Investments in AP : పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా ట్రాకింగ్ చేయాలి.. చంద్రబాబు కీలక ఆదేశాలు-3rd meeting of state investment promotion board chaired by cm chandrababu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Investments In Ap : పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా ట్రాకింగ్ చేయాలి.. చంద్రబాబు కీలక ఆదేశాలు

Investments in AP : పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా ట్రాకింగ్ చేయాలి.. చంద్రబాబు కీలక ఆదేశాలు

Basani Shiva Kumar HT Telugu
Jan 30, 2025 04:26 PM IST

Investments in AP : చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశం జరిగింది. 15 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 19,580 ఉద్యోగాల కల్పన జరగవచ్చని బోర్డ్ అంచనా వేసింది. పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా ట్రాకింగ్ చేయాలని సీఎం ఆదేశించారు.

చంద్రబాబు
చంద్రబాబు (@AndhraPradeshCM)

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ మూడో సమావేశం జరిగింది. ఈ భేటీలో 15 ప్రాజెక్టులకు బోర్డ్ ఆమోదం తెలిపింది. ఎస్ఐపీబీ ఇప్పటివరకు ఆమోదం తెలిపిన పెట్టుబడుల విలువ రూ. 3 లక్షల కోట్లు దాటాయి. వీటితో పాటు అర్సెల్లార్ మిట్టల్, ఎన్టీపీసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి సంస్థల పెట్టుబడులకు ఇప్పటికే లైన్‌ క్లియర్ అయ్యింది.

yearly horoscope entry point

7 నెలల్లో మూడుసార్లు..

గడిచిన 7 నెలల కాలంలో తీసుకొచ్చిన పాలసీలు, అందిస్తున్న సహకారంతో పెట్టుబడుల రాక ఆశాజనకంగా సాగుతోంది. మొదటి ఎస్ఐపీబీ సమావేశంలో రూ.83,987 కోట్లు, రెండో భేటీలో రూ. 1,82,162 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గురువారం జరిగిన మూడో సమావేశంలో మరో రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఇవాళ ఆమోదం పొందిన 15 ప్రాజెక్టుల ద్వారా రూ. 19,580 మందికి ఉపాధి లభిస్తుంది.

పురోగతిపై సమీక్ష..

పెట్టుబడులు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా అధికారులు ట్రాకింగ్ చేయాలని.. చంద్రబాబు అధికారులకు సూచించారు. రూ.10 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే ప్రతి ప్రాజెక్టు పురోగతిని తప్పనిసరిగా ట్రాకింగ్ చేయాలన్నారు. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతరం చర్చలు జరుపుతూ.. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూడాలని సూచించారు. అధికారులు, మంత్రులు పెట్టుబడులను ట్రాక్ చేయడం ద్వారా.. త్వరితగతిన ఫలితాలు చూపించాలని స్పష్టం చేశారు.

నవయుగ ఇంజినీరింగ్..

అల్లూరి సీతారామరాజు జిల్లా గుజ్జిలిలో 1,500 మెగావాట్లతో, చిత్తంవలసలో 800 మెగావాట్ల ప్రాజెక్టును నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ రూ. 14,328 కోట్లతో ఏర్పాటు చేస్తోంది. 3,450 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

మేఘా ఇంజినీరింగ్..

అన్నమయ్య జిల్లాలో కొమ్మూరులో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ. 10,300 కోట్లతో 3,000 మందికి ఉపాధి కలిగేలా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును నెలకొల్పనుంది.

యాస్పరి..

అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో 118.80 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు యాస్పరి రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆసక్తి కనబరించింది. ఈ ప్రాజెక్టు రాకతో 150 మందికి ఉపాధి లభిస్తుంది.

అనంతపురంలో..

అనంతపురంలో 178.20 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును.. అనంతపూర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 972.23 కోట్లతో 225 మందికి ఉపాధి కలిగించేలా ఏర్పాటు చేయనుంది.

సత్యసాయి జిల్లాలో..

శ్రీసత్య సాయి జిల్లాలో కడప రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్.. రూ. 1,163.11 కోట్లతో 300 మందికి ఉపాధి కలిగేలా 231 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు నెలకొల్పనుంది.

ఎకోరెన్ ఎనర్జీ ఇండియా..

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్.. 201.30 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును రూ. 1,651 కోట్లతో నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 255 మందికి ఉపాధి కలుగుతుంది.

అయానా పవర్..

ఎకోరెన్ లిమిటెడ్ నుంచి అయానా రెన్యూవబుల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. రూ. 4,435 కోట్లతో కర్నూలు జిల్లాలో పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. 498.30 మెగావాట్ల సామర్ధ్యంతో నెలకొల్పే ఈ పవర్ ప్లాంటుతో 630 మందికి ఉపాధి దక్కనుంది.

ఆంపిన్ ఎనర్జీ..

ఎకోరెన్ లిమిటెడ్ నుంచి ఆంపిన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రైవేట్ లిమిటెడ్.. కర్నూలు, నంద్యాలలో రూ. 3,142 కోట్లతో 350 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న పవన-సౌర విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పనుంది. 1,200 మందికి ఉపాధి కలుగుతుంది.

ఎస్ఏఈఎల్..

ఒకొక్కటి 300 మెగావాట్ల సామర్ధ్యంతో మొత్తం 600 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఎస్ఏఈఎల్ సోలార్ ఏర్పాటు చేస్తోంది. రూ. 3,456 కోట్లతో 2,070 మందికి ఉపాధి కలిగేలా అనంతపురం, కడప, నంద్యాలలో ఈ ప్లాంట్లను నెలకొల్పనుంది.

టాటా పవర్..

టాటా పవర్ అనంతపురంలో 400 మెగావాట్ల సామర్ధ్యంతో రూ. 2,000 కోట్ల వ్యయంతో సౌర విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఈ కేంద్రం ద్వారా 1,380 మందికి ఉపాధి లభిస్తుంది.

కోరమండల్..

కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ రూ. 1,539 కోట్లతో.. కాకినాడ జిల్లాలో తమ ఫెర్టిలైజర్ ప్లాంటును విస్తరించేందుకు తాజాగా ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ప్లాంటు ఏర్పాటు ద్వారా 750 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి.

అలెప్, ఈఎంసీ కొప్పర్తి..

కోడూరులో 6 వేల మందికి ఉపాధి కల్పించేలా రూ.305 కోట్లతో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (అలెప్) ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టనుంది. ఈఎంసీ కొప్పర్తి కడప జిల్లాలో ఇదే రంగంలో పెట్టుబడులకు ముందుకొచ్చింది.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న సంస్థల్ని సమన్వయం చేసుకుంటూ.. త్వరితగతిన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా చేసేందుకు కన్వీనర్‌ను నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జిల్లాలో కలెక్టర్ స్థాయి నుంచి రాష్ట్రంలో పైస్థాయి అధికారుల వరకు త్వరగా అనుమతులు వచ్చేలా.. క్షేత్రస్థాయిలో తలెత్తే అవరోధాలను అధిగమించేలా కన్వీనర్‌కు బాధ్యత అప్పగించాలని సూచించారు.

Whats_app_banner