AP River Connection : నదుల అనుసంధానం వల్ల ఉపయోగాలు ఏంటి.. 10 ముఖ్యమైన అంశాలు
AP River Connection : నదులను అనుసంధానం అనేది భారీ ప్రాజెక్టు. దీని వల్ల అనేక రకాలుగా లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నదుల అనుసంధానం గురించి అనేక అధ్యయనాలు జరిగాయి. తాజాగా.. ఏపీలో గోదావరి- బనకచర్ల అనుసంధానం అంశం తెరపైకి వచ్చింది. దీని వల్ల లాభాలు ఏంటో చూద్దాం.
తెలుగుతల్లికి జలహారతి.. ఇప్పుడు ఏపీలో దీని గురించే చర్చ జరుగుతోంది. నదుల అనుసంధానం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరిస్తూ.. దాని ప్రాధాన్యతను నొక్కిచెప్పారు. దీంతో అసలు నదుల అనుసంధానం ఎందుకు.. దీనివల్ల ఉపయోగాలు ఏంటీ.. అని ప్రజలు చర్చించుకుంటున్నారు. నదుల అనుసంధానం వల్ల ముఖ్యంగా 10 ప్రయోజనాలు ఉన్నాయి.
1. నీటి సమస్యకు పరిష్కారం:
నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుండి తక్కువగా ఉన్న ప్రాంతాలకు మళ్లించడం ద్వారా.. నీటి కొరతను తగ్గించవచ్చు. వ్యవసాయానికి అవసరమైన నీటిని సమృద్ధిగా అందించడం ద్వారా ఉత్పాదకత పెరుగుతుంది.
2. విద్యుత్ ఉత్పత్తి:
నదుల అనుసంధానం ద్వారా జలవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ఇది పర్యావరణానికి హాని కలిగించని శక్తి వనరు. ఆదాయం కూడా పెరుగుతుంది.
3. వరద నియంత్రణ:
వరద కాలంలో అధిక నీటిని నిల్వ చేసి.. కరువు కాలంలో వినియోగించుకోవచ్చు. ఇది వరదల వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది.
4. పారిశ్రామిక అభివృద్ధి:
పరిశ్రమలకు అవసరమైన నీటిని సమృద్ధిగా అందించడం ద్వారా.. పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించవచ్చు. పెద్దపెద్ద పరిశ్రమలు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.
5. పర్యాటకం:
నదుల అనుసంధానం ద్వారా కొత్త ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఇది పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. నీటి వనరులు ఎక్కువగా ఉన్న చోట పర్యాటకంగా అభివృద్ధి జరిగిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి.
6. నీటి నాణ్యత మెరుగుదల:
నదులను అనుసంధానం చేయడం ద్వారా.. జలాశయాలను శుద్ధీకరించడానికి అవకాశం ఉంటుంది. ఇది నీటి నాణ్యతను మెరుగుపరుస్తుంది.
7. నీటి రవాణా:
నీటి రవాణా ద్వారా సరకులను తక్కువ వ్యయంతో రవాణా చేయవచ్చు. ఇది రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తద్వారా ధరలు కూడా నియంత్రణంలో ఉంటాయి. సేవలు వేగంగా అందుతాయి.
8. మత్స్య సంపద :
నదుల అనుసంధానం ద్వారా జలచరాల సంఖ్య పెరుగుతుంది. ఇది మత్స్య సంపదను పెంచుతుంది. ఏపీలో లక్షలాది మంది మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్నారు.
9. భూగర్భ జలాలు పునరుద్ధరణ:
నదుల అనుసంధానం ద్వారా భూగర్భ జలాల స్థాయి పెరుగుతుంది. ఇది భవిష్యత్తు తరాలకు ఎంతో అవసరం.
10. సామాజిక-ఆర్థిక అభివృద్ధి:
నదుల అనుసంధానం ద్వారా ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. అయితే, ఈ ప్రాజెక్టుల వల్ల పర్యావరణంపై, సామాజికంగా, ఆర్థికంగా కూడా ప్రతికూల ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. అందుకే.. ఈ ప్రాజెక్టులను చేపట్టే ముందు సమగ్రమైన అధ్యయనం చేయడం చాలా ముఖ్యం అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.