Vizag Steel Plant Package : ప్రైవేటీకరణ ప్రతిపాదన నుంచి ప్యాకేజీ వరకు..! ముఖ్యమైన 10 విషయాలు
Vizag Steel Plant Package : విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. దీంతో ఉక్కు పరిశ్రమకు భారీ ఊతం లభించినట్లు అయింది. అంతేకాదు… ప్రైవేటీకరణ ప్రక్రియకు కూడా బ్రేకులు పడినట్లే అవుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
విశాఖ ఉక్కు కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం దన్నుగా నిలిచింది. ప్రైవేటీకరణ విషయాన్ని పక్కన పెడుతూ…. భారీ ఊతం ఇచ్చేలా ప్యాకేజీని ప్రకటించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో విశాఖ ఉక్కు కార్మాగారం నిర్వహణకు ఢోకా లేదన్న చర్చ వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
2021 ఏడాది నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం వాటాను అమ్మేసేందుకు సిద్ధమైంది. అప్పట్నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా ఆందోళనలు, నిరసలు కొనసాగుతున్నాయి. ఓవైపు కార్మికులతో పాటు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా తమవంతుగా పలు కార్యక్రమాలు నిర్వహించాయి. సందర్భాన్ని బట్టి కార్మికులకు ప్రత్యక్షంగానూ మద్దతు పలికాయి.
ఓవైపు కార్మికుల పోరాటంతో పాటు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందనే అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యక్తమవుతూ వచ్చాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీనే ఇందుకు బలమైన నిదర్శనమని చెప్పొచ్చు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి ఆర్థిక ప్యాకేజీ ప్రకటన వరకు ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం…!
ప్రైవేటీకరణ నుంచి ప్యాకేజీ వరకు..! ముఖ్యమైన అంశాలు
- రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక భాగం. స్టీల్ ప్లాంట్ కు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై గత కొన్ని రోజులుగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 2021 నుంచి ప్రైవేటీకరణ అంశం బలంగా తెరపైకి వచ్చింది. నాటి నుంచి స్టీల్ ప్లాంట్ పై నీలినీడలు కొనసాగుతూనే ఉన్నాయి.
- నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను గట్టెక్కించాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని 2021 నుంచి ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. నేటి వరకు కూడా వీరి ఆందోళన కొనసాగుతూనే ఉంది.
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగే ప్రసక్తే లేదన్నట్లు ఆ తర్వాత పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రైవేటీకరణ దిశగా పలుమార్లు కీలక ప్రకటన కూడా వచ్చాయి.
- ఓవైపు కార్మికుల పోరాటంతో పాటు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఏపీలోని కూటమి ప్రభుత్వం… కేంద్రంతో చర్చలు జరుపుతూ వచ్చింది. స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక భరోసా ఇవ్వాలని కోరుతూ రాగా… తాజాగా భారీ ప్యాకేజీని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
- ప్లాంట్‌ను పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపించేందుకు రూ.11,440 కోట్ల ప్యాకేజీపై కేంద్ర ప్రభుత్వం జనవరి 17, 2025వ తేదీన ప్రకటన చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దీనికి ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
- కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో డైరెక్ట్ ఈక్విటీ కింద రూ.10,300 కోట్లు, షేర్ క్యాపిటల్ కింద రూ.1,140 కోట్లు కేటాయించారు. ఇదే విషయాన్ని ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో పాటు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
- కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ… ఇది స్వల్ప ఊరట మాత్రమే అని అభిప్రాయపడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ భారీగా అప్పుల్లో ఉందని ప్రస్తావిస్తున్నాయి. దీన్ని నుంచి బయటపడాలంటే స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు సమకూర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
- స్టీల్‌ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడవాలంటే సొంత గనులు కేటాయించటమే ఏకైక మార్గమని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రైవేటీకరణ చర్యలపై వెనక్కి తగ్గుతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పష్టమైన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
- ప్రత్యేక ప్యాకేజీని కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన స్వాగతిస్తున్నాయి. తమ ప్రభుత్వ కృషి వల్లే ఈ ప్రకటన సాధ్యమైందని చెబుతున్నాయి.
సంబంధిత కథనం