Kondagattu Temple : కొండగట్టు ఆలయాన్ని పరిశీలించిన ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి...
12 February 2023, 23:08 IST
- Kondagattu Temple : యాదాద్రి తరహాలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర సర్కార్ సమాయత్తం అవుతోంది. సీఎం కేసీఆర్ సూచనలతో... ఆలయాన్ని సందర్శించిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి... అభివృద్ధి పనులపై అధికారులతో చర్చలు జరిపారు. ఫిబ్రవరి 14న సీఎం కేసీఆర్... కొండగట్టుకి వెళ్లనున్నారని తెలుస్తోంది.
కొండగట్టు ఆలయ అభివృద్ధికి వేగంగా అడుగులు
Kondagattu Temple : యాదాద్రిని దివ్య క్షేత్రంగా అభివృద్ధి చేసిన రాష్ట్ర ప్రభుత్వం... జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయంపై దృష్టి సారించింది. యాదాద్రి తరహాలోనే .. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని తీర్చిదిద్దాలని సంకల్పించిన సర్కార్... ఈ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే రూ. 100 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో... పనులు ప్రారంభించేందుకు సమాయత్తం అవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి... రెండు మూడు రోజుల్లో కొండగట్టుకి రానున్నారని... ఆలయ పనులకు సంబంధించిన విషయాలపై అధికారులతో చర్చించనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే... ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, యాదాద్రి ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి... ఆదివారం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. దేవలయాన్ని పరిశీలించిన ఆయన... జిల్లా కలెక్టర్, ఆలయ పూజారులతో చర్చలు జరిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆనంద్ సాయి... ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో.. తాను ఆలయాన్ని సందర్శించానని చెప్పారు. యాదాద్రి తర్వాత కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులు చేపట్టడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇది పెద్ద ప్రాజెక్ట్ అని.. క్షేత్రంలో కల్పించాల్సిన అన్ని సౌకర్యాలపై పరిశీలన జరిపాలని సీఎం కేసీఆర్ చెప్పారని పేర్కొన్నారు. పూజారులు, ఆలయ అధికారులతో చర్చించిన తర్వాత... భక్తులకు అన్ని సదుపాయాలతో కూడిన ఆలయ మాస్టర్ పాన్ ను రూపొందిస్తామని తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పనులు జరుగుతాయని... ఇప్పటికే ఉన్న ఆలయాల నిర్మాణ విలువలకి ఎలాంటి మార్పులు కలిగించకుండా... ప్రాజెక్టు పనులు చేపడతామని పేర్కొన్నారు.
400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండగట్టు ఆంజనేస్వామి ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే... వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఇక్కడ వసతులు లేవు. ఈ నేపథ్యంలో.. మాస్టర్ ప్లాన్ లో చేర్చాల్సిన అభివృద్ధి పనులపై ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రధాన ఆలయం, రథి విమాన గోపురం, రెండవ ప్రాకారం, నాలుగు వైపులా రాజగోపురాలు, యాగశాల, నివేదన శాల, అభిషేక మండపం, సత్యన్నారాయణ స్వామి మండపం, ధర్మ దర్శనం.. ప్రత్యేక దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు తదితర పనులపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఘాట్ రోడ్డు, మెట్ల మార్గం, గెస్ట్ హౌస్ తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. గతంలో దేవాలయం ఆధ్వర్యంలో కేవలం 45 ఎకరాలు మాత్రమే ఉండగా... 4 ఏళ్ల క్రితం జిల్లా కలెక్టర్ మరో 333 ఎకరాలను ఆలయ కమిటీకి అప్పగించారు. దీంతో... కొండగట్టు అంజన్న ఆలయ అథారిటీ పరిధిలో ప్రస్తుతం 378 ఎకరాలు ఉన్నాయి.
ఫిబ్రవరి 14న ముఖ్యమంత్రి కేసీఆర్... జగిత్యాల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఇదే సమయంలో ఆలయ అభివృద్దికి సంబంధించిన పనులపై చర్చిస్తారని సమాచారం. సీఎం కేసీఆర్ టూర్ నేపథ్యంలో జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయు కాలేజీలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ భాస్కర్ హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. మిగత శాఖల అధికారులు కూడా ఏర్పాట్లల్లో నిమగ్నం అయ్యారు.