Godavari to Penna: నదుల అనుసంధానానికి సై..గోదావరి నుంచి కృష్ణా,పెన్నాలకు 280టిఎంసీల తరలింపు-280 tmc of water to be transferred from godavari to krishna and penna for river interlinking ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Godavari To Penna: నదుల అనుసంధానానికి సై..గోదావరి నుంచి కృష్ణా,పెన్నాలకు 280టిఎంసీల తరలింపు

Godavari to Penna: నదుల అనుసంధానానికి సై..గోదావరి నుంచి కృష్ణా,పెన్నాలకు 280టిఎంసీల తరలింపు

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 30, 2024 06:02 AM IST

Godavari to Penna: ఏపీలో గోదావరి నుంచి వృధాగా సముద్రంలోకి మళ్ళించే వరద జలాలను పెన్నా బేసిన్‌కు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.గోదావరి జలాలను కృష్ణా మీదుగా పెన్నాకు తరలించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. 280 టిఎంసీలను తరలించి 80లక్షల మందికి తాగు,7.5లక్షల ఎకరాలకు సాగునీరుఅందిస్తారు.

గోదావరి-పెన్నా అనుసంధానంపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
గోదావరి-పెన్నా అనుసంధానంపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

Godavari to Penna: ఏటా వరదల సమయంలో సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి నదిలో కడలి పాలవుతున్న వేలాది టిఎంసీల నీటిని పెన్నా బేసిన్‌కు తరలించడం ద్వారా కరవు పారద్రోలాలని యోచిస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి...రాష్ట్రాన్ని 100 శాతం కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ ప్రణాళికలను అమలు చేయబోతున్నారు.

yearly horoscope entry point

పోలవరం పూర్తైతే 8 ఉమ్మడి జిల్లాలకు మేలు జరుగుతుంది. పోలవరంతో ఉత్తారంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు పోలవరంతో లబ్ధి చేకూరుతుంది. మరోవైపు గోదావరి నదిలో వరదల సమయంలో సరాసరి ఏటా 2 నుంచి 3 వేల టిఎంసిల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది.

ఈ నీటి నుంచి 280 టిఎంసిలను వరదల సమయంలో తీసుకోవడం ద్వారా... కృష్ణా డెల్టాకు, రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలు సహా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు లబ్ది చేకూర్చేందుకు సీఎం చంద్రబాబు కార్యచరణ అమలు చేయ బోతున్నారు.

బనకచర్ల నుంచి తరలింపు..

రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు గోదావరి నీటిని బనకచర్ల కు తరలించడమే మార్గం అని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా గోదావరి వరద జలాలను తరలించడం ద్వారా రాష్ట్రానికి జలహారం కింద అన్ని ప్రాంతాల నీటి అవసరాలు తీర్చనున్నారు. పోలవరంతో పాటు కొత్త ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీళ్లిచ్చే అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఏర్పడ్డాక 6 నెలలుగా దీనిపై విస్తృత కసరత్తు చేస్తున్న ప్రభుత్వం...ప్రాజెక్టును కార్యరూపం ఇచ్చే విషయంలో కీలక అడుగులు వేస్తోంది. ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై ఈ రోజు ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రాజెక్టు వివరాలు

బనకచర్ల ప్రాజెక్టు ద్వారా విస్తృత స్థాయిలో రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు, పరిశ్రమలకు మేలు జరగబోతోంది. ప్రాజెక్టు పూర్తి అయితే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందుతుంది. దీనితో పాటు 22.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. పరిశ్రమలకు దాదాపు 20 టిఎంసిల నీటిని వినియోగించవచ్చు.

నీటి తరలింపు ఇలా…

ఎగువున ఉన్న ప్రాజెక్టుల కారణంగా కృష్ణా నదికి తగిన విధంగా నీటి ప్రవాహాలు రావడం లేదు. మరో వైపు గోదావరి నదిలో ప్రతి ఏడాది వేల టిఎంసిల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిలో కనీసం 280 టిఎంసిల నీటిని వరద సమయంలో వినియోగించుకోవాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని కోసం రెండు మూడు రకాల ప్రతిపాదనలు సిద్దం చేశారు.

మొదట గోదావరి నీటిని కృష్ణా నదికి తరలిస్తారు. కృష్ణా నది నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తారు. 200 టిఎంసిల సమర్థ్యంతో బొల్లాపల్లిలో రిజర్వాయర్ నిర్మిస్తారు. అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు నీటికి తరలిస్తారు. బొల్లాపల్లి నుంచి బనకచర్లకు 31 కి.మీ టన్నెల్ ద్వారా నీటిని తరలిస్తారు.

బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ, SRBC, నిప్పుల వాగుకు నీళ్ళు వెళుతుంటాయి. నిప్పుల వాగు ద్వారా సోమశిల, కండలేరుకు నీటిని తరలిస్తారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని వివిధ లిఫ్టులు, కాలువల ద్వారా అన్ని ప్రాజెక్టులకు తరలిస్తారు.

ఇటు కృష్ణా డెల్టాకు..అటు సీమకు...

ఈ ప్రాజెక్టు పూర్తైతే ఎంత దుర్భర పరిస్థితులున్నా సీమ జిల్లాలకు, పెన్నా ద్వారా నెల్లూరుకు నీరు ఇవ్వొచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ కుడికాలువ ద్వారా సాగయ్యే పంటలకు కూడా సమృద్ధిగా నీటిని అందజేయవచ్చు. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కరువు ప్రాంతంగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు నీటి అసవరాలను కూడా తీర్చుతుంది. గోదావరిలో వరద సమయంలో 280 టిఎంసిల నీటిని సీమకు తరలిస్తారు.

పోలవరం ప్రాజెక్టు ఎగువ నుంచి రోజుకు మూడు టిఎంసి నీటిని తరలిస్తారు. ఒక టిఎంసి నీళ్లు కృష్ణా డెల్టాకు ఇస్తారు. అంటే 280లో కనీసం 80 టిఎంసిల నీరు కృష్ణా డెల్టాకు కేటాయిస్తారు. ఈ స్థాయిలో నీటిని గోదావరి నుంచి తరలించాలంటే పోలవరం కుడికాలువ సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. పోలవరం కుడికాలువను 17 వేల క్యూసెక్కుల సామర్థ్యం నుంచి 28 వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచుతారు.

అదే విధంగా తాడిపూడి లిఫ్ట్ స్కీమ్ కాలువ సామర్థ్యాన్ని కూడా 1500 క్యూసెక్కుల నుంచి 10 వేల క్యూసెక్కులకు పెంచి నీటిని తరలిస్తారు. కేవలం గోదావరి కి వరదల సమయంలోనే నీటిని తీసుకోవడం ద్వారా....సముద్రంలో వృధాగా పోయే నీటిని మాత్రమే తీసుకోవడం ద్వారా గోదావరి డెల్టాకు ఈ కొత్త ప్రాజెక్టు వల్ల నీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కేంద్ర ఆర్థిక సాయానికి ప్రయత్నాలు

ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ ప్రాజెక్టు చేపట్టడం అంత సులభం కాదు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇదే పెద్ద గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ప్రాధమిక అంచనాల ప్రకారం రూ.70 వేల నుంచి రూ.80 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. 54 వేల ఎకరాల భూ సేకరణ జరపాల్సి ఉంటుంది. 4 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. పెద్ద మొత్తంలో ఫారెస్టు భూములు కూడా సేకరించాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే భారీ వ్యయం అవుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఇంత వ్యయం చేసే అవకాశం లేదు. దీంతో ఈ ప్రాజెక్టు అవసరాన్ని, ప్రయోజనాలను కేంద్రానికి వివరించిన ముఖ్యమంత్రి కేంద్ర సాయం కూడా తీసుకుని దీన్ని పూర్తి చెయ్యాలని భావిస్తున్నారు. ఈ వారంలో జరిగిన ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలతో ఈ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రాజెక్టు అవసరాన్ని వివరించి ఆర్థిక సాయం పై విన్నవించారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టుకు అనుమతులు పొంది, టెండర్ల ప్రక్రియ పూర్తి చెయ్యాలని సిఎం ఆదేశించారు.

రాష్ట్ర ప్రజల అవసరాల దృష్ట్యా అత్యంత వేగంగా, ప్రాధాన్యంతో ఈ ప్రాజెక్టు పూర్తి చెయ్యాలని భావిస్తున్నామని...అందులో భాగంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని పనులు వేగంగా జరగాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ తో పాటు ఇతర ఇరిగేషన్ శాఖ అధికారులు, సిఎంవో అధికారులు పాల్గొన్నారు.

Whats_app_banner