AP Missing Citizens: ఏపీ ప్రభుత్వ లెక్కల్లో 50లక్షల మంది పౌరుల వివరాలు మాయం, పథకాల్లో లేని వాళ్లే బాధితులు
AP Missing Citizens: ఆంధ్రప్రదేశ్ జనాభాల్లో అక్షరాలా యాభై లక్షల మంది వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో లేవు. రాష్ట్ర జనాభాకు, ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారానికి పొంతన లేదు. పదేళ్లలో పలుమార్లు ఇంటింటి సర్వేలు చేపట్టినా 50లక్షల మంది పౌరుల సమాచారం ప్రభుత్వం వద్ద లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
AP Missing Citizens: రాష్ట్ర విభజన తర్వాత నిర్వహించిన ప్రజాసాధికార సర్వే మొదలుకుని వైసీపీ ప్రభుత్వ హయంలో చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వరకు ఇంటింటిని జల్లెడ పట్టి రికార్డుల్లో నమోదు చేసినా ఏపీలో అక్షరాలా 50లక్షల మంది పౌరుల సమాచారం ప్రభుత్వ రికార్డుల్లో లేదు.
రాష్ట్ర జనాభా దాదాపు 5.4కోట్ల మంది అయితే వారిలో దాదాపు పది శాతం మంది వివరాలు ఇప్పటికి ప్రభుత్వ లెక్కల్లో లేవు. వీరిలో ప్రధానంగా ఆదాయపన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ పెన్షనర్లు ఎక్కువగా ఉన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత లేని వారిని ప్రభుత్వ లెక్కల్లోకి ఎక్కించడాన్ని పదేళ్లుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నగదు బదిలీ పథకాలు వంటివి అందకపోగా కనీసం ప్రభుత్వ రికార్డుల్లో చోటు కూడా దక్కించుకోలేకపోయారు.
ఇటీవల విజయవాడ నగరాన్ని వరదల ముంచెత్తిన సమయంలో దాదాపు 7లక్షల మంది ప్రజలు ముంకు గురయ్యారు. నగరంలో 32 డివిజన్లు బుడమేరు వరద ముంపులో ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వం ఉదారంగా పరిహారాన్ని ప్రకటించిన పెద్ద సంఖ్యలో బాధితులకు పరిహారం అందలేదు. ఇలా పరిహారం దక్కని వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. దీనికి కారణం బాధితుల వివరాలు ప్రభుత్వ మ్యాపింగ్, జియో ట్యాగింగ్ లెక్కల్లో లేకపోవడమే అసలు కారణం.
గత పదేళ్లుగా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు అర్హులని గుర్తించే క్రమంలో వివిధ రకాల అర్హతల ఆధారంగా పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కోటి 55లక్షల వంటింటి గ్యాస్ కనెక్షన్లు ఉంటే కోటి 48లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గృహావసర గ్యాస్ కనెక్షన్లు ఉన్నారేషన్ కార్డులు లేని ఏడెనిమిది లక్షల కుటుంబాలకు చెందిన వారి వివరాలు ప్రభుత్వ లెక్కల్లో గల్లంతై పోయాయి.
పన్నులు చెల్లించడమే పాపమైంది…
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారిలో పన్నులు చెల్లిస్తూ ఐటీ రిటర్నులు వేసే వారిని సంక్షేమ పథకాలు వర్తించవు. 2006కు ముందు ఇలాంటి కుటుంబాలకు ప్రభుత్వ గుర్తింపు కోసం కనీసం గులాబీ రంగు పెన్షన్ కార్డును జారీ చేసేవారు. ఫ్యామిలీ కార్డు ద్వారా వారికి గుర్తింపు లభించేది. ఆదాయం, కుల, నివాస సర్టిఫికెట్లను జారీ చేయడానికి ఈ కార్డులను ప్రామాణికంగా తీసుకునే వారు. పింక్ కార్డులను రద్దు చేశాక మధ్య తరగతి కుటుంబాలకు కనీస గుర్తింపు లేకుండా పోయింది.
నవంబర్ నెలాఖరు నాటికి భూమి పత్రాలు, మునిసిపల్-పట్టణాభివృద్ధి శాఖ వివరాలు, డిస్కమ్‌లు, గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా రాష్ట్రంలో ఉన్న జనాభాకు ప్రభుత్వ లెక్కల్లో ఉన్న వారి వివరాలను పోల్చి చూస్తే దాదాపు 50లక్షల మంది వివరాలు లేనట్టు గుర్తించారు. డిసెంబర్ 31లోగా కుటుంబాలను, వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలని ఆదేశించినా ఆ కార్యక్రమం నత్తనడకన సాగుతోంది.
ప్రస్తుతం ఏపీలో ఇంటింటి మ్యాపింగ్, జియోట్యాగింగ్ వంటివి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబాలను మ్యాపింగ్ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల్లో లేని పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగాలు, పెన్షనర్ల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయడం లేదు.
ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడిన వాళ్లు, సంక్షేమ పథకాలు వర్తించని వారి వివరాలపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఈ వివరాలు సేకరించాల్సి ఉన్నా సచివాలయాల పరిధిలో ఉన్న వివరాల ఆధారంగా ఫోన్ నంబర్ల వచ్చే ఓటీపీల ఆధారంగా మ్యాపింగ్ పని పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో అనర్హులకు పెద్ద ఎత్తున కొనసాగుతున్న రేషన్ కార్డుల్ని ప్రక్షాళన చేయాల్సి ఉన్నా క్షేత్ర స్థాయి పరిశీలనే దారితెన్ను లేకుండా సాగుతోంది.