VJA to Machilipatnam : విజయవాడ- మచిలీపట్నం హైవే విస్తరణ.. ఈ ప్రాంతాలకు మహర్దశ.. 10 ముఖ్యాంశాలు-10 important points regarding the expansion of the national highway between vijayawada and machilipatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vja To Machilipatnam : విజయవాడ- మచిలీపట్నం హైవే విస్తరణ.. ఈ ప్రాంతాలకు మహర్దశ.. 10 ముఖ్యాంశాలు

VJA to Machilipatnam : విజయవాడ- మచిలీపట్నం హైవే విస్తరణ.. ఈ ప్రాంతాలకు మహర్దశ.. 10 ముఖ్యాంశాలు

VJA to Machilipatnam : హార్బర్లను నేషనల్ హైవేలకు అనుసంధానం చేయాలనే ప్రతిపాదనలు ఇటీవల తెరపైకి వచ్చాయి. దీంట్లో భాగంగా.. విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదానిరి విస్తరించనున్నారు. దీంతో ఈ మార్గంలో ఉన్న ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

విజయవాడ- మచిలీపట్నం హైవే (istockphoto)

విజయవాడ- మచిలీపట్నం నేషనల్ హైవే 65ని ఆరు వరుసలుగా విస్తరించేందుకు.. ఎన్‌హెచ్‌ఏఐ కార్యాచరణ ప్రారంభించింది. జాతీయ రహదారులను నౌకాశ్రయాలకు అనుసంధానం చేసే ప్రాజెక్టులో భాగంగా.. ఈ రహదారిని మచిలీపట్నం పోర్టు వరకూ విస్తరిస్తారు. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన 10 అంశాలు ఇలా ఉన్నాయి.

1.విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు జాతీయ రహదారి 63 కిలో మీటర్ల మేర ఉంది. దీంట్లో అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు కంకిపాడు- ఉయ్యూరు మధ్య చలివేంద్రపాలెం సమీపంలో క్రాస్‌ అవుతుంది.

2.చలివేంద్రపాలెం నుంచి మచిలీపట్నం వరకు 44 కిలోమీటర్ల మేర ప్రస్తుతమున్న 4 వరుసల రోడ్డును ఆరు వరుసలుగా విస్తరిస్తారు. మచిలీపట్నం సమీపంలో ఒంగోలు- కత్తిపూడి జాతీయ రహదారి రెండు వరుసలుతో ఉంది. దీన్ని మాచవరం రైస్‌మిల్లు వరకు 4 కిలోమీటర్లు నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.

3.మాచవరం రైస్‌ మిల్లు వద్ద నుంచి పోర్టుకు 3.7 కిలోమీటర్లను నాలుగు వరుసలతో కొత్తగా రహదారిని నిర్మిస్తారు. వీటిలో ఆరు వరుసలుగా విస్తరించనున్న 44 కి.మీలతోపాటు 3.7 కి.మీ. మేర నాలుగు వరుసల హైవే నిర్మాణాన్ని ఎన్‌హెచ్‌ఏఐ చేపడుతుంది.

4.ఒంగోలు- కత్తిపూడి హైవేలో 4 కిలోమీటర్ల మేర విస్తరించే పనులను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్‌) పర్యవేక్షిస్తుంది. ఈ రహదారికి చెందిన డీపీఆర్‌ తయారీ బాధ్యత చైతన్య, ఎంఎస్‌ పార్క్‌ జేవీ సంస్థకు అప్పగించారు.

5.విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఉన్న హైవేలో.. ఓఆర్‌ఆర్‌ క్రాస్‌ అయ్యే ప్రాంతం నుంచి మాత్రమే రహదారిని విస్తరించనున్నారు.

6.విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ నుంచి పోరంకి, పెనమలూరు కూడలి, కంకిపాడు మీదుగా చలివేంద్రపాలెం వరకు 19 కిలోమీటర్ల మేర ఉన్న మార్గాన్ని ఆరు వరుసలుగా విస్తరించడంపై ఇంకా స్పష్టత లేదు.

7.విజయవాడ నగర పరిధిలో వాహన రద్దీ ఈ పరిధిలోనే ఎక్కువగా ఉంటుంది. హైవే నుంచి పోర్టు కనెక్టివిటీకి ఎన్‌హెచ్‌ఏఐ ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా ఓఆర్‌ఆర్‌ క్రాస్‌ అయ్యే ప్రాంతం నుంచే పోర్టుకు అనుసంధానంపై ప్రస్తుతం దృష్టిపెట్టినట్టు అధికారులు చెబుతున్నారు.

8.హైవే విస్తరణతో రోడ్డు వెడల్పు అవుతుంది. దీనివల్ల ట్రాఫిక్ సాఫీగా సాగుతుంది. వాహనాల రాకపోకలు సులువుగా ఉండటం వల్ల ప్రయాణ సమయం తగ్గుతుంది.

9.విజయవాడ - మచిలీపట్నం మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయి. సరుకు రవాణా సులువుగా, త్వరగా జరుగుతుంది ఇది వ్యాపారాలకు లాభదాయకం.

10.మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం సులభమవుతుంది. మంచి రోడ్డు సౌకర్యం పర్యాటకులను ఆకర్షిస్తుంది.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం