TTD Calendars 2025 : టీటీడీ క్యాలెండర్లు వచ్చేశాయ్ - ఎక్కడ తీసుకోవాలంటే…
TTD Calendars 2025 : ఈ ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.ఇవాళ్టి(నవంబర్ 20) నుంచి పలు చోట్ల క్యాలెండర్లు అందుబాటులోకి వచ్చాయి. ధరల వివరాలను కూడా టీటీడీ పేర్కొంది.
తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్లు వచ్చేశాయి. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. టీటీడీ ముద్రించిన 2025వ సంవత్సరం క్యాలెండర్లను తిరుమల, తిరుపతిలోని అన్ని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో భక్తులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో తీసుకొచ్చారు. ఇవాళ్టి నుంచే ఈ క్యాలెండర్లను విక్రయించుకోవచ్చు. ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా క్యాలెండర్లను కోనుకోవచ్చు.
టీటీడీ స్థానిక ఆలయాలైన తిరుమలలోని శ్రీ భూ వరాహ స్వామి, తిరుపతి సమీపంలోని పేరూరు శ్రీ వకుళమాత ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి, నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, నాగలాపురం శ్రీ వేద నారాయణస్వామి, కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి మూలమూర్తులు, ఉత్సవమూర్తులతో కూడిన క్యాలెండర్లను టీటీడీ అత్యద్భుతంగా రూపొందించి ముద్రించింది. ఈ క్యాలెండర్లను తిరుపతితో పాటు తిరుమలలో కోనుగోలు చేయవచ్చు.
బయటి ప్రాంతాల్లో…
మరికొద్దిరోజుల్లోనే టీటీడీ క్యాలెండర్లు బయటి ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి వస్తాయి. గతేడాది చెన్నైలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాలు, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీవారి ఆలయాలు, ముంబయి, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో క్యాలెండర్లను విక్రయించారు. ఈ ఏడాది కూడా ఈ ఆలయాలతో పాటు మరికొన్నిచోట్ల అందుబాటులో ఉంచేలా టీటీడీ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
ఈవో తనిఖీలు:
టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి బుధవారం సాయంత్రం తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంబీ రోడ్డులోని అన్నపూర్ణ హోటల్ భవనాన్ని పరిశీలించారు. అనంతరం దుకాణాల లైసెన్సులను స్వయంగా తనిఖీ చేశారు. ఒక టీ దుకాణంలో టీ సేవించి ధరలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మీడియాతో మాట్లాడుతూ… అన్నపూర్ణ హోటల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పరిశీలించడం జరిగిందన్నారు. ఇంజినీరింగ్ అధికారుల నివేదిక ఆధారంగా భవనంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఒకే లైసెన్సుతో రెండు మూడు ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, లైసెన్సులను డిజిటలైజేషన్ చేసి దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో అనధికారికంగా వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.