visakha Harbour accident: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో 40బోట్లు దగ్ధం
visakha Harbour accident: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 40ఫిషింగ్ బోట్లు కాలి బూడిదయ్యాయి. ఖరీదైన బోట్లు కాలిపోవడంతో మత్స్యకారులకు కోట్లలో నష్టం వాటిల్లింది.
visakha Harbour accident: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 40ఫిషింగ్ బోట్లు కాలి బూడిదయ్యాయి. ఖరీదైన బోట్లు కాలిపోవడంతో మత్స్యకారులకు కోట్లలో నష్టం వాటిల్లింది.
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఆదివారం రాత్రి పొద్దుపోయాక ఫిషింగ్ హార్బర్‌లో నిలిపి ఉంచిన బోటులో మంటలు చెలరేగాయి.వాటిని అదుపు చేసేందుకు మత్స్యకారులు ప్రయత్నిస్తుండగానే క్షణాల్లో ఇతర బోట్లకు వ్యాపించాయి.
ఓ బోటులో మొదలైన మంటలు నిమిషాల వ్యవధిలో పక్కబోట్లకు విస్తరించాయి. అగ్నిప్రమాదం సమాచారం తెలియడంతో ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు.
బోట్లలో నిల్వ చేసిన డీజిల్, మత్స్యకారులు వంట కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్లు పెద్ద శబ్దాలతో పేలిపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు 40బోట్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి.
ప్రమాదంలో బోట్లలో ఎవరైనా నిద్రిస్తున్నారని మత్స్యకారులు ఆందోళన చెందారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత వాటిని పరిశీలించారు. ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫిషింగ్ హార్బర్లో బోట్లు ప్రమాదవశాత్తూ కాలిపోయాయా, ఆకతాయి చర్యలు ఉన్నాయా అనే దానిపై విచారణ జరుపుతున్నారు. మరోవైపు ప్రమాదంలో పెద్ద సంఖ్యలో బోట్లు కాలిపోవడంతో బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఉదయాన్నే ఫిషింగ్ హార్బర్‌కు వచ్చిన బాధితులు తగలబడిన బోట్లను చూసి విలపిస్తున్నారు.
విశాఖ షిప్ యార్డులో జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారులకు చెందిన 40బోట్లు, కోట్లాదిరూపాయల మత్స్యసంపద అగ్నికి ఆహుతికి కావడం బాధ కలిగించిందని టీడీపీ నాయకుడు నారా లోకేష్ తెలిపారు. అత్యంత సున్నితమైన షిప్ యార్డు ప్రాంతంలో భద్రతా చర్యల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణమని, ప్రమాదంలో నష్టపోయిన వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని పేదలన్నారు.
నిరుపేద మత్స్యకారులను ప్రభుత్వం పెద్దమనసుతో స్పందించి వారికి కొత్తబోట్లు, మెరుగైన నష్టపరిహారం అందించి ఆదుకోవాలన్నారు. అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి, మరోసారి ఇటువంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ప్రమాదంపై జనసేన అధ్యక్షుడు పవన్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం వల్ల నష్టపోయిన బోట్లు యజమానులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. వీటిపై ఆధారపడ్డ మత్స్యకారులకు జీవన భృతి అందించాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై విచారణ చేపట్టాలని, భద్రతపరమైన అంశాలపై సమీక్షించి, పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.
బాధితుల్ని ఆదుకోవాలని సిఎం ఆదేశం…
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుల బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం వైయస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.