APPSC Posting Cancellation: తప్పుడు ధృవపత్రాలతో డిఎస్పీ పోస్టింగ్.. స్పోర్ట్స్ కోటా డిఎస్పీ నియామకం రద్దు..
APPSC Posting Cancellation: ఏపీపీఎస్పీ ద్వారా 2018 గ్రూప్1 నియామకాల్లో ఎంపికైన ఓ డిఎస్పీ నియామకాన్ని ఏపీపీఎస్సీ ఉపసంహరించుకుంది. సివిల్ డిఎస్పీగా ఎంపికైన దాస్యం దనుర్బా సమర్పించిన ధృవపత్రాలపై సందేహాలు వ్యక్తం కావడంతో విచారణ జరిపి ఏపీపీఎస్పీ ఆమె పోస్టింగ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
APPSC Posting Cancellation: ఏపీపీఎస్పీ ఉద్యోగ నియామకాల తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగ నియామకాల్లో పలు అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏపీపీఎస్పీ పరీక్షా పత్రాల మూల్యంకనంలోనే భారీగా అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏపీపీఎస్సీ పరీక్షల మూల్యంకనంలో అక్రమాలు జరిగాయని, తమ వారికి లబ్ది చేకూర్చడానికి మాన్యువల్, డిజిటల్ విధానాల్లో మార్పులు చేసి భారీగా అక్రమాలు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఇంకా విచారణ జరుగుతోంది.
తాజాగా 2018 గ్రూప్1 నియామకాల్లో భాగంగా ఓ డిఎస్పీ సమర్పించిన ధృవపత్రాలపై విచారణ జరిపిన ఏపీపీఎస్సీ మహిళా అధికారి నియామకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 2018 ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఏడాదిన్నర క్రితం గ్రూప్-1 డీఎస్పీ ఉద్యోగంలో చేరిన ధనుర్బా దాస్యం ఎంపిక చెల్లదని ఏపీపీఎస్సీ మంగళవారం ప్రకటించింది.
స్పోర్ట్స్ కోటాలో 270205320 నంబర్ రిజిస్ట్రేషన్‌తో డిఎస్పీగా ఎంపికైన దనుర్బా ధృవపత్రాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఆమె నియామకాన్ని రద్దు చేసక్తున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి జిత్తుక ప్రదీప్ కుమార్ ప్రకటించారు.
ఉద్యోగ నియామక సమయంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఆమె ధ్రువపత్రాలు పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాత పోస్టింగ్ ఇచ్చినట్టుఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. విద్యా, ఉద్యోగ నియామకాల్లో శాప్ అక్రమాలపై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. అసలు క్రీడల్లో పాల్గొనని వారికి సైతం ఉన్నత విద్యలో సీట్లు వచ్చేలా సర్టిఫికెట్లు జారీ చేసే క్రీడా సంఘాలకు శాప్ అండగా నిలుస్తోందనే విమర‌్శలు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నాయి.
తాజాగా ఏపీపీఎస్సీ నియామకాల్లో డిఎస్పీ పోస్టింగ్‌కు ఎంపికైన అభ్యర్థి ధృవపత్రాలను శాప్ ధృవీకరించిన తర్వాత అవి తదుపరి ధృవీకరణలో చెల్లకపోవడం గమనార్హం. శాప్ అధికారుల అమోదంతోనే ఆమెకు డీఎస్పీ ఉద్యోగాన్ని ఖరారు చేసినట్టు ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.
దనుర్బా సమర్పించిన 'సైక్లింగ్ సీనియర్' సర్టిఫి కెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఉద్యోగ నియామకం సందర్భంగా సమర్పించలే దని, ఫలితంగా ఆమె నియామకం చెల్లదని కొద్ది రోజుల క్రితం ఏపీపీఎస్సీకి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై వివిధ దశల్లో విచారణ జరిపారు.
పోస్టింగ్ సమయంలో దనుర్బా సమర్పించిన సర్టిఫికెట్‌ను జాతీయ సైక్లింగ్ ఫెడ రేషన్ నుంచి వివరణ తీసుకున్నారు. ఆమె పత్రాలు, యోగ్యతపై సందేహాలు వ్యక్తం కావడంతో నియామకాన్ని రద్దు చేస్తున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ నియామకాల విషయంలో ఏపీపీఎస్సీ డొల్లతనం, శాప్ అధికారుల అక్రమాలు తాజా ఉదంతానికి అద్దం పడుతున్నాయి.
గ్రూప్ 1 ఉద్యోగాల కోసం ఎంతో మంది రేయింబవళ్లు నిద్రాహారాలు మాని శ్రమిస్తుంటారు. తప్పుడు ధృవీకరణలతో అడ్డదారిలో ఉద్యోగాల్లో చేరే వారికి అడ్డు కట్ట వేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. పారదర్శకంగా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడతామని కమిషన్లు చెప్పినా, వాటిలో రాజకీయ జోక్యం, పునరావాస కేంద్రాలుగా మారడంతో నియామక ప్రక్రియలో ఇలాంటి ఘటనలో చోటు చేసుకుంటున్నాయి. ఏపీపీఎస్పీ ఛైర్మన్ ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను వైసీపీ ప్రభుత్వం నియమించింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన పదవికి రాజీనామా చేశారు.