శ్రీసత్య జిల్లాలోని రామగిరి మండల పరిధిలో 15 ఏళ్ల దళిత బాలికపై రెండేళ్లుగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం…. బాలిక గర్భం దాల్చడంతో ఈ దారణం బయటికి వచ్చింది. జూన్ 9న బాధితురాలు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. నిందుతులపై పోక్సో, అట్రాసిటీ, బీఎన్ ఎస్ లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ కేసులో అచ్చంపల్లి వర్ధన్ (21), తలారి మురళి (25), బడగొర్ల నందవర్ధన్ రాజ్ (23), ఆరెంచెరు నాగరాజు (51), బోయ సంజీవ్ (40), బుడిద రాజన్న (49)లను జూన్ 9వ తేదీన అరెస్టు చేశారు. జూన్ 10న మరో ఏడుగురిని అరెస్టు చేయగా…. ప్రధాన నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు.
ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలోని ప్రత్యేక బృందాల సమన్వయంతో నిందితులను గుర్తించినట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ వి. రత్న తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకుని వారిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
బాలికను అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ఎస్పీ చెప్పారు. ఎనిమిది నెలల గర్భిణి అయిన బాలిక ప్రస్తుతం అనంతపురం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు.
గర్భం దాల్చడంతో అబార్షన్ చేయకూడదని వైద్యులు, జిల్లా అధికారులు నిర్ణయించారు. ప్రసవం తర్వాత బాలికను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు పోలీసులు…. చైల్డ్ వెల్ఫేర్ కమిటీతో సమన్వయం చేసుకుంటున్నారు. పుట్టబోయే బిడ్డకు డీఎన్ఏ పరీక్షకు అనుమతి తీసుకోనున్నారు. ఈ విషయంలో కోర్టు అనుమతి తీసుకోనున్నారు.
అరెస్ట్ అయిన వారిలో కొందరికి నేరచరిత్ర ఉందని ఓ విచారణాధికారి తెలిపారు. 8 నెలలు గర్భవతి అయినప్పటికీ విషయం బయటికి రాలేదన్నారు. సమాజంలో ఎదురయ్యే సమస్యల భయంలో బాధితులు విషయం బయటికి చెప్పలేదని తెలుస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ కేసును క్లోజ్ చేసే దిశగా గ్రామంలోని కొందరు బాలికపై ఒత్తిడి తెచ్చినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు.అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
బాధితురాలి తల్లి కూలీ కాగా… తండ్రి చనిపోయాడు. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.ఈ కేసులో సంచలన విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.