Sankranti Special Buses : ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. సంక్రాంతికి రాయలసీమ జిల్లాల నుంచి 2 వేల స్పెషల్ బస్సులు
Sankranti Special Buses : సంక్రాంతి వేళ ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాయలసీమ జిల్లాల నుంచి ఏకంగా 2,327 స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. సంక్రాంతి సమయంలో బస్సులు, రైళ్లు రద్దీగా ఉంటాయి. స్పెషల్ బస్ సర్వీసులతో ప్రయాణికులకు ఉపసమనం కలుగుతోంది.
సంక్రాంతిని ఆంధ్రప్రదేశ్‌లో బ్రహ్మాండగా జరుపుకుంటారు. ఉద్యోగాలు, ఉపాధి పనులు, చదువు నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు సంక్రాంతికి తమ సొంతూర్లకు వస్తారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉపాధి పనులు, ఉద్యోగాలు, చదువుకుంటున్న విద్యార్థులు తమ సొంతూర్లకు వెళ్తారు. పండగ ముగించుకుని తిరిగి సొంతూర్ల నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్తారు. కనుక సంక్రాంతి సీజన్‌లో బస్సులు, రైళ్లు ఖాళీ ఉండవు. రద్దీ ఎక్కువ ఉంటుంది.
ప్రధానంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు పొరుగు రాష్ట్రాల పట్టణాల నుంచి, రాష్ట్రంలోని విజయవాడతో పాటు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు సంక్రాంతి పండగ సీజన్‌లో రాకపోకలు ఎక్కువగా సాగిస్తారు. బస్సులు, రైళ్లు రైద్దీగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తుంది.
రాయసీమలోని ఎనిమిది జిల్లాల నుంచి జనవరి 8 నుంచి 20 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం తిరుగుతున్న సాధారణ సర్వీసులు కాకుండా.. ఇప్పుడు సంక్రాంతి పండగ సీజన్‌లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. రాయలసీమ జిల్లాలు అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడకు స్పెషల్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
ఏ జిల్లా నుంచి ఎన్ని సర్వీసులు..
అనంతపురం జిల్లా నుంచి 267 సర్వీసులు, శ్రీసత్యసాయి జిల్లా నుంచి 230 సర్వీసులు, కర్నూలు జిల్లా నుంచి 340 సర్వీసులు, నంద్యాల జిల్లా నుంచి 226 సర్వీసులు, చిత్తూరు జిల్లా నుంచి 170 సర్వీసులు, తిరుపతి జిల్లా నుంచి 356 సర్వీసులు, అన్నమయ్య జిల్లా నుంచి 138 సర్వీసులు, కడప జిల్లా నుంచి 600 సర్వీసులు కేటాయించినట్లు ఆర్టీసీ కడప జోన్ ఛైర్మన్ పూల నాగరాజు తెలిపారు.
సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధపడిందని తెలిపారు. జనవరి 8 నుంచి 12 వరకు సంక్రాంతి ముందు 1,147 సర్వీసులు, జనవరి 14 నుంచి 20 వరకు 1,180 బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రత్యేక బస్సుల్లో ఏవిధమైన అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా.. సాధారణ ఛార్జీలే నిర్ణయించారు. అంతేకాకుండా రాయితీ ఇవ్వనున్నట్లు అనంతపురం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుమంత్ ఆర్. వెల్లడించారు.
ఎక్కడెక్కడికి ఎన్ని..
రాయలసీమ ఎనిమిది జిల్లాల నుంచి సంక్రాంతి ముందు జనవరి 8 నుంచి 12 వరకు హైదరాబాద్‌కు 442, బెంగళూరుకు 406, హైదరాబాద్‌కు 442, విజయవాడకు 107, చెన్నైకి 24, అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు 168 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సంక్రాంతి పండగ ముగిసిన తరువాత బస్సు సర్వీసుల సంఖ్యను స్వల్పంగా పెంచుతారు. జనవరి 15 నుంచి 20 వరకు హైదరాబాద్‌కు 452, బెంగళూరు 442, చెన్నైకి 27, విజయవాడకు 111, అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు 148 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. టిక్కెట్లను ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్, ఇతర సైట్ల నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు , హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)