AP Wines Syndicate 2024 : వైన్ షాప్స్ సిండికేట్ అంటే ఏంటీ.. ఎలా పనిచేస్తుంది..? 10 కీలక అంశాలు
AP Wines Syndicate 2024 : ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా.. మద్యం దుకాణాలపైనే చర్చ జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం సిండికేట్ దందా. అవును ప్రస్తుతం ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో సిండికేట్ దందా నడుస్తోంది. వీరికి అధికార పార్టీ నేతలు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో చాలా రోజుల తర్వాత ప్రైవేట్ వైన్ షాపులు తెరుచుకున్నాయి. కొత్త బ్రాండ్లు, మద్యం రేట్ల విషయం ఎలా ఉన్నా.. ఇప్పుడు ఇష్యూ అంతా సిండికేట్ ల చుట్టూ తిరుగుతోంది. దీంతో అసలు సిండికేట్ అంటే ఏంటీ.. వైన్ షాపుల విషయంలో సిండికేట్ పాత్ర ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. దానికి సంబంధించి 10 కీలక అంశాలు ఇలా ఉన్నాయి..
1.సిండికేట్ అంటే.. లోకల్‌గా కొంతమంది కలిసి గ్రూప్ గా ఏర్పడతారు. వారు వైన్ షాపుల కోసం టెండర్ వేస్తారు. లాటరీలో వారికి షాపులు దక్కితే.. వారనుకున్న విధంగా వ్యాపారం కొనసాగిస్తారు.
2.ఎక్కడా పూర్తిస్థాయిలో వైన్ షాపులు సిండికేట్ వ్యాపారులకు దక్కలేదు. దీంతో షాపులు దక్కించుకున్న వారితో బేరాలు కుదుర్చుకుంటున్నారు. కుదరకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీరికి ఎమ్మెల్యేలు, ఎంపీలు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
3.సిండికేట్ గా ఏర్పడి వ్యాపారం చేస్తే.. చాలా లాభాలు ఉంటాయని వ్యాపారులు నమ్ముతారు. అందరినీ విరి గుప్పిట్లో పెట్టుకొని వ్యవహారం నడిపిస్తారు. అధికారులు మొదలు.. అందరూ విరి చెప్పుచేతల్లో ఉంటారు.
4.ఉదాహరణకు.. నూజివీడు నియోజకవర్గంలో 4 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉంది. అక్కడ కొందరు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి టెండర్లు వేశారు. ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, నూజివీడు రూరల్, నూజివీడు మున్సిపాలిటీ లో ఉన్న వైన్ షాపుల కోసం టెండర్లు వేస్తారు.
5.వీరికి అన్ని షాపులు దక్కలేదు కాబట్టి.. వైన్ వచ్చిన వారిని సిండికేట్ లోకి ఆహ్వానిస్తారు. కుదరకపోతే.. ఆ మద్యం దుకాణాన్ని లీజుకు తీసుకుంటారు. ఇలా అన్ని షాపులను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు.
6. అలా తెచ్చుకున్న తర్వాత కొన్ని రోజులకు దందా స్టార్ట్ చేస్తారు. ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తారు. వారికి పోటీ ఉండదు కాబట్టి.. అన్ని షాపుల్లో అదే రేటు ఉంటుంది.
7.సిండికేట్ ల కారణంగా బెల్టు షాపులు విచ్చలవిడిగా పెరిగిపోతాయి. బెల్టు షాపుల నిర్వాహకులు కూడా వీరి దగ్గర నుంచే సరుకు తీసుకెళ్లాలా హుకుం జారీ చేస్తారు. వేరే దగ్గర స్టాక్ తీసుకొస్తే.. అధికారులతో కేసులు పెట్టిస్తారు.
8.ఒకవేళ బెల్టు షాపుల నిర్వాహకులు వచ్చి సరకు తీసుకెళ్లే పరిస్థితి లేకపోతే.. ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి.. వీరే సరకు డెలివరీ చేస్తారు. అందుకు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు. ఫలితంగా గ్రామాల్లో మద్యం ధరలు ఎమ్మార్పీ కంటే ఎక్కువగా ఉంటాయి.
9.సిండికేట్ ఏర్పాటు కారణంగా.. అన్ని వైన్ షాపు లకు సమాన లాభాలు దక్కుతాయి. రద్దీ ఎక్కువ ఉన్న షాపులు.. తక్కువ ఉన్న షాపులకు సమాన వాటా ఉంటుంది. దీంతో ఎక్కువ రద్దీ ఉన్న షాపులు దక్కించుకున్న వారు నష్టపోతారు.
10.సిండికేట్ నిర్వాహకులకు ఇటు అధికారులు, అటు పొలిటికల్ సపోర్ట్ కామన్ గా ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎక్కువ ధరకు మద్యం విక్రయించినా.. చూసీచూడనట్టు వదిలేస్తారు. సిండికేట్‌ల కారణంగా అందరూ బాగానే ఉంటారు కానీ.. అంతిమంగా నష్టపోయేది మద్యం లాగేవాళ్లే.