Chaganti Koteswara Rao : చాగంటి కోటేశ్వర రావు గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
Chaganti Koteswara Rao : తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వర రావు. ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో, కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. వాటి నుంచి సునాయాసంగా బయటపడ్డారు. తాజాగా.. ఏపీ సర్కారు ఆయనకు సలహాదారుడి బాధ్యతను అప్పగించింది.
చాగంటి కోటేశ్వర రావు.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ప్రవచనకారుడు. ఆయన ప్రవచనాలు వినడానికి లక్షలాది మంది ఎదురుచూస్తుంటారు. విలువలకు కట్టుబడి, ఏమీ ఆశించకుండా ఆధ్యాత్మిక సందేశం ఇవ్వడం చాగంటి ప్రత్యేకత. చాగంటి విషయంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాగంటికి 'స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూ స్ సలహాదారుడి' గా బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయన గురించి 10 ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1.చాగంటి కోటేశ్వర రావు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య వ్యవసాయశాఖలో ఉన్నతాధికారిణి.
2.చాలా ఛానెళ్లలో చాగంటి ప్రవచనాలు వినిపిస్తాయి. అవి చూస్తే చాగంటి ఏనాడైనా ఆఫీసుకు వెళ్తారా అనే సందేహం వస్తుంది. కానీ చాగంటి కోటేశ్వర రావు ఆఫీసుకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు. లేట్ పెర్మిషన్ కూడా తీసుకోరని ఆయన సహోద్యోగులు చెబుతుంటారు.
3.చాగంటి కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే ప్రవచనాలు చెబుతారు. అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలోనే. కావాల్సిన ఛానెల్స్ వారు అక్కడికి వెళ్లి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు.
4.చాగంటి కోటేశ్వర రావుకు ఉన్న ప్రతిభా సంపత్తిని సొమ్ము చేసుకోవాలనుకుంటే.. ఈపాటికి వందల ఎకరాల భూములు సంపాదించేవారని.. ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
5.చాగంటి ప్రవచనాలు చెప్పినందుకు నయాపైసా తీసుకోరు. ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే.. తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తారు. నిర్వాహకులనుంచి డబ్బు తీసుకోరు.
6.చాగంటి కోటేశ్వర రావుకు ఉన్నది కేవలం రెండు పడక గదుల ఇల్లు. ఇప్పటి వరకు ఆయనకు కారు లేదు. ఆఫీసుకు కూడా బైక్ మీద వెళ్తారు.
7.చాగంటి చిన్న వయసులోనే తండ్రి మరణించారు. ఆయనకు ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లి కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు. సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న స్పృహతో చాగంటి విద్యను అభ్యసించారు.
8.పాఠశాల స్థాయి నుంచి చాగంటి ఉత్తమ విద్యార్థి. యూనివర్సిటీ స్థాయిలో ఆయనకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఆయన ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడికి తన సంపాదనతో పెళ్లిళ్లు చేశారు.
9.పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఒకచోట చాగంటిని కలిశారు. "మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను" అన్నారు పీవీ. చాగంటి నవ్వేసి "మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు." అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు.
10.చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరినే వరిస్తోంది. ఈ తరంలో చాగంటి కోటేశ్వర రావును వరించింది అని ఆయన బంధువులు చెబుతుంటారు.