Sankranti Special Buses : ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - తూర్పుగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్‌కు 88 స్పెషల్ సర్వీసులు
సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను తీసుకొచ్చే పనిలో పడింది. ఇందులో భాగంగా… తూర్పు గోదావరి జిల్లా నుంచి హైదరాబాద్‌కు 88 స్పెషల్ సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు తేదీలతో పాటు సర్వీసుల సంఖ్య వివరాలను వెల్లడించింది.
రాష్ట్రంలోని ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండగకు ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు 88 స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, గోకవరం, కొవ్వూరు నిడదవోలు డిపోల నుంచి హైదరాబాద్‌కు 88 స్పెషల్ సర్వీసులను నడపనుంది.
ఈ స్పెషల్ సర్వీసులు జనవరి 9 నుంచి 13 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి నుంచి 47, గోకవరం నుంచి 16, కొవ్వూరు నుంచి 16, నిడదవోలు నుంచి 9 సర్వీసులు హైదరాబాద్‌కు ఆయా తేదీల్లో నడపనున్నారు. వీటి కోసం సూపర్ లగ్జరీ బస్సులు 50, అల్ట్రా డీలక్స్ బస్సులు 14, ఎక్స్‌ప్రెస్ బస్సులు 24 నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీవో) షర్మిల అశోకా తెలిపారు.
జనవరి 9 తేదీన 12 సర్వీసులు, జనవరి 10 తేదీన 25 సర్వీసులు, జనవరి 11 తేదీన 22 సర్వీసులు, జనవరి 12 తేదీన 25 సర్వీసులు, జనవరి 13 తేదీన 4 బస్సులు నడపనున్నారు. అయితే రద్దీకి అనుగుణంగా మరికొన్ని స్పెషల్ సర్వీసులను పెంచుతామని షర్మిలా అశోకా వివరించారు.
వాడపల్లికి ప్రత్యేక బస్సు సర్వీస్:
విశాఖపట్నం నుంచి వాడపల్లికి ప్రతి శనివారం బస్సు సర్వీస్ అందుబాటులోకి తీసుకొచ్చారు. డిసెంబర్ 14 తేదీ నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుంది. ప్రతి శనివారం విశాఖపట్నంలోని ద్వారకా బస్‌స్టేషన్‌లో ఉదయం 4 గంటలకు బస్సు బయలుదేరుతుంది. ప్రసిద్ధ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం తిరిగి సాయంత్రం 4 గంటలకు వాడపల్లిలో బస్సు బయలు దేరుతుంది.
ఒక్కొక్కరికి ప్రయాణం ఛార్జీ రూ.1,000 నిర్ణయించినట్లు ఆర్ఎం బి. అప్పలనాయుడు, సీటీఎం సత్యనారాయణ తెలిపారు. టిక్కెట్లు కావాల్సిన వారు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. లేకపోతే ద్వారకా బస్ స్టేషన్‌లో కూడా టిక్కట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఏడు శనివారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం దర్శించుకోవటానికి సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చామని అన్నారు.
తిరువణ్ణామలైకు 250 ప్రత్యేక బస్సులు :
కార్తీక దీపం పురస్కరించుకుని తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణకు 250 ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తెచ్చారు. గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం తిరుపతి జిల్లా నుంచి ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చామని చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ విశ్వనాథ్ తెలిపారు.
ఈ నెల 13, 14, 15 తేదీల్లో తిరుపతిలోని కేంద్రీయ బస్‌స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నెంబర్ 27, 28 వద్ద తిరువణ్ణామలై సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే జిల్లాలోని వివిధ డిపోల నుంచి కూడా బస్సులు నపనున్నట్లు తెలిపారు. అదనపు వివరాల కోసం ఆయా డిపోలను సంప్రదించాలని సూచించారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం