AP Weather Update : జనవరి నెలలో ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఎలా ఉంటుంది.. 7 ముఖ్యమైన అంశాలు-7 important things to know about andhra pradesh weather in january ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Weather Update : జనవరి నెలలో ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఎలా ఉంటుంది.. 7 ముఖ్యమైన అంశాలు

AP Weather Update : జనవరి నెలలో ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఎలా ఉంటుంది.. 7 ముఖ్యమైన అంశాలు

Basani Shiva Kumar HT Telugu
Jan 02, 2025 10:41 PM IST

AP Weather Update : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. జనవరి నెలలో చలి తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా జనవరి మాసంలో వాతావరణానికి సంబంధించిన ముఖ్యమైన 7 అంశాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ వాతావరణం
ఆంధ్రప్రదేశ్ వాతావరణం (istockphoto)

జనవరిలో రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానూ.. కోస్తాంధ్రలో సాధారణం కంటే స్వల్పంగా ఎక్కువగానూ ఉంటాయని.. వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐఎండీ అంచనాల ప్రకారం.. రెండు నుండి నాలుగు రోజులు మినహా.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో జనవరిలో చలి పెద్దగా ఉండదు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం నుండి సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. జనవరిలో రాష్ట్రంలో చలిగాలులు ఉండవు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
yearly horoscope entry point

7 ముఖ్యాంశాలు..

1.జనవరి నుండి మార్చి వరకు ఆంధ్రప్రదేశ్‌లో వర్షపాతం సాధారణం నుండి సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

2.జనవరి, ఫిబ్రవరి, మార్చి సీజన్లలో దేశవ్యాప్తంగా కాలానుగుణ వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉంది. ఇది దీర్ఘకాలిక సగటు (ఎల్పీఏ)లో 88 నుండి 112 శాతం వరకు ఉంటుంది.

3.ఎనిమిది జిల్లాలతో కూడిన రాయలసీమ సబ్-డివిజన్లలో జనవరిలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని.. వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో జనవరిలో సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని అంచనా వేశారు.

4.జనవరిలో రెండు నుండి నాలుగు రోజులు కాస్త చలిగా ఉంటుందని ఐఎండీ అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు వెచ్చని శీతాకాలామే ఉంటుందని స్పష్టం చేశారు. జనవరి, ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ అంతటా చలిగాలులు వీచే అవకాశం లేదని స్పష్టం చేశారు.

5.అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని కొన్ని కొండ ప్రాంతాల్లో జనవరి రెండవ వారం నుండి పొగమంచుతో చలి ఎక్కువగా ఉంటుందని.. అధికారులు అంచనా వేశారు. మూడు నుండి నాలుగు రోజుల పాటు పొగమంచు వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ నిపుణులు వివరించారు.

6.అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లెలో జనవరి 8, 2023న అత్యల్పంగా 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అప్పుడు సన్నని మంచు పలకలు కనిపించాయి. కానీ.. ఈ శీతాకాలంలో ఇప్పటివరకు గిరిజన ప్రాంతాలలో ఆ పరిస్థితి కనిపించలేదని అధికారులు వివరించారు.

7.జనవరి వచ్చినా రాష్ట్రంలో ఇంకా ఉన్ని దుస్తుల అమ్మకాలు పుంజుకోలేదు. గతంలో.. నవంబర్ మూడో వారంలోనే వినియోగదారులు ఉన్ని దుస్తులను కొనుగోలు చేసేవారని వ్యాపారులు చెబుతున్నారు. కానీ ఈ సంవత్సరం వ్యాపారం దెబ్బతిందని.. ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదని వ్యాపారులు చెబుతున్నారు.

Whats_app_banner