కలేకూరి ప్రసాద్.. ఓ మల్లె పువ్వు. పేదల ఇండ్లల్లో పరిమళించే మట్టి వాసన. కన్నీళ్లకు బదులు.. దళితులు చెప్పుకునే ఓ కథ. ఆయన చనిపోయి పుష్కర కాలం దాటింది. అయినా.. ప్రసాద్ అక్షర పరిమళాలు ఇంకా వెదజల్లుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆయన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఎవరీ కలేకూరి ప్రసాద్.. ఆయన ఎందుకు ఇంత ఫేమస్ అయ్యారు. ఇప్పుడు తెలుసుకుందాం.
1.కలేకూరి ప్రసాద్ 1964 అక్టోబర్ 25న జన్మించారు. ఆయన కృష్ణా జిల్లాలోని కంచికచెర్లలో పుట్టారు. ప్రసాద్ తల్లిదండ్రులు లలితా సరోజిని, శ్రీనివాసరావు ఇద్దరూ ఉపాధ్యాయులే.
2.ప్రసాద్ తెలుగు కవి. సినీ గీత రచయిత. సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు. దళిత ఉద్యమకారుడు. ప్రసాద్ 'యువక' అనే కలం పేరుతో కవితలు రాశారు.
3.ప్రసాద్ జననాట్య మండలి, విప్లవ రచయితల సంఘంలో పనిచేశారు. పీపుల్స్ వార్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి.. దళిత ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు.
4.కలేకూరి ప్రసాద్.. 1994 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ తరపున నందిగామ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. డర్బన్‌లో జరిగిన జాతి వివక్షపై చారిత్రాత్మక అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు.
5.చిలకలూరిపేట బస్సు ఘటనలో ఉరిశిక్ష పడిన చలపతి, విజయవర్ధనం కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు. మాదిగ దండోరా ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.
6.ప్రసాద్ రాసిన పాటలు అనేక చిత్రాల్లో కనిపిస్తాయి. 'కర్మభూమిలో పూచిన ఓ పువ్వా', 'భూమికి పచ్చాని రంగేసినట్టూ', 'చిన్ని చిన్ని ఆశలే చిందులేయగా' వంటి పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి.
7.'నిఘా', 'ఏకలవ్య', 'బహుజన' వంటి పత్రికలకు ప్రసాద్ సంపాదకత్వం వహించారు. స్వామి ధర్మతీర్థ రచించిన 'హిందూ సామ్రాజ్యవాద చరిత్ర' పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. అరుంధతీ రాయ్ రచించిన 'ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్'ను కూడా తెలుగులోకి అనువదించారు.
8.కలేకూరి ప్రసాద్.. తెలుగులో "ఆంధ్రప్రదేశ్‌లో దళితులు" అనే పుస్తకం రాశాడు. 1991లో జరిగిన చుండూరు దళిత మారణకాండ నేపథ్యంలో.. దళితులకు మద్దతుగా నిలిచిన వారిలో కలేకూరి ప్రసాద్ ఒకరు. బొజ్జా తారకం, కే.జీ.సత్యమూర్తి వంటి వారితో కలిసి దళిత ఉద్యమంలో పాల్గొన్నారు.
9.కలేకూరి ప్రసాద్.. 2013 మే 17న ఒంగోలులో చనిపోయారు. శనివారం మే 17న అతను మాట్లాడిన పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సంబంధిత కథనం