Amaravati ORR : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు.. 10 ముఖ్యమైన అంశాలు-10 important points regarding amaravati outer ring road alignment ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amaravati Orr : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు.. 10 ముఖ్యమైన అంశాలు

Amaravati ORR : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు.. 10 ముఖ్యమైన అంశాలు

Amaravati ORR : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో రాజధాని రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ ప్రాజెక్టు అమరావతికి మణిహారంగా మారనుంది. దీన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఈ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో కేంద్రం స్వల్ప మార్పులు సూచించింది.

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. అమరావతి పనులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గతంలో నిలిచిపోయిన పనులను మళ్లీ స్టార్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్రం సహకారంతో పలు ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. వీటి సంగతి అటుంచితే.. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వీలైనంత త్వరగా దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

10 ముఖ్యమైన అంశాలు..

1.అమరావతి ఔటర్‌ రింగ్ రోడ్డు నిర్మాణానికి తాజాగా మార్గం సుగమమైంది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు చెందిన అలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ ఓఆర్‌ఆర్‌కు ఆమోదం తెలిపింది.

2.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో అప్రూవల్‌ కమిటీ నాలుగు చోట్ల స్వల్ప మార్పులను సూచించింది. దాని ప్రకారం మార్పులు చేసి.. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రతిపాదనలు పంపింది. వాటికి కూడా ఆమోదం లభించింది.

3.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి దాదాపు వారం రోజుల్లో అధికారిక పత్రాలు అందుతాయని.. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు.

4.తాజాగా ఆమోదించిన అలైన్‌మెంట్‌ ప్రకారం.. ఔటర్‌ రింగ్‌రోడ్డు 189.4 కిలోమీటర్ల మేర ఏర్పాటు కానుందని అధికారులు చెబుతున్నారు.

5.ఉమ్మడి కృష్ణా, గుంటూరు జల్లాల్లోని 22 మండలాల పరిధిలోని 87 గ్రామాల మీదుగా 6 వరుసల్లో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగనుంది.

6.ఇటీవల ఓఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌పై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు డ్రోన్‌ సర్వే చేశారు. ఈ సర్వేలో రెండు చోట్ల చేపల చెరువులు, ఒకచోట గోడౌన్‌, మరోచోట ితర నిర్మాణం ఉన్నట్లు గుర్తించారు.

7.కృష్ణా జిల్లాలో దుగ్గిరాలపాడు- జుజ్జూరు మధ్య, మైలవరం వద్ద, సగ్గూరు వద్ద, గుంటూరు జిల్లాలోని వేజెండ్ల-శలపాడు మధ్య మార్పులు చేయాలని అప్రూవల్ కమిటీ సూచించింది.

8.ఔటర్ రింగ్ రోడ్డు తూర్పు భాగంలో.. కృష్ణా జల్లా వల్లూరుపాలెం- గుంటూరు జిల్లా మున్నంగి మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఒక వంతెన, పల్నాడు జిల్లా బలుసుపాడు కృష్ణా జిల్లా మున్నలూరు మధ్య 3.150 కిలోమీటర్ల మేర మరో వంతెన నిర్మించనున్నారు. ఈ రెండు వంతెనలు కృష్ణా నదిపై ఉండనున్నాయి.

9.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ వ్యయం రూ.16,310 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఈ రోడ్డు నిర్మాణానికి వినియోగించే స్టీల్, సిమెంటుకు రాష్ట్ర జీఎస్టీని మినహాయించనున్నారు. ఇసుక, కంకర, గ్రావెల్‌పై సీనరేజి ఫీజును మినహాయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

10.మొత్తం 11 విభాగాలుగా, 3 దశల్లో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, తెనాలి ఓఆర్‌ఆర్‌ పరిధిలోకి రానున్నాయి. దీని నిర్మాణంతో.. భూముల ధరలు పెరుగనున్నాయి. అటు కనెక్టివిటీ మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.