BITS and Deeptech: అమరావతిలో బిట్స్ కు 75 ఎకరాలు కేటాయింపు…డీప్ టెక్ యూనివర్శిటీ ఏర్పాటవుతుందన్న లోకేష్
BITS and Deeptech: అమరావతి బిట్స్ క్యాంపస్ ఏర్పాటుకు 75ఎకరాలను కేటాయించినట్టు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రైవేట్, ఫారిన్ వర్శిటీలను ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. అమరావతిలో డీప్ టెక్ యూనివర్శిటీ, విశాఖలో ఏఐ వర్శిటీలు వస్తాయని చెప్పారు.
BITS and Deeptech: అమరవాతి బిట్స్ క్యాంపస్ ఏర్పాటుకు ఏపీ క్యాబినెట్ అమోదం తెలిపింది. రాష్ట్రానికి పెద్దఎత్తున ప్రైవేటు, విదేశీ వర్సిటీలను రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమరావతిలో బిట్స్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిందని 75 ఎకరాల భూమిని కేటాయించినట్టు తెలిపారు.
రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రైవేటు, విదేశీ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించాలని నిర్ణయించి , దేశంలో పేరెన్నికగన్న బిట్స్ క్యాంపస్‌ను అమరావతిలో ఏర్పాటు చేయడానికి 75ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందని లోకేష్ వివరించారు.
టాటా గ్రూప్, ఎల్ అండ్ టి, ఐఐటి మద్రాసు, యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. దీనిని ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని లోకేష్ చెప్పారు.
ప్రైవేట్ యూనివర్శిటీల సవరణ బిల్లు…
ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్దీకరణ సవరణ బిల్లు – 2025 ను మంత్రి నారా లోకేష్ శాసనసభలో ప్రవేశపెడుతూ... దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలను కేంద్రప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోందని, వివిధ ఫారిన్ వర్సిటీల క్యాంపస్ లను రాష్ట్రానికి రప్పించడానికి 2016లో ప్రైవేటు వర్సిటీల చట్టం చేసినట్టు చెప్పారు.
గత ప్రభుత్వం ఈ చట్టానికి 5సవరణలు చేసిందని అవి యుజిసి గైడ్ లైన్స్ కి విరుద్దంగా ఉన్నాయని గ్రీన్ ఫీల్డ్ వర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ -100 గ్లోబల్ వర్సిటీతో జాయింట్ డిగ్రీ ఉండాలని నిబంధన విధించారు. ఈ విషయంలో యుజిసి నిబంధనలు వేరుగా ఉన్నాయన్నారు. పూర్తిస్థాయిలో చర్చించి, ఆ చట్టాన్ని సవరించాల్సి ఉందన్నారు. విశాఖలో ఎఐ వర్సిటీ, అమరావతిలో స్పోర్ట్ వర్సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.
యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, ఎఎంఇ వర్సిటీ ఫిలిప్పీన్స్ ఆసక్తి కనబర్చాయని ఇతర వర్సిటీల ప్రతినిధులు కూడా చర్చలకు వస్తున్నారని పెద్దఎత్తున ప్రైవేటు రంగంలో భారత్ లో టాప్ వర్సిటీలతోపాటు విదేశీ యూనివర్సిటీలను ఎపికి తెచ్చేవిధంగా ప్రోత్సహిస్తామని చెప్పారు. కేవలం అమరావతి, విశాఖపట్నంకే కాకుండా అన్నిప్రాంతాలకు తెస్తామన్నారు.
రాష్ట్రానికి తరలి వచ్చే విద్యా సంస్థలకు ప్రోత్సాహకాలు అధికంగా ఇచ్చి రాయలసీమకు కూడా వర్సిటీలు రప్పించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.. కనిగిరి ప్రాంతానికి ట్రిపుల్ ఐటి ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని ఆంధ్రకేసరి యూనివర్సిటీని 2022లో ఎటువంటి శాంక్షన్ పోస్టులు లేకుండా ఎలాంటి పోస్టులు లేకుండా ప్రకాశం జిల్లాలో ఏర్పాటుచేశారని దీనివల్ల ప్రొఫెసర్లు, సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతానికి దాతలు కూడా ముందుకు వస్తున్నారని ఇందుకోసం ప్రత్యేకమైన మెకానిజం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీని కూడా అభివృద్ధి చేస్తామని లోకేష్ చెప్పారు.
సంబంధిత కథనం