Railway Updates : ప్రయాణికులకు అలర్ట్... ఏపీలో 44 రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు - వివరాలివే
ఏపీలో మరోసారి భారీగా రైళ్లు రద్దయ్యాయి. విజయవాడ మీదుగా నడిచే 44 రైళ్లను తాజాగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 6, 7, 8, 9 తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉండవని పేర్కొన్నారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు.
ఏపీలో వర్షాలు, వరదలతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ పరిధిలో వరదల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. రాయనపాడు స్టేషన్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో చాలా రైళ్లు రద్దయ్యాయి.
విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. మరోవైపు రైల్వేశాఖ అధికారులు కూడా అన్ని రైళ్లను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వరదల కారణంగా పలుచోట్ల మరమ్మత్తు పనులు చేస్తున్నారు. దీంతో తాజాగా పలు రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు విజయవాడ డివిజన్ అధికారులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 44 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
సెప్టెంబర్ 6, 7, 8, 9 తేదీల్లో పలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో చూస్తే విజయవాడ, రాజమండ్రి, తెనాలి, గుంటూరు, గుడివాడ, నిడదవోలు, నర్సాపూర్, ఒంగోలు, మచిలీపట్నం, భీమవరం, రేపల్లె మధ్య నడిచే పలు సర్వీసులు ఉన్నాయి. మరికొన్ని రైళ్లను కూడా దారి మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక రైళ్లు:
వరుస పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా సర్వీసులు నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. 10 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయని వెల్లడించారు. అలాగే వరదల కారణంగా రద్దు చేసిన పూరి- తిరుపతి, చెన్నై సెంట్రల్- ఎస్ఎంవీడీ కాట్రా ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునరుద్ధరించారు. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వరకు వన్ వే ఏసీ ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చారు. వరదల కారణంగా రైల్వే ట్రాక్‌లు ధ్వంసం కావడంతో సెప్టెంబర్ 5, 6, 7 తేదీల్లో 13 రైళ్లు రద్దు చేశారు.
1. సికింద్రాబాద్‌లో బయలుదేరే సికింద్రాబాద్ - విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07097 ) రైలు సెప్టెంబర్ 8 నుండి డిసెంబర్ 1 వరకు అందుబాటులో ఉంటుంది.
2. విశాఖపట్నంలో బయలుదేరే విశాఖపట్నం-సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07098) రైలు సెప్టెంబర్ 9 నుండి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటుంది.
3. సికింద్రాబాద్‌లో బయలుదేరే సికింద్రాబాద్ - బ్రహ్మపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07027) రైలు సెప్టెంబర్ 6 నుండి నవంబర్ 29 అందుబాటులో ఉంటుంది.
4. బ్రహ్మపూర్ నుండి బయలుదేరే బ్రహ్మపూర్ - సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07028) రైలు సెప్టెంబర్ 7 నుండి నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.
5. భువనేశ్వర్‌లో బయలుదేరే భువనేశ్వర్ - బెలగావి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (02813) రైలు సెప్టెంబర్ 7 నుండి నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.
6. బెలగావిలో బయలుదేరే బెలగావి-భువనేశ్వర్ వీక్లీ స్పెషల్ (02814) రైలు సెప్టెంబర్ 9 నుండి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటుంది.
7. తిరుపతిలో బయలుదేరే తిరుపతి- శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07440) రైలు అక్టోబర్ 10 నుండి డిసెంబర్ 1 వరకు అందుబాటులో ఉంటుంది.
8. శ్రీకాకుళం రోడ్‌లో బయలుదేరే శ్రీకాకుళం రోడ్- తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07441) రైలు అక్టోబర్ 7 నుండి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటుంది.
9. నాందేడ్‌లో బయలుదేరే నాందేడ్ - బెర్హంపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07431) రైలు అక్టోబర్ 12 నుండి నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.
10. బెర్హంపూర్ నుండి బయలుదేరే బెర్హంపూర్- నాందేడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07432) రైలు అక్టోబర్ 13 నుండి డిసెంబర్ 1 వరకు అందుబాటులో ఉంటుంది.