Vijayawada Metro : విజయవాడ మెట్రో రైలు కల సాకారానికి తొలి అడుగు.. 6 ముఖ్యమైన అంశాలు
Vijayawada Metro : మెట్రో రైలు.. విజయవాడ వాసుల కల. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచీ.. దీనిపై ఊరిస్తూనే ఉన్నారు. గతంలో అదిగో.. ఇదిగో అంటూ ప్రకటనలు ఇచ్చారు. తాజాగా.. మెట్రో కల సాకారానికి తొలి అడుగు పడింది. భూసేకరణ ప్రతిపాదనలను ఏపీఎంఆర్‌సీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు.

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. గతంలో భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చినా.. అడుగు పడలేదు. తాజాగా మళ్లీ భూసేకరణపై ఏపీఎంఆర్‌సీ అధికారులు దృష్టిపెట్టారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో దాదాపు 90 ఎకరాలు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు దీన్ని సమర్పించారు. దీనికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
ముఖ్యమైన అంశాలు..
1.విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి రెండు కారిడార్లలో 34 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. గతంలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి, టెండర్లను పిలిచారు. వివిధ కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. దీంతో మళ్లీ మొదటి నుంచి భూసేకరణ ప్రక్రియను ప్రారంభించారు.
2.ఇప్పటికైతే.. దాదాపు 90 ఎకరాల భూమి అవసరం అని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భూమిని సేకరించాల్సి ఉంది. విజయవాడలో 30 ఎకరాలు, మిగతాది కృష్ణా జిల్లా పరిధిలో అవసరమని నిర్ధారించారు. మొదట నిడమానూరు వద్ద కోచ్ డిపో ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు కేసరపల్లి వద్ద ఏర్పాటు చేయనున్నారు.
3..మొదటి దశలో గన్నవరం నుంచి పీఎన్‌బీఎస్, పెనమలూరు నుంచి పీఎన్‌బీఎస్ కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం ఎక్కడెక్కడ ఎంత భూమి అవసరమనే ప్రతిపాదనలను మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు. త్వరలోనే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు, మెట్రో రైల్ అధికారులు కలిసి సమన్వయ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
4.మొదటి కారిడార్ పీఎన్‌బీఎస్ వద్ద ప్రారంభమై.. విజయవాడ రైల్వేస్టేషన్‌ను కలుపుతూ ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు వద్ద జాతీయ రహదారిపైకి వచ్చి.. అక్కడి నుంచి గన్నవరం వరకూ వెళుతుంది.
5.రెండో కారిడార్ 12.5 కిలోమీటర్లు ఉంటుంది. పీఎన్‌బీఎస్ నుంచి ప్రారంభమై.. బందరు రోడ్డు మీదుగా బెంజ్ సర్కిల్, ఆటోనగర్, కానూరు, పోరంకి మీదుగా పెనమలూరు వరకూ వెళుతుంది. ఈ మార్గంలో బందరు రోడ్డులో విక్టోరియా మ్యూజియం, ఇందిరాగాంధీ స్టేడియం, బెంజ్ సర్కిల్, ఆటోనగర్, అశోకనగర్, కృష్ణానగర్, కానూరు సెంటర్, తాడిగడప, పోరంకి ఉన్నాయి.
6.వాస్తవానికి నాలుగు కారిడార్లుగా విజయవాడ మెట్రో రైల్ నిర్మాణం చేపట్టాలనుకున్నారు. కానీ ఇప్పటికైతే.. రెండింటిపైనే ఫోకస్ పెట్టారు. విజయవాడలోని పీఎన్‌బీఎస్ వద్ద ఈ రెండు కారిడార్లు కలిసేలా.. గతంలో రూపొందించిన ప్రతిపాదనల ప్రకారమే భూసేకరణ చేయనున్నారు.