APPSC Group 1 Mains : గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన.. అండగా నిలిచిన షర్మిల.. 6 ముఖ్యమైన అంశాలు
APPSC Group 1 Mains : మొత్తం 81 పోస్టుల భర్తీకి మార్చి 17న ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. గ్రూప్-2 తరహాలో గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలన్న డిమాండ్ ఉంది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఆధ్వర్యంలో.. త్వరలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగోతున్నాయి. అయితే.. గ్రూప్-2 తరహాలోనే 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. వారికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అండగా నిలిచారు. అభ్యర్థుల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి 6 ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
1.ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్రంలోని గ్రూప్-1 అభ్యర్థుల పక్షాన మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రూప్-2, డిప్యూటీ ఈవో పోస్టుల ఎంపికలో అనుసరించిన 1:100 విధానాన్ని, గ్రూప్ 1 మెయిన్స్‌కి సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాం.
2.జీవో నంబర్ 5 ప్రకారం.. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఏపీపీఎస్సీకి ఉంది. ఆ అధికారాన్ని ఉపయోగించి 1:100 రేషియో ప్రకారం అవకాశం ఇవ్వమని అభ్యర్థులు అడగడంలో న్యాయం ఉంది.
3.89 పోస్టులకు మీరు ఇచ్చిన 1:50 రేషియో ద్వారా 4450 మంది మెయిన్స్‌కి అర్హత పొందారు. 1:100 రేషియో లెక్కన పిలిస్తే.. మరో 4450 మందికి అవకాశం దక్కుతుందని అభ్యర్థులు ఆశ పడుతున్నారు.
4.గ్రూప్-2, గ్రూప్-1 పరీక్షల మధ్య సమయం తక్కువగా ఉండటం, సిలబస్ మధ్య వ్యత్యాసం, కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్‌లోనే పరీక్షలు నిర్వహించడం లాంటి కారణాలతో నష్టపోయామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
5.ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్-1 ఉద్యోగాలు మళ్లీ పోతే ఇప్పట్లో ఇక నోటిఫికేషన్ ఉండదని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ నీ కలిసి విజ్ఞప్తి చేసినా.. ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
6.గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల కాకముందే.. అభ్యర్థుల విజ్ఞప్తులను పరిశీలించి, న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని షర్మిల ట్వీట్ చేశారు.
గ్రూప్-1 ఖాళీలు ఇలా..
డిప్యూటీ కలెక్టర్ పోస్టులు-9
ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్-18
డీఎస్పీ (సివిల్)- 26
రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్-6
డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు-5
జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్- 4
జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి- 3
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్- 3
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్- 2
జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్- 1
జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్-1
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ II-1
ఎక్సైజ్ సూపరింటెండెంట్- 1