రాష్ట్రంలో పాఠశాలలు తెరిచే సమయానికి.. పుస్తకాలతో సహా బ్యాగు, దుస్తులు, షూ, బెల్టులతో కూడిన కిట్లు విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తగ్గట్టుగా ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా అందించాల్సిన కిట్ల వివరాలు ప్రభుత్వానికి నివేదించగా.. ఇప్పటివరకు పలు మండలాలకు వచ్చాయి. మిగతా కిట్‌లు ఈ నెలాఖరు నాటికి అందజేస్తామని అధికారులు చెబుతున్నారు.
1.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తోంది. ఆర్భాటాలకు పోకుండా మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ, కిట్లకు సర్వేపల్లి రాధాకృష్ణ వంటి మహనీయుల పేర్లు పెట్టి ముందుకు సాగుతోంది.
2.మండలాల వారీగా విద్యార్థుల సంఖ్యకు అవసరమైన మేరకు.. పాఠ్య, రాత పుస్తకాలతో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల సరఫరా ప్రారంభించింది.
3.పుస్తకాల బరువు తగ్గేలా.. విద్యార్థుల పుస్తకాల బ్యాగ్ బరువు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏడాదికి రెండు సెమిస్టర్ల విధానానికి నాంది పలికింది.
4.ఒకటి నుంచి పదో తరగతి వరకు సెమిస్టర్ విధానంలోనే పాఠ్య పుస్తకాలను రూపొందించారు. అక్టోబరు నెలలో రెండో సెమిస్టర్ పుస్తకాలు అందిస్తారు. సెమిస్టర్ విధానం కావటంతో పుస్తకాల సైజు తగ్గిపోనుంది.
5.ఒకటి, రెండో తరగతులకు సెమిస్టర్‌కు రెండేసి పుస్తకాలు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. తెలుగు, ఆంగ్లం, గణితం కలిపి ఒక పుస్తకంగా, వర్క్‌బుక్ మరో పుస్తకంగా అందించనున్నారు.
6.మూడు. నాలుగు, ఐదో తరగతులకు తెలుగు, ఆంగ్లం కలిపి ఒక పుస్తకంగా, గణితం, పరిసరాల విజ్ఞానం కలిపి మరో పుస్తకంగా సరఫరా చేయనున్నారు.
7.ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిదో తరగతులకు తెలుగు, ఆంగ్లం, హిందీ కలిపి ఒక పుస్తకంగా తయారు చేయనున్నారు. 8, 9 తరగతుల్లో జీవశాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాలను కలిపి ఒకే పుస్తకంగా తీసుకువచ్చారు. సాంఘిక శాస్త్రంలో భౌగోళిక, చరిత్ర, ఆర్థిక, పౌరశాస్త్రాలు కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు.
8.పదో తరగతికి వచ్చేసరికి.. సెమిస్టర్ విధానంతో పాటు ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు విద్యార్థులకు అందించనున్నారు. రాష్ట్రంలోని పలు మండలాలకు ఇప్పటికే పుస్తకాలు వచ్చాయి. మిగతా మండలాలకు ఈనెలాఖరునాటికి చేరుకుంటాయని అధికారులు చెబుతున్నారు. అక్కడ్నుంచి రెండు, మూడు రోజుల్లో మండలాల్లోని పాఠశాలకు పంపిణీ జరుగుతుందని అంటున్నారు.
సంబంధిత కథనం