Anantapuram Murder: అనంతలో ..."దృశ్యం" సినిమా తరహాలో యువకుడి హత్య-a brutal murder of a young man in the style of a drusyam movie scene in anantapur ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anantapuram Murder: అనంతలో ..."దృశ్యం" సినిమా తరహాలో యువకుడి హత్య

Anantapuram Murder: అనంతలో ..."దృశ్యం" సినిమా తరహాలో యువకుడి హత్య

Sarath chandra.B HT Telugu
Dec 07, 2023 12:20 PM IST

Anantapuram Murder: అనంతపురం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనమోదైన మిస్సింగ్ కేసు చివరకు మర్డర్‌గా తేలింది. దృశ్యం సినిమా తరహాలో శవాన్ని మాయం చేసేందుకు నిందితులు ప్రయత్నించినా చివరకు దొరికిపోయారు.

హత్య వివరాలను వెల్లడిస్తున్న అనంతపురం ఎస్పీ
హత్య వివరాలను వెల్లడిస్తున్న అనంతపురం ఎస్పీ

Anantapuram Murder: బెంగళూరుకు వెళ్లిన తన కుమారుడు మహమ్మద్ అలీ ఇంతవరకు తిరిగి ఇంటికి రాలేదనే ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించిన అనంతపురం పోలీసులు చివరకు అతను హత్య గురైనట్టు తేల్చారు.

తన కొడుకు కనిపించడం లేదంటూ మున్నానగర్ కు చెందిన పాపాసాబ్ ఇబ్రహీం అనంతపురం ఒన్ టౌన్ పోలీసులకు ఈనెల 1 వ తేదీన ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు సి.ఐ రెడ్డెప్ప ఆధ్వర్యంలో పోలీసులు క్రైం నంబర్ 385/2023 మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

పక్కా సమాచారంతో ప్రధాన నిందితుడైన మహమ్మద్ రఫీక్‌ను స్థానిక వినాయక నగర్‌లోని సిద్ధిక్ ఫర్నీచర్ దుకాణం వద్ద అరెస్టు చేశారు. అతనిని విచారించడంతో ధర్మవరం సుఫారీ గ్యాంగుతో కలసి మహమ్మద్ అలీని చంపి కాల్చేసినట్లు చెప్పాడు. ఈ వివరాలు ఆధారంగా హత్య కేసుగా నమోదు చేశారు. మిగితా నిందితుల్లో షేక్ కరిష్మా, షేక్ గౌసియా, షేక్ సిద్ధిక్ అలీని స్థానిక మిర్చీ యార్డు వద్ద మరియు మిగితా ఐదుగురు నిందితులను బత్తలపల్లిలో అదుపులో తీసుకుని విచారించాక అరెస్టు చేశారు.

అరెస్టయిన నిందితుల్లో షేక్ మహమ్మద్ రఫీ ముఖ్యుడని ఎస్పీ తెలిపారు. హత్యకు గురైన మహమ్మద్ అలీ, నిందితుడు రఫీ మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం, పాల్కాన్ ఎక్స్పోర్ట్ & ఇంపోర్ట్ ట్రేడింగ్ కంపెనీలలో రకరకాల వ్యాపారాలు కలిసి చేశారు. ఈ వ్యాపారాలలో ఇద్దరూ రూ. లక్షల్లో నష్టపోయారు. ఇందుకు కారణం నీవంటే నీవేనంటూ ఒకరిపై ఒకరు నెట్టుకోవడంతో స్నేహితుల మధ్య చిన్నగా మనస్పర్థలు మొదలయ్యాయి.

వ్యాపారాలలో నష్టపోయిన డబ్బును చెల్లించాలని అలీ తరచూ అడిగేవాడు. దీనికి తోడు మహమ్మద్ అలీ తరచూ మహమ్మద్ రఫీ ఇంటికి వెళ్లడం... కుటుంబ సభ్యులతో ప్రవర్తించే తీరుపై కక్ష పెంచుకున్నాడు. అడ్డు తొలగించుకుంటే వ్యాపారాలలో నష్టపోయిన డబ్బు కట్టే పని ఉండదని భావించి కడతేర్చాలని నిశ్చయించుకున్నాడు.

ఈక్రమంలో తన స్నేహితుడైన మంగళ కేసన్నగారి రాము @శివరాం సహాయం కోరాడు. దీనికి అంగీకరించిన శివరాం తనకు బాగా తెలిసిన సుఫారీ గ్యాంగును పంపుతానని రూ. 50 వేలు అడ్వాన్సు కింద తీసుకుని గుజ్జల శివ కుమార్, గుజ్జల చంద్ర శేఖర్, గుజ్జల హరి, గుజ్జల కృష్ణలను అనంతపురంకు పంపాడు. నలుగురు కలిసి మహమ్మద్ రఫీక్ లు కలసి మహమ్మద్ అలీని.. షేక్ సిద్ధిక్ అలీకి చెందిన ఫర్నీచర్ గోడౌన్ కు పిలిపించారు.

మహమ్మద్ అలీని బాగా కొట్టి తర్వాత చేతులు కాళ్లు కట్టేసి నోరు, ముక్కుకు ప్లాస్టర్ అతికించి ధర్మవరం నుండీ వచ్చిన నలుగురు నిందితులు వెళ్లిపోయారు. ఆతర్వాత అతను చనిపోయాడు. ఇది గుర్తించిన మహమ్మద్ రఫీ తన భావ అయిన షేక్ సిద్ధిక్ అలీకి విషయం తెలియజేయడంతో అతని ద్వారా కరిష్మా కూడా హత్యాస్థలానికి చేరుకుంది.

హత్య ఆనవాళ్లు లేకుండా చేయాలని భావించిన నిందితుడు మహమ్మద్ అలీ శవాన్ని కారులో తీసికెళ్లి కారుతో సహా శవాన్ని గిద్దలూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పడేయాలని మహమ్మద్ రఫీక్, కరిష్మాలు కారులో అదే రోజు రాత్రి బయల్దేరారు. అనంతపురం నుండీ తాడిపత్రి, బుగ్గ, జమ్ములమడుగు మీదుగా ప్రొద్దుటూరు వెళ్లగానే శవాన్ని తరలిస్తున్న కారు మరమ్మతులకు గురైంది.

అక్కడి నుండి తిరిగి అనంతపురం బయల్దేరారు. శింగనమల మండలం శివపురం వద్దకు రాగానే ఆ కారు పని చేయకుండా ఆగిపోయింది. చుట్టు పక్కల వాళ్లు వచ్చి సహాయపడేందుకు కారును లాగారు. అయినా పని చేయలేదు. ఆసందర్భంగా కారు వెనుక సీటులో ఉన్న శవం ఎవరిదని స్థానికులు అడుగగా... తమ సోదరుడే చనిపోయాడని నమ్మించారు. చివరకు అంబులెన్స్ తెప్పించి అందులో శవాన్ని ఉంచి అనంతపురంలోని నారాయణపురం ఇందిరమ్మ కాలనీలో మహమ్మద్ రఫీక్ నిర్మిస్తున్న కొత్త ఇంటికి వెళ్లారు.

అప్పటికే చాప, దుప్పటి తెప్పించి శవం కనపడకుండా కప్పి ఆ ఇంట్లో ఉంచారు. చుట్టు పక్కల వారిని కూడా నమ్మించారు. తమకు అతి దగ్గర బంధువు చనిపోయాడని... కుష్టు వ్యాధి ఉండటంతో అక్కడికి తీసుకొచ్చామని నమ్మించారు. 28వ తేదీ అర్ధరాత్రి దాటాక ఆ శవాన్ని నారాయణపురం సమీపంలోని శ్మశాన వాటికకు తీసికెళ్లి పెట్రోలు పోసి ఆనవాళ్లు లేకుండా కాల్చినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. హత్యకు సహకరించడం మరియు కారును దాచడంలో షాహీనా, కరణం శ్రీనివాస్ ఫణిల పాత్ర ఉన్నట్లు విచారణలో తేలింది.

నిందితుల వివరాలు:

1. షేక్ మహమ్మద్ రఫీ, వయస్సు 33 సం., చంద్రబాబు కొట్టాలు, అనంతపురము

2.షేక్ కరిష్మా, వయస్సు 28 సం. లు, వినాయకనగర్, అనంతపురము

3. షేక గౌసియా, వయస్సు 30 సం లు, చంద్రబాబు కొట్టాలు, అనంతపురము

4. షేక్ సిద్దిక్ అలీ, వయస్సు 34 సం లు, వినాయకనగర్, అనంతపురము

5 గుజ్జల శివ కుమార్ వయస్సు 35 సం తండ్రి నారాయణ స్వామి సంగాల గ్రామం, బతలపల్లి మండలం, శ్రీసత్యసాయి జిల్లా

6 గుజ్జల చంద్ర శేఖర్, వయస్సు 28 సం లు, నార్సింపల్లి గ్రామం, తాడిమర్రి మండలం, శ్రీసత్యసాయి జిల్లా

7 గుజ్జల హరి, వయస్సు 26 సం లు, సంగాల గ్రామం, బతలపల్లి మండలం, శ్రీసత్యసాయి జిల్లా

8 గుజ్జల కృష్ణ, వయస్సు 32 సం., నార్సింపల్లి గ్రామం, తాడిమర్రి మండలం, శ్రీసత్యసాయి జిల్లా

9 మంగళ కేసన్నగారి రాము @శివరాం, వయస్సు 32 సం లు తండ్రి యల్లప్ప, తాడిమర్రి మండలం, ప్రస్తుతము పార్థసారధి నగర్, ధర్మవరం పట్టణం, శ్రీసత్యసాయి జిల్లా

10 షాహీనా , వయస్సు 20 సం., రాజీవ్ కాలనీ, అనంతపురం

11 కరణం శ్రీనివాస్ ఫణి, వయస్సు 28 సం., మూడవ రోడ్డు, అనంతపురం ( స్వగ్రామం శెట్టూరు మండలం ములకలేడు)

Whats_app_banner