AP Govt Advertiements: అస్మదీయులకు అప్పనంగా..! ఐదేళ్లలో ఒకే సంస్థకు రూ.300కోట్ల చెల్లింపులు?
AP Govt Advertiements: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో జరిగిన చెల్లింపులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రకటనల రూపంలో ఒకే ఒక పత్రికకు దాదాపు రూ.300కోట్ల వరకు చెల్లించినట్టు గుర్తించారు.
AP Govt Advertiements: వడ్డించే వాడు మన వాడైతే సామెత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనలకు అతికినట్టు సరిపోతుంది.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార మార్పిడి జరగడంతో టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వ హయంలో జరిగిన వ్యవహారాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రకటనలు చెల్లింపుల వ్యవహారంపై అరా తీసిన అధికారులకు ఇన్నాళ్లు దాచి పెట్టిన లెక్కలు ఖంగు తిన్నారు. బడ్జెట్ కేటాయింపులకు మించిన చెల్లింపులు చూసి నోరెళ్లబెడుతున్నారు.ఈ వ్యవహారం ఎంత లోతుంటుందో చెప్పలేమని ఆర్ధిక శాఖ అధికారులు చెబుతున్నారు.
ఏపీలో గత ఐదేళ్లుగా పత్రికా ప్రకటనల కోసం చేసిన ఖర్చును లెక్కిస్తున్న అధికారులు కేవలం ఒక్క పత్రికకే బడ్జెట్ కేటాయింపుల్లో అగ్రభాగం చెల్లించినట్టు గుర్తించారు. వార్షిక బడ్జెట్ కేటాయింపులకు మించి అస్మదీయ పత్రికకు ఎడాపెడా ప్రకటనలు ఇచ్చేశారు. ఉన్న బడ్జెట్‌లో తొలి ప్రాధాన్యతలో దానికే చెల్లింపులు జరిపారు. ఇలా ఐదేళ్లలో దాదాపు రూ.300కోట్లను ఒకే ఒక్క సంస్థకు చెల్లించినట్టు ప్రాథమికంగా గుర్తించారు.
ఏపీలో కొన్నేళ్లుగా ప్రభుత్వ ప్రకటనలన్నీ సమాచార శాఖ ద్వారా విడుదల చేస్తున్నారు. 2017లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రకటనల జారీ అధికారం మొత్తం ఐ అండ్ పిఆర్ డిపార్ట్‌మెంట్‌కు కేటాయిస్తూ జీవో 124 జారీ చేశారు. దీని ప్రకారం అన్ని డిపార్ట్‌మెంట్స్ పేమెంట్ బై పార్టీ ప్రకారం క్లాసిఫైడ్స్, డిస్‌ప్లే యాడ్స్, ఫుల్ పేజీ ప్రకటనల్ని వివిధ సందర్భాల్లో పత్రికలకు విడుదల చేస్తుంటారు. ప్రకటన ప్రచురించిన తర్వాత అందుబాటులో ఉన్న బడ్జెట్‌ను బట్టి బిల్లులు విడుదల చేస్తుంటారు.కొన్ని ప్రత్యేక సందర్భాలు, సమ్మిట్లలో మాత్రమే అయా శాఖలు నేరుగా చెల్లింపులు జరిపేవి.
ప్రకటనల కేటాయింపు కూడా సర్క్యూలేషన్ ఆధారంగా విడుదల చేస్తుంటారు. తెలుగులో ప్రధాన పత్రికలు రెండింటికి అగ్రభాగం ప్రకటనలు కేటాయిస్తూ వచ్చారు. వీటిలో ఒకదానికి బిల్లులు భారీగా పేరుకు పోవడంతో ప్రభుత్వ ప్రకటనల్ని ప్రచురించడానికి నిరాకరించింది. దీంతో దాదాపు ఏడాదికి పైగా ఆ సంస్థ ప్రభుత్వ ప్రకటనలు ప్రచురించలేదు.గత ఐదేళ్లలో కోటి రుపాయలకు మించి ఖరీదు చేసే ప్రకటనలు చెల్లింపులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో పెద్ద పత్రికలకు బిల్లులు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వం మారడంతో మళ్లీ కొన్నిపత్రికల్లో ప్రభుత్వ ప్రకటనలను ప్రచురిస్తున్నాయి.
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రకటనల రూపంలో జరిగిన చెల్లింపులపై ఆర్ధిక శాఖ ఆరా తీస్తోంది. ఒక్క పత్రికకు మాత్రమే ఏటా రూ.60-70 కోట్ల రుపాయలు కేటాయించడం, వాటికి సంబంధించిన బిల్లులు చెల్లింపులు కూడా పూర్తి చేయడంతో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. శాఖల వారీగా ఉన్న బడ్జెట్ కేటాయింపులు నిధుల విడుదల అంశాన్ని ఆరా తీయడంతో ప్రకటన వ్యవహారం వెలుగు చూసింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో సమాచార శాఖలో ప్రింట్ మీడియా ప్రకటనలకు 128కోట్ల కేటాయింపులు ఉంటే ఒక్క పత్రికకు దాదాపు 100కోట్ల రుపాయల వరకు చెల్లింపులు జరిపినట్టు గుర్తించారు. తొలి నాలుగేళ్లలో మరో రూ.200కోట్ల రుపాయల వరకు ప్రింట్ ప్రకటనల కోసం చెల్లించినట్టు తెలుస్తోంది.
2023 జనవరి 1నుంచి డిసెంబర్ 31 వరకు సుమారు 63 ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చినట్లుగా లెక్కల్లో పేర్కొన్నారు. 18 హాఫ్ పేజీ యాడ్స్, 5 స్ట్రిప్ యాడ్స్ ఇచ్చినట్టుగా గుర్తించారు. ఇందుకోసం ఆ సంస్థకు దాదాపు రూ.100 కోట్లను బిల్లులుగా చెల్లించారు. క్లాసిఫైడ్స్, డిస్ ప్లే యాడ్స్ కలుపుకుంటే మరో రూ.10 కోట్లు అదనంగా చెల్లించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
2024 జనవరి నుండి మార్చి 12వ తేదీ వరకు 20 ఫుల్ పేజీ ప్రకటనలు, 2 హాఫ్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. దీనికోసం దీనికి సుమారు 27 కోట్లు బిల్లులు చెల్లించారు. ప్రతివారం మైనింగ్ డిపార్ట్ మెంట్ ద్వారా ఇచ్చిన ఇసుక ధరల ప్రకటనల బిల్లుల్ని నేరుగా ఆ శాఖ చెల్లించింది. ఇవి ప్రభుత్వ ప్రకటనలకు అదనంగా లెక్కించాల్సి ఉంటుంది.
గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క పత్రికకు 75 ఫుల్ పేజీ యాడ్స్ 7 హాఫ్ పేజీ యాడ్స్, క్లాసిఫైడ్ స్ట్రిప్ యాడ్స్ విడుదల చేశారు.ఇసుక ధరల ప్రకటనలు అదనంగా చెల్లించారు. ఇలా ఏడాదిలో దాదాపు రూ.120కోట్లు చెల్లింపులు జరిగినట్టు గుర్తించారు. వార్షిక బడ్జెట్ రూ.138 కోట్లు ఉంటే దానికి మించి ఒక్క పత్రికకు చెల్లింపులు జరపడంపై ఆర్ధిక శాఖ విస్మయం వ్యక్తం చేస్తోంది.పూర్తి స్థాయిలో విచారణ జరిపితే తప్ప ఐదేళ్లలో ప్రకటనల్లో ఏమి జరిగిందో బయటకు తెలియకపోవచ్చని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి.