణాలు లేకపోయినా.. ఉద్యోగం కోసం ఎత్తు ఎక్కువగా ఉన్నట్లు తప్పుడు ధ్రువపత్రం సమర్పించాడు. కమిషన్‌ వర్గాలు యువకుడి ఎత్తును సందేహించి వైద్య పరీక్షలు నిర్వహించడంతో లోకేష్‌ అనే యువకుడిపై విజయవాడ సూర్యారావుపేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

నిందితుడు పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ శారీరక పరీక్షల సమయంలో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు పోలీసులు గుర్తించారు.విజయవాడ సౌత్‌ ఏసీపీ బి.రవికాంత్‌ మంగళవారం వివరాలు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం గుండవనపల్లి గ్రామానికి చెందిన ఎ.లోకేష్‌ ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్షల్లో అర్హత సాధించాడు.

2022లొ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం వివిధ విభాగాల్లో మొత్తం 111 పోస్టుల కోసం కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు విజయవాడలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలలో లోకేష్‌ ఎంపికవడంతో, అభ్యర్థులను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ జీజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. వైద్య పరీక్షల అనంతరం లోకేష్‌ 167.7 సెం.మీ. ఎత్తు ఉన్నట్లు నిర్ధారిస్తూ ఇచ్చిన ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ అధికారులకు సమర్పించారు.

ఆగష్టు 9వ తేదీన జరిగిన ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన లోకేష్‌ను 10వ తేదీన ఇతర అభ్యర్థులతో కలిసి వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అదే రోజు వైద్య పరీక్షకు హాజరయి అతను 167.7 సెం.మీ ఎత్తు ఉన్నట్లు ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందాడు.

యూనిఫాం సర్వీస్‌ ఉద్యోగాలకు నిందితుడిని వైద్యులు అర్హుడిగా ప్రకటించడంతో కమిషన్ ధృవీకరణపై సందేహం వ్యక్తం చేసింది. యూనిఫాం సర్వీస్ ఉద్యోగాలకు ఉండాల్సిన ఎత్తు 167.6 సెంటీమీటర్లు ఉండరని అనుమానించారు. అతను అంత ఎత్తు ఉండడని.. 4 నుంచి 5 సెం.మీ. వరకు తేడా ఉంటాడని భావించవి 12వ తేదీన సెకండ్‌ ఒపీనియన్‌ కోసం పంపించారు.

రెండో సారి వచ్చిన ధ్రువీకరణ పత్రంలో లోకేష్‌ ఎత్తు 167 సెం.మీ కంటే తక్కువ ఉన్నట్టు తేలింది. ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం అభ్యర్థి 167.6 సెం.మి. ఎత్తు ఉండాలి. నియమిత ఎత్తు కన్నా తక్కువ ఉండటంతో, తప్పుడు ధ్రువపత్రం సమర్పించి ఉండొచ్చని ఏపీపీఎస్సీ అధికారులు నిర్ధారించుకున్నారు. కేసు దర్యాప్తును విజయవాడ పోలీసు అధికారులకు పంపించారు.

పోలీసు అధికారులు, తూనికలు కొలతల శాఖ అధికారుల సమక్షంలో మరోసారి లోకేష్‌ ఎత్తు కొలిచారు. ఎత్తు తక్కువగా ఉన్నట్లు తేలటంతో.. తప్పుడు ధ్రువపత్రం సమర్పించినట్లు నిర్ధారించుకుని అతనిపై సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితుడిపై ఏపీ మాల్‌ప్రాక్టీసెస్‌ నిరోధక చట్టం 1997, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.అతనే స్వయంగా తప్పుడు ధ్రువపత్రం సృష్టించి ఇచ్చాడా? వైద్య సిబ్బంది ప్రలోభాలకు లొంగి తప్పుడు ధ్రువపత్రం ఇచ్చారా అనేది తేలాల్సి ఉంది. నిందితుడు చిక్కితే ఈ ప్రశ్నలకు జవాబు దొరుకుతుందని పోలీసులు చెబుతున్నారు.

ధ్రువపత్రంపై ఉన్న వైద్యుడి పేరు, సంతకం తదితర విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ మోసంలో వైద్యుల పాత్ర ఉంటే.. వారిపై కూడా కేసు నమోదు చేస్తామని ఏసీపీ రవికాంత్‌ వెల్లడించారు.మరోవైపు ఏపీపీఎస్సీ ఫిజికల్ ఫిట్‌నెస్‌ పరీక్షల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో మరేదైనా కోణం ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి.

WhatsApp channel