తొలకరి వర్షాలు కురుస్తుండటంతో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాల వేట ప్రారంభమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతున్నారు. చిన్న వజ్రం దొరికినా తమ జీవితాలు మారిపోతాయనే ఆశతో పొలాలను జల్లెడ పడుతున్నారు. తుగ్గిలితో పాటు పరిసర ప్రాంతాల్లో వజ్రాల కోసం వెదుకుతున్న వారితో సందడిగా మారింది.
తొలకరి ప్రారంభం కావడంతో కర్నూలు జిల్లా పొలాల్లో వజ్రాల వెదుకులాట మొదలైంది. ఈ క్రమంలో వజ్రాలను వెదుకుతున్న వారిలో ఒకరికి అదృష్టం వరించినట్టు ప్రచారం జరిగింది. కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని పెరవలి కొల్లాపూర్ లక్ష్మీదేవి ఆలయం ప్రాంతంలో ఆదివారం ఒకరికి ఖరీదైన వజ్రం లభించినట్టు తెలుస్తోంది.
ఆదివారం రంగు రాళ్లను వెదుకుతున్న క్రమంలో రూ.30 లక్షల విలువ చేసే వజ్రం దొరికినట్లు సమాచారం అందడంతో గ్రామానికి చెందిన ఒక వ్యాపారి పొలం వద్దకే వెళ్లి వజ్రాన్ని కొనుగోలు చేశారు. అప్పటికే ఆ సమాచారం ఊరంతా తెలిసిపోయింది. వజ్రం కొనుగోలు గురించి పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందడంతో దర్యాప్తు చేస్తున్నారు.
పెరవలికి చెందిన ఓ రైతుకు ఆదివారం వజ్రం లభిం చగా రూ. లక్షన్నర రుపాయలు చెల్లించి ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు. ఏటా వర్షాలు మొదలైన సమయంలో పొలాల్లో వజ్రాల అన్వేషణకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలి వస్తారు. అదృష్టం కలిసొస్తే క్షణాల్లో లక్షలు సంపాదించ వచ్చని ఎక్కడెక్కడి నుంచో కర్నూలుకు వస్తుంటారు.
ఈ క్రమంలో ఆదివారం జొన్నగిరి గ్రామంలో పొలం పనులు చేస్తున్న ఓ వ్యవసాయ కూలికి వజ్రం లభించింది. దానిని స్థానిక వ్యాపారి రూ. 1.50 లక్షలకు కొనుగోలు చేశాడు. జిల్లాలోని జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, తుగ్గలి, రాంపురం గ్రామాల్లో స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి జనం వచ్చి వర్షాకాలం ఎర్ర నేలల్లో వజ్రాన్వేషణ చేస్తుంటారు.
కర్నూలు జిల్లాలోని తుగ్గలి, మద్దికెర, జొన్నగిరి, పగిడిరాయి, పెరవలి, మహానంది, మహాదేవపురం ప్రాంతాలకు ఏటా వజ్రాల వేట కోసం జనం తరలి వెళుతుంటారు. తొలకరి వర్షాలకు మట్టి కరిగినప్పుడు వజ్రాలు, విలువైన రంగురాళ్లు బయటపడటం ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. 2021లో ఒక రైతుకు రూ.1.2 కోట్ల విలువైన 30 క్యారట్ల వజ్రం దొరికిందని ప్రచారం జరిగింది. ఖరీదైన రాళ్లను కొనుగోలు చేసే వ్యాపారులు కూడా స్థానికంగా ఉన్నారు.
సంబంధిత కథనం