ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణ వేగవంతం అయ్యింది. ఈ కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ ఇద్దరిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు. 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్ట్‌లో కోరారు సిట్ అధికారులు. ఈ సమయంలో ధనుంజయ రెడ్డి గురించి జోరుగా చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన 10 అంశాలు ఇలా ఉన్నాయి.
1.ఉమ్మడి కడప జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లెకు చెందిన ధనుంజయ రెడ్డి.. 1988లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో ఆ పంచాయతీకి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్ కుటుంబానికి ధనుంజయ రెడ్డి నమ్మినబంటు అనే పేరుంది.
2.చెన్నముక్కల పల్లెకు సర్పంచిగా పనిచేస్తూనే.. డానిక్స్ సర్వీసుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఉన్నా.. వైఎస్ రాజశేఖర రెడ్డితో సంబంధాలు కొనసాగించారు. ఆయన ఆర్థిక లావాదేవీల్ని కూడా ధనుంజయ రెడ్డి చూసేవారనే ప్రచారం ఉంది.
3.వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యాక.. రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చారు ధనుంజయ రెడ్డి. దాదాపు ఎనిమిదేళ్లపాటు జీహెచ్‌ఎంసీలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. తర్వాత ఆయనను రాష్ట్ర సర్వీసులో విలీనం చేసుకున్నారు. ఎనిమిదేళ్లు డిప్యూటీ డైరెక్టర్ హోదా పోస్టులో పనిచేస్తే ఐఏఎస్‌కు ఎంపిక చేయవచ్చన్న క్లాజ్‌తో.. ఆయన పదోన్నతి పొందారు.
4.విభజిత ఆంధ్రప్రదేశ్‌లో.. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఆయనకు గోదావరి పుష్కరాలకు ప్రత్యేకాధికారి, వ్యవసాయశాఖ కమిషనర్, విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్, ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవో, శ్రీకాకుళం కలెక్టర్, ఏపీటీడీసీ ఎండీ వంటి కీలక బాధ్యతలు అప్పగించింది. ధనుంజయ రెడ్డి టీడీపీ హయాంలో కీలక పోస్టుల్లో కొనసాగుతూనే.. వైసీపీ కోసం పనిచేసేవారన్న ఆరోపణలు ఉన్నాయి.
5.జగన్ రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం, కేసులు పెట్టించి అరెస్టులు చేయించడంలో ధనుంజయ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారనే టాక్ ఉంది. కొందరు టీడీపీ నాయకుల్ని అరెస్ట్ చేసి.. వివిధ స్టేషన్లకు తిప్పడం, కస్టడీలో చిత్రహింసలు పెట్టడం వంటి వ్యవహారాల్ని ఆయన స్వయంగా పర్యవేక్షించేవారనే ఆరోపణలు ఉన్నాయి.
6.రాజకీయంగా కూడా జగన్ తరఫున వ్యవహారాలూ ధనుంజయ రెడ్డి చక్కబెట్టేవారనే ప్రచారం జరిగింది. ఎమ్మెల్యేల పనితీరునూ ఆయనే సమీక్షించేవారని చెబుతుంటారు. జగన్‌ను ఎవరు కలవాలన్నా.. ముందు ధనుంజయ రెడ్డి అనుమతి తప్పనిసరి అనే ప్రచారమూ ఉంది. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపికలోనూ ధనుంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారని చెబుతారు.
7.వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీలో చాలా నియోజకవర్గాల్లో అంతర్గత విబేధాలు ఉండేవి. వాటి గురించి మాట్లాడటానికి జగన్ దగ్గరకు వెళ్తే.. 'ధనుంజయ్ అన్న'ను కలిసి మాట్లాడండని ఆయన చెప్పేవారని వైసీపీ నేతలే చెబుతుంటారు.
8.ఉమ్మడి అనంతపురం జిల్లాలకు చెందిన వైసీపీ సీనియర్ నేత.. ఓసారి ధనుంజయ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది. అదే సమయంలో రాజకీయం గురించి ధనుంజయ రెడ్డికి చెప్పమనడం ఏంటని.. ఆయన జగన్‌ను కూడా నిలదీసినట్టు ప్రచారం జరిగింది. ఇలా చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ధనుంజయ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
9.'అన్ని విషయాల్లో ధనుంజయ రెడ్డి అతిగా జోక్యం చేసుకునేవారు. ఆయనది రాయలసీమే అయినా.. ఫ్యాక్షన్ రాజకీయాల గురించి ఆయనకు తెలియదు. పార్టీలో వర్గపోరు నష్టం చేస్తుందని జగన్‌కు చెప్పడానికి వెళ్లాను. కానీ ఆయన ధనుంజయన్నకు చెప్పాలని సూచించారు. ఆ అవసరం నాకు లేదని.. ధనుంజయ రెడ్డిని కలవకుండానే వచ్చాను. ఎన్నికల్లో నేను ఊహించినట్టుగానే అనంతపురం జిల్లాలో నష్టం జరిగింది' అని వైసీపీ సీనియర్ నేత 'హిందుస్తాన్ టైమ్స్ తెలుగు' ప్రతినిధితో చెప్పారు.
10.'ధనుంజయ రెడ్డిని జగన్ బాగా నమ్మారు. ప్రభుత్వ అవసరాల కోసం ఆయనకు పనులు అప్పగించినా.. పార్టీ పరమైన విషయాలు జగన్ వింటే బాగుండేది. కానీ అలా జరగలేదు. మేము చాలా సందర్భాల్లో చెప్పాం. కానీ జగన్ పట్టించుకోలేదు. దాని ఫలితం ఎన్నికల్లో కనిపించింది. ధనుంజయ రెడ్డి కూడా జగన్‌కు నిజాలను చెప్పేవారు కాదు. ఆయనకు వచ్చినట్టు చెప్పేవారు. ఇది పార్టీలో అందరికీ తెలుసు. కానీ.. ఏం లాభం. నష్టం జరిగిపోయింది కదా' అని వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు.
సంబంధిత కథనం