Haindava Shankaravam Vijayawada : చరిత్రలో నిలిచేలా హైందవ శంఖారావం.. 10 ప్రత్యేకతలు ఇవే
Haindava Shankaravam Vijayawada : హైందవ శంఖారావంతో కృష్ణా జిల్లాకు కళ వచ్చింది. శంఖారావంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. లక్షలాది మంది వస్తారని అంచనా వేసి అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు.
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో తలపెట్టిన హైందవ శంఖారావం.. చరిత్రలో నిలిచిపోనుంది. గన్నవరం మండలం కేసరపల్లిలో శంఖారావ సభావేదిక పరిరాలను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హైందవ కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
1.హైందవ శంఖారావానికి వచ్చేవారి కోసం ప్రత్యేకంగా రైళ్లు, బస్సులు ఏర్పాటు చేశారు. ఉప్పులూరు రైల్వే స్టేషన్‌కు 15 ప్రత్యేక రైళ్లలో ఆదివారం తెల్లవారుజామున వీహెచ్‌పీ కార్యకర్తలు వచ్చారు.
2.ప్రత్యేక బస్సులు, కార్లు, బైక్‌లతో ర్యాలీగా సుమారు మూడు లక్షల మంది సభకు హాజరవుతారని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు వెల్లడించారు.
3.సభ, సాంస్కృతిక వేదికను పక్క పక్కనే ఏర్పాటు చేయగా.. వేదికకు ఎదురుగా ఐదు బ్లాక్‌లలో 50 గ్యాలరీలను ఏర్పాటు చేశారు.
4.కేసరపల్లి పరిసరాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కాషాయ జెండాలతో తీర్చిదిద్దారు. విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్‌కుమార్, అయోధ్య రామ మందిరం ట్రస్టీ గోవింద్‌దేవ్ మహరాజ్, వీహెచ్‌పీ కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్ పరందే, జాయింట్ సెక్రటరీ కోటేశ్వరశర్మలు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.
5.రాష్ట్రంలోని 150 మంది స్వామీజీలు ఈ శంఖారావంలో పాల్గొననున్నారు. ఇక్కడికి వచ్చే వారందరికీ తగినట్లు వసతి, తాగునీరు, మరుగుదొడ్లు ఇతర ఏర్పాట్లు చేశారు.
6.దాదాపు వంద ఎకరాల్లో 11 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు వందకు పైగా భోజన కౌంటర్లను ఏర్పాటు చేశారు.
7.పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శంఖారావం పరిసరాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. నిఘా వ్యవవస్థను పర్యవేక్షిస్తున్నారు.
8.హైందవ శంఖారావం నేపథ్యంలో విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. ముఖ్యంగా చైన్నై- విశాఖ, విశాఖ- హైదరాబాద్ వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నారు.
9.హిందూ ధార్మిక, ఆథ్మాత్మిక, సేవా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, వాలంటీర్లకు బస, ఆహారం, పార్కింగ్ వసతులకు.. ఉప్పలూరు- కేసరపల్లి మధ్య భారీ ఏర్పాట్లు చేశారు.
10.దాదాపు 35 వేల మందికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం, వడ్డనకు ఏర్పాట్లు చేశారు. వెయ్యికి పైగా వ్యక్తిగత మరుగుదొడ్లను అందుబాటులో ఉంచారు. తాగడానికి వాటర్ ప్లాంట్, మంచి నీటి ట్యాంకర్లు సిద్ధంగా ఉంచారు. ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా అన్నీ అందుబాటులో ఉంచారు.