TSPSC Paper Leak: 15కు చేరిన అరెస్టులు… సూపరింటెండెంట్‌ డైరీ నుంచి ఐడీ చోరీ-15 arrested in telangana public service commission question paper theft case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  15 Arrested In Telangana Public Service Commission Question Paper Theft Case

TSPSC Paper Leak: 15కు చేరిన అరెస్టులు… సూపరింటెండెంట్‌ డైరీ నుంచి ఐడీ చోరీ

HT Telugu Desk HT Telugu
Mar 28, 2023 11:43 AM IST

TSPSC Paper Leak:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ పేపర్ లీక్ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి.పోలీసుల దర్యాప్తులో నిందితులు కీలక విషయాలను వెల్లడించారు. నిందితుల్ని రెండోసారి పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించడంతో నిజాలు బయటపెట్టేశారు.

15కు చేరిన పేపర్‌ లీక్ కేసు అరెస్ట్‌లు
15కు చేరిన పేపర్‌ లీక్ కేసు అరెస్ట్‌లు

TSPSC Paper Leak: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తవ్వేకొద్ది కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈకేసులో కీలకంగా వ్యవహరించిన ప్రవీణ్‌ కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి, డాక్యానాయక్‌, రాజేంద్రనాయక్‌ల నుంచి కీలక వివరాలు రాబట్టారు. కాన్ఫిడెన్షియల్‌ విభాగం సూపరింటెండెంట్‌ శంకరలక్ష్మి డైరీ నుంచి నిందితులు ఆమె కంప్యూటర్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తస్కరించినట్టు తాజాగా నిర్ధారణకు వచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌ నివాసంలో రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్‌ పోలీసులకు తాజా విచారణలో కీలక ఆధారాలు లభించాయి. కాన్ఫిడెన్షియల్‌ విభాగం సూపరింటెండెంట్‌ శంకరలక్ష్మి డైరీ నుంచి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తస్కరించినట్టు నిర్ధారణకు వచ్చారు.

సూపరింటెండెంట్‌ డైరీ నుంచి పాస్‌వర్డ్‌ కొట్టేసి గతేడాది అక్టోబరు 1న కంప్యూటర్‌లోని ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసినట్టు రాజశేఖర్‌రెడ్డి అంగీకరించినట్టు తెలుస్తోంది. కొన్ని ప్రశ్న పత్రాలను ప్రవీణ్‌కుమార్‌ పెన్‌డ్రైవ్‌లోకి మార్చినట్టు వెల్లడించినట్టు తెలుస్తోంది. మరోవైపు బడంగ్‌పేట్‌లోని ప్రవీణ్‌కుమార్‌ నివాసంలో తనిఖీ చేసిన సిట్‌ పోలీసులు రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుల నుంచి సేకరించిన ఫోన్‌ నంబర్ల ఆధారంగా అనుమానితుల జాబితాను సిద్ధం చేశారు. వారిలో ఇప్పటివరకూ ఆరుగురిని గుర్తించి ప్రశ్నించారు. మరో ముగ్గురి సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్‌ అయినట్టు గుర్తించారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఈ ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లడంతో వారి కోసం గాలిస్తున్నారు. వీరికి ప్రశ్నపత్రాల లీకేజీతో ఉన్న సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

రాజశేఖర్‌ రెడ్డి బావపై లుకౌట్ నోటీసులు…

గ్రూప్‌-1 పరీక్షలలో 100కు పైగా మార్కులు సాధించిన 121 మంది యువతీ, యువకుల్లో ఇప్పటివరకూ 60 మందిని విచారించారు. న్యూజిలాండ్‌లో ఉన్న రాజశేఖర్‌రెడ్డి బావ ప్రశాంత్‌కు సోమవారం సిట్‌ పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మహబూబ్‌నగర్‌ జిల్లా సల్కర్‌పేటకు చెందిన తిరుపతయ్యను అరెస్ట్ చేశారు. అతని కుటుంబ సభ్యులను విచారించారు. గండీడ్‌ ఎంపీడీవో కార్యాలయంలో వివరాలు సేకరించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం సల్కర్‌పేట గ్రామానికి చెందిన తిరుపతయ్య ఉపాధి హామీ పథకం పర్యవేక్షకుడిగా పనిచేస్తున్నాడు.

ఒకే మండలం, విభాగంలో పనిచేస్తున్న డాక్యానాయక్‌తో తిరుపతయ్యకు పాత పరిచయాలున్నాయి. తన వద్ద ఏఈ ప్రశ్నపత్రం ఉందని తిరుపతయ్యకు డాక్యానాయక్‌ చెప్పాడు. దీన్ని సొమ్ము చేసుకునేందుకు రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం నేరెళ్లపల్లికి చెందిన రాజేందర్‌కుమార్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని రూ.5 లక్షలు తీసుకొని ప్రశ్నపత్రం చేతికిచ్చేందుకు తిరుపతయ్య దళారీగా వ్యవహరించాడు.ఈ విషయం నిర్ధారణ కావటంతో తిరుపతయ్యను అరెస్ట్‌ చేశారు. దీంతో పేపర్‌ లీక్ వ్యవహారంలో అరెస్టైన వారి సంఖ్య 15కు చేరింది.

IPL_Entry_Point

టాపిక్