'గోదావరి - బనకచర్ల' ప్రాజెక్ట్ ఏంటి..? వివాదం ఎందుకు..? 10 ముఖ్యమైన విషయాలు-10 important points about godavari banakacherla project ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  'గోదావరి - బనకచర్ల' ప్రాజెక్ట్ ఏంటి..? వివాదం ఎందుకు..? 10 ముఖ్యమైన విషయాలు

'గోదావరి - బనకచర్ల' ప్రాజెక్ట్ ఏంటి..? వివాదం ఎందుకు..? 10 ముఖ్యమైన విషయాలు

ఏపీ - తెలంగాణ రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్ట్ వివాదానికి దారి తీస్తోంది. ఓవైపు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఏపీ సర్కార్ వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్ట్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని తెలంగాణ సర్కార్ చెబుతోంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి.? వివాదానికి గల కారణాలేంటో చూద్దాం…!

బనకచర్ల ప్రాజెక్ట్ మ్యాప్

'గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్'…. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి కారణమవుతున్న అంశం. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. జల హారతి కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన అన్నీ అనుమతులపై కూడా దృష్టి పెట్టింది.

ఇదిలా ఉంటే తెలంగాణ సర్కార్ ఈ ప్రాజెక్ట్ ను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తోంది. ఇటీవలనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీలో పర్యటించింది. కేంద్ర జలశక్తి మంత్రికి ప్రాజెక్ట్ కు ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా నిలవరించాలని కోరింది. మరోవైపు తెలంగాణలోని పలు రాజకీయ పక్షాలతో పాటు ఇతర సంఘాలు కూడా ఈ ప్రాజెక్ట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగకుండా అడ్డుకోవాలని సర్కార్ పై ఒత్తిడి తెచ్చే పనిలో ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ను ఏపీ సర్కార్ ఎందుకు నిర్మించాలనుకుంటోంది..? వివాదానికి గల కారణాలెంటో ఇక్కడ తెలుసుకోండి…..

బకనచర్ల ప్రాజెక్ట్ - 10 ముఖ్యమైన అంశాలు:

  1. గోదావరి నిరంతరం పారుతూనే ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం సమయంలో భారీస్థాయిలో వరద పారుతుంది. ఈ సమయంలో వేల టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలోకి కలిసిపోతుంటాయి. అయితే ఏటా సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
  2. ఏపీ సర్కార్ చెబుతున్న వివరాల ప్రకారం…. గోదావరి నుంచి సగటున ప్రతి ఏడాది రెండు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. కాబట్టి వృథా నీటి నుంచి వరదల సమయంలో 200 టీఎంసీలను మళ్లించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అందుకోసమే ఈ ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకువచ్చినట్లు ఏపీ సర్కార్ చెబుతోంది.
  3. మొత్తం రూ.80,112 కోట్లతో గోదావరి - బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం జల హారతి కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి నివేదికను కేంద్ర జల శక్తి శాఖకు కూడా అందజేసింది.
  4. రాయలసీమకు తాగునీటితో పాటు కొత్తగా మూడు లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం. అంతేకాకుండా సాగర్‌ కుడి కాలువ, వెలిగొండ, గాలేరు నగరి, కేసీ కెనాల్‌, తెలుగు గంగా కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది.
  5. ఈ ప్రాజెక్ట్ ను మొత్తం 3 దశల్లో పూర్తి చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. గోదావరిలో వరద వచ్చినప్పుడు రోజుకు రెండు టీఎంసీల చొప్పున ఏటా 200 టీఎంసీలను తీసుకోనుంది. పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణా నదిలోకి…. అక్కడి నుంచి నాగార్జునసాగర్‌ కుడికాలువ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్‌లోకి తీసుకోనుంది. అక్కడ్నుంచి బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు తరలించాలనేది ఏపీ సర్కార్ ప్లాన్.
  6. మొదటి దశ కింద పోలవరం నుంచి కృష్ణా నదికి జలాల మళ్లించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. సెకండ్ ఫేజ్ కింద బొల్లపల్లి వద్ద రిజర్వాయర్‌ నిర్మించి… అక్కడికి నీళ్లు తరలించాలని చూస్తోంది. ఇక ఫైనల్ ఫేజ్ లో బొల్లపల్లి నుంచి బనకచర్ల రెగ్యులేటర్‌కు నీళ్లు తరలించాలని భావిస్తోంది.
  7. గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు కోసం 48 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. 2 టన్నెళ్లు, 9 చోట్ల పంపు హౌస్‌ల నిర్మాణం అవసరమని ఏపీ సర్కార్ భావిస్తోంది. కొన్నిచోట్ల గ్రావిటీ కాలువల నిర్మాణం కూడా చేపట్టే అవకాశం ఉంది.
  8. ఈ ప్రాజెక్ట్ ను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేస్తోంది. గోదావ‌రి వ‌ర‌ద జ‌లాల ఆధారంగా బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు ప్ర‌తిపాదిస్తున్నామ‌ని ఏపీ చెబుతోందని… కానీ జీడ‌బ్ల్యూడీటీ - 1980లో వ‌ర‌ద జ‌లాలు, మిగులు జ‌లాల ప్ర‌స్తావ‌నే లేదని తెలంగాణ సర్కార్ ప్రస్తావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ విభజన చట్టానికి వ్యతిరేకమని చెబుతోంది. ఈ ప్రాజెక్టులో నాగార్జున సాగర్‌ ను వినియోగించడాన్ని ముఖ్యంగా తప్పుబడుతోంది.
  9. 2014 ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్ట్ నిర్మించాల‌నుకుంటే ముందు ఆ న‌దీ యాజ‌మాన్య బోర్డు, సీడబ్యూసీ, జ‌ల్‌శ‌క్తి మంత్రి అధ్య‌క్ష‌త‌న‌ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు స‌భ్యులుగా ఉండే ఎపెక్స్ కౌన్సిల్‌లో చ‌ర్చించి అనుమ‌తి పొందాలి. బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో ఏపీ వీట‌న్నింటిని ఉల్లంఘిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
  10. తెలంగాణ‌కు గోదావ‌రి న‌దిలో 1000 టీఎంసీలు, కృష్ణా న‌దిలో 500 టీఎంసీలు మొత్తంగా 1500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రిత్వ శాఖ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిర‌భ్యంత‌ర ప‌త్రం (ఎన్‌వోసీ) జారీ చేయాలి. దానికి కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెల‌పాలి. 1500 టీఎంసీల నీటితో కోటిన్న‌ర ఎక‌రాల‌కు నీరు అందుతుంది. ఆ త‌ర్వాత ఏపీ చేపట్టే ప్రాజెక్టుల అనుమ‌తుల ప్ర‌క్రియ‌ను ప‌రిశీలిస్తే త‌మ‌కు ఎటువంటి అభ్యంత‌రం లేదని చెబుతోంది. ఇదే విషయంపై జూన్ 19వ తేదీన కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. ఇదే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందిస్తూ… “సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంతవరకు సమంజసం? రెండు రాష్ట్రాల జల వివాదాల వల్ల ఎలాంటి లాభం లేదు. సముద్రంలో కలిసే నీటి వాడకంపై చట్టబద్ధత కావాలంటే కేంద్రంతో చర్చిద్దాం” అని వ్యాఖ్యానించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.