AP Welfare Pensions: ఏపీలో 91శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి, పల్నాడు పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు
AP Welfare Pensions: ఆంధ్రప్రదేశ్‌లో సామాజికర పెన్షన్ల పంపిణీ చురుగ్గా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాముకు ముందే పెన్షన్లను సచివాలయ ఉద్యోగులు ప్రారంభించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని యల్లమందలో ముఖ్యమంత్రి స్వయంగా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. లబ్దిదారులతో ముచ్చటించారు.
AP Welfare Pensions: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గం, యల్లమంద గ్రామానికి విచ్చేసిన ముఖ్యమంత్రి శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి వితంతు పెన్షన్ అంద చేశారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. చిన్న వయసులో పెద్ద దిక్కును కోల్పోయిన కుటటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్వయం ఉపాధి కోసం ఆర్థిక సాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. వృద్ధాప్య పెన్షన్ అందుకుంటున్న ఏడుకొండలు అనే వ్యక్తి ఇంటికి కూడా వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. వారి ఇంట్లో కాఫీ తయారు చేసి అందరితో కలిపి సేవించారు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
12 గంటలకే 91 శాతం పెన్షన్ల పంపిణీ..
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కార్యక్రమాన్ని అత్యంత పక్కాగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మంగళవారం 12 గంటల సమయాని కల్లా 91 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయ్యింది. సచివాలయ ఉద్యోగులు గంటల వ్యవధిలోనే పెద్ద మొత్తంలో పింఛన్ల పంపిణీ చేశారు.
ఏదైనా నెలలో 1వ తేదీ సెలవు వస్తే ముందురోజే పింఛన్ల పంపిణీ చేపడుతోంది. కొత్త సంవత్సరం నేపథ్యంలో జనవరి 1వ తేదీన ఇవాల్సిన పింఛన్లను కూడా ఒక రోజు ముందుగానే డిసెంబర్ 31వ తేదీనే అందిస్తోంది. జనవరి నెలకు సంబంధించి 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.2717 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఒక్క పూటలోనే అత్యధిక శాతం మందికి పింఛను అందించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ నెలతో కలిపి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం రూ. 20 వేల కోట్లకు పైగా పింఛన్ల కోసం ఖర్చు చేసింది.
కుటుంబంలో పింఛను తీసుకునే భర్త చనిపోతే ఆ పింఛను మొత్తాన్ని అతని భార్యకు వితంతువు కేటగిరీ కింద వెంటనే ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. కొత్తగా ఈనెల 5,402 మందికి వితంతు పింఛన్లు మంజూరు చేశారు. అంతేకాదు 3 నెలలుగా పింఛన్ తీసుకోని 50 వేల మందికి కూడా రెండు, మూడు నెలల పింఛన్ మొత్తాన్ని కలిపి ఈ నెలలో ఒకేసారి అందిస్తున్నారు.
ఇంటి వద్దనే పింఛను పై సాంకేతికతతో పర్యవేక్షణ
లబ్దిదారుల ఇంటి వద్దనే పింఛన్లు అందించాలనే నిర్ణయాన్ని పక్కాగా అమలు చేస్తోంది. సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దనే పింఛన్లు అంజేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్ర ఇంటి వద్దనే అందడం లేదనే ఫిర్యాదులు అప్పుడప్పుడు వస్తున్నాయి. దీన్ని నివారించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు అధికారులు సాకేంతికత ద్వారా దీనిపై పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్రంలో ఉన్న 63,34,732 మంది పింఛను లబ్దిదారుల ఇళ్లను జియో ట్యాగ్ చేశారు. దీని ద్వారా పింఛన్ల పంపిణీ వారి ఇళ్ల వద్ద జరుగుతుందా లేదా అనేది రియల్ టైమ్ లో పరిశీలిస్తున్నారు. జియో కో ఆర్డినేట్స్ అనాలసిస్ ద్వారా ఏ జిల్లాలో, ఏ ప్రాంతం, ఏ గ్రామంలో ఎంత వరకు ఇళ్ల వద్ద పంపిణీ జరుగుతుంది అనేది కూడా తెలుసుకుంటున్నారు.
ఇంటినుంచి 300 మీటర్ల లోపు ఎంత మందికి పింఛన్లు ఇచ్చారు....300 మీటర్ల కంటే దూరంలో ఎంతమందికి పింఛన్లు ఇచ్చారు అనేది కూడా రియల్ టైమ్ లో తెలుస్తోంది. దీన్ని విశ్లేషించి అధికారులు సేవలు మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబర్ 31 తేదీ జరుగుతున్న పింఛన్ల పంపిణీలో మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం 91 శాతం పెన్షన్లు పంపిణీ చేయగా, అందులో 93 శాతం మందికి ఇంటి నుంచి 300 మీటర్ల లోపే పింఛన్లు అందించారు.
అత్యధిక శాతం మందికి ఇంటి వద్దనే పెన్షన్ అందజేశారు. మిగిలిన కొద్ది శాతం మందికి ఇంటి నుంచి 300 మీటర్ల దూరంలో పింఛన్ల పంపిణీ జరిగినట్లు నివేదిక వెళ్లడిస్తోంది. అల్లూరి సీతారామరాజు వంటి కొన్ని ఏజెన్సీ జిల్లాల్లో సిగ్నల్స్ సమస్య కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. మొత్తంగా చూసుకుంటే... ఇంటివద్దే పింఛన్లు అనే లక్ష్యం క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు అవుతుందని అధికారులు చెబుతున్నారు. లబ్దిదారుల సంతృప్తే ముఖ్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్పడంతో అధికార యంత్రాంగం ఆ దిశగా కృషి చేసింది.
ప్రజల సంతృప్తి తెలుసుకునేందుకు సిఎం సూచనల మేరకు సాకేంతికతను వినియోగిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు డాష్ బోర్డు ద్వారా సిఎం పింఛన్ల పంపిణీతో పాటు....ఇళ్ల వద్దే పంపిణీ జరిగే విధానాన్ని స్వయంగా పరిశీలిస్తున్నారు. సిగ్నల్ సమస్య ఉన్న చోట మినహా... మిగిలిన అన్ని చోట్లా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను అందజేయాలనే ఆలోచనను పక్కాగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.