ఏపీలో 'ఆయుష్' సేవల విస్తరణ - రూ.210 కోట్లతో 3 కొత్త కాలేజీల నిర్మాణం..!-2 new ayush colleges to be set up in andhrapradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీలో 'ఆయుష్' సేవల విస్తరణ - రూ.210 కోట్లతో 3 కొత్త కాలేజీల నిర్మాణం..!

ఏపీలో 'ఆయుష్' సేవల విస్తరణ - రూ.210 కోట్లతో 3 కొత్త కాలేజీల నిర్మాణం..!

రాష్ట్ర 'ఆయుష్' రంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. రూ.210 కోట్లతో కొత్త కళాశాలల నిర్మాణం జరగనుంది. ఈ మేరకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటించారు.

ఏపీలో కొత్త ఆయుర్వేద కళాశాలలు

రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవలు మరింత బలోపేతం కానున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా రాష్ట్రంలో 'అయుష్' వైద్య సేవల విస్తరణ, మెరుగు కోసం రూ.166 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.166 కోట్ల వ్యయానికి కేంద్రం ఆమోదం తెలిపింది.

2 ఆయుర్వేద కాలేజీలు…

ముఖ్యంగా రూ.210 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా రెండు ఆయుర్వేద, ఒక యూనాని వైద్య కళాశాల రానున్నాయి. ఆరు జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రులు కూడా ఏర్పాటుకాబోతున్నాయి. ఒక్కో ఆనువత్రి ఏర్పాటుకు రూ.7 కోట్ల వరకు వ్యయం కానుంది. అంతేకాకుండా ఆయుర్వేద ఆరోగ్య మందిరాల అభివృద్ధికి కూడా కేంద్రం నిధులు కేటాయించింది.

2014-24 మధ్య రాష్ట్రానికి రూ.120.17 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. ఇందులో గత ప్రభుత్వ పాలనలో కేంద్రం నుంచి రూ.38.09 కోట్లు విడుదలయ్యాయి. 24-25లో రూ.83.23 కోట్లు, 2025-26లో రూ.165.65 కోట్లు కేంద్రం కేటాయించింది. రాష్ట్ర ఆయుష్ శాఖ చరిత్రలో రెండేళ్ల వ్యవధిలో రూ.248.89 కోట్లు మంజూరు కావడం ఇదే తొలిసారి. కేంద్రం భారీస్థాయిలో నిధుల విడుదలకు ఆమోదం తెలుపడంపట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శుక్రవారం ఆయుష్ వైద్య విద్యారులు నిర్వహించిన ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ధర్మవరం, కాకినాడలో కొత్తగా ఆయుర్వేద వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాయలసీమలోనే యూనాని వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఒక్కో కళాశాల నిర్మాణానికి రూ.70 కోట్ల వరకు ఖర్చు అవుతుందని మంత్రి తెలిపారు.

ధర్మవరం, కాకినాడలో ఒక్కొక్క ఆయుర్వేద, రాయలసీమలో ఏర్పాటు కానున్న ఒక యూనాని వైద్య కళాశాలకు కలిపి రూ.70 కోట్ల చొప్పున రూ.210 కోట్లు కేంద్రం కేటాయించింది. ఇందులో 2025-26 ఆరిక సంవత్సరానికిగాను రూ.46.10 కోట్లు వ్యయం చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మూడు హోమియో, ఒక ఆయుర్వేద వైద్య కళాశాల చొప్పున ఉన్నాయి. 2026-27 విద్యా సంవత్సరం నుంచి విశాఖలోని నేచురోపతి కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కొత్తగా రానున్న వాటితో కలిపితే రాష్ట్రంలో కళాశాలల సంఖ్య 8కు చేరుకుంటుంది. విశాఖలో ని ప్రభుత్వ నేచురోపతి (ప్రకృతి వైద్యం), యోగా కళాశాల (100 పడకలు) కోసం కేంద్రం రూ.23 కోట్లు కేటాయించింది.

శ్రీకాకుళం, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున 50 పడకల సమీకృత (ఇంటిగ్రేటెడ్) ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటుకు రూ.52.35 కోట్లు కేంద్రం మంజూరుచేసింది. ఇందులో ఈ ఆర్ధిక సంవత్సరానికి రూ.30.34 కోట్లు విడుదల చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం