CM Revanth serious on shadnagar dalit women incident| కర్కశంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు
05 August 2024, 13:28 IST
- బంగారం, నగదు అపహరించిందనే నెపంతో పోలీసులు ఓ దళిత మహిళను షాద్నగర్ పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాద్‌నగర్ అంబేడ్కర్ కాలనీలో ఉంటున్న నాగేందర్.. తన ఇంట్లో 26 తులాల బంగారం, రూ. 2లక్షల నగదు చోరీకి గురైందని జూలై 24న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చాడు. తమ ఇంటి సమీపంలో ఉండే సునీత, భీమయ్య దంపతులపై అనుమానం ఉందని చెప్పాడు. దీంతో ఇన్‌స్పెక్టర్ రామిరెడ్డి అదే రోజున సునీత, భీమయ్య దంపతులతో పాటు వారి 13 ఏళ్ల కుమారుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. అనంతరం భీమయ్యను పంపించారు. ఆ తర్వాత నేరం ఒప్పుకోవాలని ఇన్‌స్పెక్టర్ తనను విచక్షణా రహితంగా కొట్టారని సునీత ఆరోపించింది. మగ పోలీసులు తనపై ఎక్కడపడితే దాడి చేశారని, తన కుమారుడిని లాఠీతో కొట్టారని తెలిపింది. ఈ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.