Telugu News  /  Andhra Pradesh  /  5 Accused In Viveka Murder Case Will Appear In Hyderabad Cbi Court On Feb 10th
వైఎస్ వివేకానంద రెడ్డి(ఫైల్ ఫొటో)
వైఎస్ వివేకానంద రెడ్డి(ఫైల్ ఫొటో)

Viveka Murder Case : వివేకా హత్య కేసు.. 10వ తేదీన ఆ ఐదుగురు హాజరు

05 February 2023, 13:04 ISTHT Telugu Desk
05 February 2023, 13:04 IST

YS Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కొనసాగుతోంది. అయితే ఐదుగురికి తాజాగా సమన్లు జారీ చేశారు. హైదరాబాద్ సీబీఐ కోర్టులో నిందితులు హాజరుకానున్నారు.

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు(YS Viveka Murder Case) విచారణ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ఈ కేసు చర్చనీయాంశమవుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఇటీవలే సీబీఐ(CBI) విచారించింది. దీంతో ఈ కేసు మరోసారి.. చర్చనీయాంశమైంది. ఈ కేసులో కీలకమైన ఐదుగురు నిందితులు.. ఈ నెల 10వ తేదీన హాజరుకావాలని సమన్లు జారీ అయ్యాయి. ఐదుగురు నిందితులు.. ఒకేసారి కోర్టుకు హాజరుకావడం.. ఇదే తొలిసారి.

ట్రెండింగ్ వార్తలు

ఇప్పటికే కడప సెంట్రల్ జైలులో ఉన్న ముగ్గురు నిందితులకు ప్రొటక్షన్ వారెంట్ బెయిల్ పై ఉన్న మరో ఇద్దరికీ సమన్లు వెళ్లాయి. సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితోపాటుగా బెయిల్ పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరిలు సీబీఐ కోర్టు(CBI Court)లో హాజరు కావాలి.

మరోవైపు వైఎస్‌ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన నవీన్ అనే పేరుపై అంతా ఆసక్తిగా ఆరా తీస్తున్నారు. 2019లో వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి రెండు ఫోన్ నంబర్లతో ఎక్కువ సార్లు మాట్లాడినట్లు గుర్తించిన సీబీఐ అధికారులు, ఆ నంబర్లు ఎవరివని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే నవీన్ అనే పేరు తెరపైకి వచ్చింది.

వివేకా హత్య కేసు(Viveka Murder Case)లో కడప ఎంపీ అవినాష్ రెడ్డిన విచారించింది. గత నెల 28న సీబీఐ కార్యాలయంలో విచారణకు అవినాష్ రెడ్డి హాజరయ్యారు. ఎంపీ అవినాష్‌రెడ్డి ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా ఈ పేరు వెల్లడైంది. ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసంలో అన్ని వేళలా అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది.

నవీన్‌ కుటుంబం పులివెందులలోని రాజారెడ్డి కాలనీలో నివాసం ఉంటోంది. జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి దగ్గర వీరి కుటుంబం పని చేసేది. ఆ తర్వాత నవీన్‌ అలియాస్ హరిప్రసాద్, జగన్ దగ్గర పనిచేసేవారు. రాజారెడ్డి కాలంలో హరిప్రసాద్‌ అలియాస్ గోపరాజు నవీన్ కుటుంబీకులు దోబీ పని చేసేవారని గ్రామస్తులు చెబుతున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం ఇప్పట్ల గ్రామానికి చెందిన నవీన్ దాదాపు 15ఏళ్లుగా జగన్ దగ్గర పనిచేస్తున్నారు.

జగన్‌తో పాటు బెంగళూరు, హైదరాబాద్‌(Hyderabad)లో లోటస్‌ పాండ్‌లో ఆయన దగ్గర పని చేశారు. 2018 చివరిలో జగన్‌ కుటుంబం తాడేపల్లికి మకాం మారినప్పుడు వారితో పాటు ఇక్కడికి చేరుకున్నారు. దాదాపు 15 ఏళ్లుగా వారితోనే ఉంటున్నారు. ఇంటి పనులు చేసిపెట్టడంతో పాటు అన్ని వేళలా అందుబాటులో ఉండటంతో అత్యవసర సమయాల్లో దగ్గరి బంధువులు అతనికే ఫోన్ చేసి సంప్రదిస్తుంటారని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే మాజీ మంత్రి వివేకా హత్య జరిగిన తర్వాత తెల్లవారు జామున తాడేపల్లిలో ఉండే నవీన్‌కు అవినాష్‌రెడ్డి పలుమార్లు ఫోన్‌ చేసినట్లు కాల్‌డేటా ఆధారంగా సీబీఐ గుర్తించింది. దీంతో నవీన్ ఎవరనే దానిపై సీబీఐ దృష్టి సారించింది. అతని మొదటి పేరు హరిప్రసాద్‌ కాగా... నవీన్‌గా పేరు మార్చుకున్నట్లు గుర్తించారు. వివేకా హత్య తర్వాత తాడేపల్లిలోని ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేందుకు నేరుగా వారి ఫోన్‌ నంబర్లను సంప్రదించకుండా నవీన్ నంబరుతో ఎందుకు మాట్లాడారని సీబీఐ విచారిస్తోంది.