అల్లూరి జిల్లాలో ఎన్ కౌంటర్ - గాజర్ల రవి సహా మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు మృతి..!-3 maoists including central committee member killed in encounter in andhrapradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అల్లూరి జిల్లాలో ఎన్ కౌంటర్ - గాజర్ల రవి సహా మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు మృతి..!

అల్లూరి జిల్లాలో ఎన్ కౌంటర్ - గాజర్ల రవి సహా మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు మృతి..!

ఏపీలోని రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. వీరిలో సెంట్రల్‌ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌ ఉన్నారు. చలపతి భార్య అరుణ కూడా మృతి చెందగా..ఆమెపై రూ.10 లక్షల రివార్డు ఉంది.

గాజర్ల రవి (HT sourced photo)

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సహా ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు.

ఈ ఎన్ కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ తో పాటు మరో మావోయిస్టు అగ్రనేత రావి వెంకట చైతన్య అలియాస్ అరుణ, మరో మావోయిస్టు నేత కూడా హతమయ్యారు.

మోస్ట్ వాంటెండ్ లిస్ట్ లో పేర్లు…!

అరుణ భర్త అయిన ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియస్ చలపతి ఒడిశా సరిహద్దులో ఎన్ కౌంటర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఆయన భార్య అయిన చైతన్య అలియాస్ అరుణ… ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారు.

ఇక గాజర్ల రవి ఆంధ్రా-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉండగా, అరుణ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు కార్యకలాపాలకు నేతృత్వం వహిస్తున్న ఈ ఇద్దరు మావోయిస్టు నేతలు… జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నారు. గాజర్ల రవిపై రూ.20 లక్షల రివార్డు ఉంది.

మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవీపట్నం అటవీ ప్రాంతంలోని కొండమోడలు గ్రామంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికిపై మంగళవారం సాయంత్రం పోలీసులకు అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఎలైట్ గ్రేహౌండ్స్ యూనిట్ నిర్వహించిన ఈ ఆపరేషన్ లో మావోయిస్టులతో భీకర ఎదురుకాల్పులు జరిగాయని… దీంతో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు.

ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి మూడు ఏకే-47 రైఫిళ్లు, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఎదురుకాల్పుల అనంతరం పలువురు మావోయిస్టు నేతలు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో మరింత మంది మావోయిస్టులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో మారేడుమిల్లి అడవుల్లో గ్రేహౌండ్స్ కూంబింగ్ కొనసాగుతోంది.

గాజర్ల రవి ప్రస్థానం..!

ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి అలియాస్ ఉదయ్, గణేష్ 1992లోనే మావోయిస్టు ఉద్యమంలో చేరారు. కాలక్రమేణా అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. 2004లో అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్ ప్రతినిధిగా ప్రభుత్వంతో శాంతి చర్చల్లో పాల్గొన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంపై రవికి గట్టి పట్టు ఉందని ఎన్ఐఏ గుర్తించింది. 2012లో ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లను హతమార్చడంతోపాటు 38 మంది గ్రేహౌండ్స్ సిబ్బంది మృతి చెందిన బలిమెలా రిజర్వాయర్ దాడిలో కూడా రవి ప్రమేయం ఉందని పోలీసు రికార్డులు సూచిస్తున్నాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం