ఏపీలో 19 మంది మృతి, 73 చెరువులకు గండి.. 1,808 కిలో మీటర్ల రోడ్లు ధ్వంసం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు ఎనలేని నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పటివరకు 19 మంది మృతి చెందారు. ఇద్దరు గల్లంతయ్యారు. మరోవైపు 73 చెరువులు గండిపడ్డాయి. 1,808 కి.మీ. మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. భారీగా పంటనష్టం వాటిల్లింది.
ఆంధ్ర ప్రదేశ్‌లో ముంపు బాధిత ప్రాంతాల్లో జరిగిన నష్టాలు, చేపట్టిన సహాయ చర్యలతో విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు బులెటిన్ విడుదల చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా మరణాలు సంఖ్య పెరిగిందని తెలిపారు. మరణాల సంఖ్య 19కి చేరిందని, ఇద్దరు గల్లంతు అయ్యారని బులెటిన్‌లో పేర్కొన్నారు. 136 పశువులు, 59,700 కోళ్లు మరణించాయని తెలిపారు. 134 పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆరు వేల పశువులకు వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపారు.
4.26 లక్షల ఎకరాల్లో వరి పంట నష్టం
భారీ వర్షాలతో 1,808 కిలో మీటర్ల మేర ఆర్అండ్‌బీ రోడ్లు ధ్వంసం అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో 4.26 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. 36,964 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయానికి 11.25 లక్షల క్యూసెక్కుల నీరు ఉందని తెలిపారు. మునేరులో ప్రవాహం ఉధృతి తగ్గుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా నీరు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేశారు.
అక్కడ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీ పైన నుంచి రాకపోకలను నిషేధించారు. వరదలతో ఎగువ ప్రాంతాల నుంచి నాలుగు భారీ బోట్లు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని బలంగా ఢీకొట్టాయి. దీంతో ప్రకాశం బ్యారేజీ 69వ గేటు ధ్వంసమైంది. అది ఒక పక్కకు ఒరిగింది.
176 పునరావాస కేంద్రాలు...41,927 మంది తరలింపు
ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకుపోయిన బాధితుల కోసం 176 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 41,927 మందిని తరలించినట్లు అధికారులు తెలిపారు. వారి కోసం 171 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వరద బాధితుల సహాయ చర్యల్లో 36 ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. బాధితుల కోసం రోజుకు మూడు లక్షల ఆహార ప్యాకెట్లు, తాగునీరు ఎప్పటికప్పుడు అందించేందుకు ఐదు హెలీకాఫ్టర్లను ఉపయోగిస్తున్నామని తెలిపారు. మొత్తం 188 బోట్లు, 283 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
73 చెరువులకు గండి
రాష్ట్రంలోని ఎన్‌టీఆర్, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో 73 చెరువులకు గండ్లు పడ్డాయి. ఎన్‌టీఆర్ జిల్లాలో 61 చెరువులు, గుంటూరు జిల్లాలో నాలుగు చెరువులు, ఏలూరు జిల్లాలో ఎనిమిది చెరువులకు గండ్లు పడ్డాయి. బుడమేరు వాగుకు ఆరు చోట్ల భారీగా గండ్లు పడ్డాయి. 154 ప్రాంతాల్లో రోడ్లపైన నీరు పారింది. 165 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. 18 ప్రాంతాల్లో రోడ్లు వరదలకు కోతకు గురయ్యాయి.
-జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు