Anantapur : 70 ఏళ్ల వయస్సులో ఇదేం పాడు బుద్ధి.. చిన్నారిపై కన్నేసిన వృద్ధుడు.. అరెస్టు చేసిన పోలీసులు
Anantapur : అనంతపురం జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. మునిమనవరాలి వయస్సు ఉన్న చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సీకేపల్లి మండలంలో జరిగింది.
అనంతపురం జిల్లా సీకేపల్లి మండలంలోని ఒక గ్రామంలో ఆదివారం దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆ గ్రామంలో ఆరేళ్ల బాలిక ఆరుబయట ఆడుకుంటోంది. వరసకు తాతయ్య అయ్యే రామన్న.. చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంటిలోకి తీసుకెళ్లాడు. ఓ గదిలో బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. తాతయ్య వింత ప్రవర్తనను పసిగట్టిన బాలిక.. వృద్ధుడి చర్యలను ప్రతిఘటించింది.
వృద్ధుడి చెర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా చంపేస్తానని బెదిరించాడు. అతికష్టంపై ఆయన నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుని విలపిస్తూ తల్లికి వివరించింది. బాలిక తల్లి వృద్ధుడి ఇంటి వద్దకు వెళ్లి నిలిదీసింది. దీంతో తాను బాలికను ఏమీ చేయలేదని వృద్ధుడు బుకాయించాడు. బాలిక తల్లి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు గ్రామానికి చేరుకుని వృద్ధుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లాలో ఇంట్లో ఇల్లాలు, లాడ్జిలో ప్రియురాలు బాగోతం బయటపడింది. లాడ్జిలో ప్రియురాలితో ఉంటూ కుటుంబ సభ్యులకు అడ్డంగా దొరికిపోయాడు ఓ ఎంపీడీవో. విధి నిర్వహణలో భాగంగా వేరే ప్రాంతానికి వెళ్లిన ఎంపీడీవో అక్కడ పరిచయమైన మహిళతో ప్రేమాయణం సాగిస్తున్నారు. కుటుంబాన్ని కాదని గత కొన్నాళ్లుగా ఆమెతోనే ఉంటున్నారు. అనుమానించిన కుటుంబ సభ్యులు ఎంపీడీవోపై నిఘా పెట్టారు. అతన్ని పట్టుకున్నారు.
ఈ ఘటన ప్రకాశ జిల్లా ఒంగోలు నగరం కర్నూలు రోడ్డు కూడలిలోని ఒక లాడ్జిలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాలో ఎంపీడీవోగా పని చేస్తున్న అధికారి ఒకరు ఎన్నికల సమయంలో బదిలీపై చిత్తూరు జిల్లా వెళ్లారు. అక్కడ ఆయనకు ఏఎన్ఎం ఒకరు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఆయన కుటుంబానికి దూరం అయ్యారు. భార్యాపిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. కనీసం ఇంటికి కూడా వెళ్లడం లేదు.
ఈ పరిణామంతో కుటుంబీకులు ఆయన కదలికలపై నిఘా పెట్టారు. ఆదివారం మధ్యాహ్నం ఒంగోలులోని ఒక లాడ్జిలో ఉన్నట్లు గుర్తించి భార్య, కుమార్తె, కుమారుడు అక్కడకు చేరుకున్నారు. ఎంపీడీవో, ఆయన ప్రియురాలిని పట్టుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జి వద్దకు చేరుకుని ఎంపీడీవో, ఆయన ప్రియురాలిని స్టేషన్‌కు తరలించారు. ఎస్ఐ అనిత వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)