TDP Membership : టీడీపీ సభ్యత్వం.. ప్రమాద బీమా పొందేందుకు మార్గదర్శకాలు జారీ.. 5 ముఖ్యమైన అంశాలు
TDP Membership : కార్యకర్తల సంక్షేమమే పార్టీ ధ్యేయం అని.. తెలుగుదేశం స్పష్టం చేసింది. పార్టీ సభ్యత్వం తీసుకున్న కోటి మందికి రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది. ప్రమాద బీమా పొందేందుకు అవసరమైన మార్గదర్శకాలను తాజాగా టీడీపీ జారీ చేసింది. దీనికి సంబంధించిన ముఖ్యమైన 5 అంశాలు ఇలా ఉన్నాయి.
దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం తెలుగుదేశానికి ఉందని.. టీడీపీ స్పష్టం చేసింది. కార్యకర్తల సంక్షేమానికి ఎప్పుడూ పెద్దపీట వేస్తున్నామని తెలిపింది. కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక.. కార్యకర్తల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో.. 2024 అక్టోబర్ 26న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది డిసెంబర్ 31తో ముగియాల్సి ఉంది. కానీ.. మరో 15 రోజులు పొడిగించారు.
ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో దాదాపు కోటి మంది వరకు టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. కార్యకర్తలు ఏదైనా ప్రమాదంలో మరణించినప్పుడు ఆదుకోవడానికి సభ్యత్వ నమోదు ఉపయుక్తంగా ఉంటుందని నేతలు చెబుతున్నారు. ఈ మేరకు కోటి మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేందుకు లోకేష్.. యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. కార్యకర్తలు ప్రమాద బీమా పొందేందుకు అవసరమైన పత్రాలు, మార్గదర్శకాలను తాజాగా టీడీపీ జారీ చేసింది.
ఇవీ మార్గదర్శకాలు..
1.ప్రమాద బీమా పొందేందుకు బాధిత కుటుంబం ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఎస్.ఐ సంతకం, స్టాంప్‌తో కూడిన ఫిర్యాదు లేఖ, శవ పంచనామా, పోస్ట్ మార్టమ్ నివేదిక, మండల రెవెన్యు అధికారి జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం (ఫ్యామిలీ సర్టిఫికెట్) సమర్పించాల్సి ఉంటుంది.
2.వీటితో పాటు ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్, 4 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు అందించాలి. న్యూస్ పేపర్ కటింగ్‌లు, ప్రమాదం జరిగినప్పుడు తీసిన 2 ఫోటోలను జత చేయాలి.
3.నామినీ ఆధార్, ఓటర్ కార్డ్, 4 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, పాన్ కార్డు అందించాలి. ఆయా పత్రాలన్నీ ఒక సెట్ ఒరిజినల్, 2 సెట్లు జిరాక్స్ కాపీలు జతపరచాలి.
4.ఏదైనా ప్రమాదంలో వ్యక్తి మరణించినప్పుడు 15 రోజుల్లో తెలియపరచాలి. ప్రమాదం జరిగిన 30 రోజుల్లోగా నామినీ స్వయంగా డాక్యుమెంట్లు తీసుకుని గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలి.
5.ప్రమాద బీమా పొందడంలో ఏమైనా సందేహాలు ఉంటే.. పూర్తి సమాచారం కోసం 73062 99999 నెంబర్‌కు ఫోన్ చేయాలని తెలుగుదేశం పార్టీ సూచించింది.