Raptadu Politics : రాప్తాడులో మళ్లీ వేడెక్కిన రాజకీయం.. కారణాలు ఏంటి? 10 ముఖ్యమైన అంశాలు
Raptadu Politics : రాప్తాడు.. రాయలసీమలో అత్యంత సున్నితమైన నియోజకవర్గం. ఇక్కడ రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉంటుంది. పరిటాల ఫ్యామిలీ వర్సెస్ తోపుదుర్తి కుటుంబం ఇందుకు కారణం. తాజాగా రాప్తాడులో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అలర్ట్ అవ్వడంతో ఘర్షణలు జరగలేదు.
రాప్తాడు రాజకీయం మళ్లీ వేడెక్కింది. టీడీపీ వర్సెస్ వైసీపీ ఫైట్ ఉద్రిక్తతకు దారితీసింది. వివిధ స్థానాలకు గురువారం జరిగిన మండలాధ్యక్షుల ఉప ఎన్నికలు ఉద్రిక్తతకు కారణమయ్యాయి. రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఘర్షణకు దారితీశాయి. రాప్తాడులో అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
10 ముఖ్యమైన అంశాలు..
1.ఉమ్మడి అనంతపురం జిల్లాలో వివిధ స్థానాలకు గురువారం మండలాధ్యక్షుల ఉప ఎన్నికలు జరిగాయి. రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది.
2.రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదాపడడంతో మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు సుజాత, సాయిలీల, ఆదిలక్ష్మి, భారతి, వెంకటలక్ష్మి, చిన్నకొండయ్యలను బైండోవర్ చేయడం కోసం పోలీసులు పెనుకొండ తహసీల్దార్ వద్దకు తీసుకొచ్చారు.
3.ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఉషశ్రీచరణ్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ గిరిజ అక్కడికి వచ్చారు. తమ పార్టీ ఎంపీటీసీ సభ్యులను బయటకు పంపాలని డిమాండ్ చేశారు.
4.తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తన అనుచరులతో కలసి తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. ఆయన్ను పోలీసులు అడ్డుకుని బయటకు పంపారు.
5.అదే సమాయానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి వచ్చారు. పరిటాల శ్రీరామ్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. పోటీగా వైసీపీ కార్యకర్తలు జగన్, ప్రకాష్ రెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు.
6.పోటాపోటీ నినాదాలతో తహసీల్దార్ ఆఫీస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను కంట్రోల్ చేశారు. అయినా నినాదాలు ఆగలేదు.
7.తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇక్కడేం పని అని తోపుదుర్తి పోలీసులను ప్రశ్నించారు. టీడీపీ లీడర్ల నినాదాలపై ఆగ్రహించిన ప్రకాష్ రెడ్డి.. వారిపైకి దూసుకెళ్లారు.
8.ఈ సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వెంటనే పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలీసుల చర్యలపై ఆగ్రహించిన ఉషశ్రీచరణ్, గిరిజ పార్టీ శ్రేణులతో కలసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.
9.బైండోవర్ చేసిన తరువాత ఎంపీటీసీ సభ్యులను అధికారులు బయటకు పంపారు. వారిలో ఐదుగురు ఎంపీటీసీలు వైసీపీ నాయకులతో వెళ్లారు. ఒకరు మాత్రం టీడీపీ నాయకులతో వెళ్లిపోయారు.
10.తాజాగా పరిస్థితుల నేపథ్యంలో.. రాప్తాడు నియోజకవర్గంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. రామగిరి మండలంలో ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు. సున్నితమైన గ్రామాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.