TS Water Politics: నిప్పు రాజేస్తున్న నీళ్లు.. దక్షిణ తెలంగాణ క్షేత్రంగా పట్టు నిరూపణకు యత్నాలు
09 February 2024, 8:40 IST
- TS Water Politics: దక్షిణ తెలంగాణ క్షేత్రంగా పట్టు నిరూపణ కోసం పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. నల్గొండ వేదికగా కాంగ్రెస్ – బీఆర్ఎస్ పోరు తీవ్రమైంది. లోక్ సభ ఎన్నికల ముందు పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
దక్షిణ తెలంగాణ రాజకీయాలపై కృష్ణా జలాల ప్రభావం
TS Water Politics: ఒకరిది పట్టు నిలుపుకొనే ప్రయత్నం.. మరొకరిది తిరిగి పట్టు నిరూపించుకునే తాపత్రయం... కోల్పోయిన చోట వెదుక్కోవాలన్న సూక్తికి కట్టుబడినట్లు.. ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎత్తులు వేస్తుంటే.. తమకు అత్యంత బలమున్న చోట ఇతరులకు చిన్న అవకాశం కూడా ఇవ్వొద్దన్న రీతిలో అధికార కాంగ్రెస్ వ్యవహరిస్తోంది.
రెండు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలకు జలజగడం ప్రధాన కేంద్రంగా మారగా.. దానికి నల్గొండ వేదికవుతోంది. తెలంగాణలో అధికారం కోల్పోయేలా.. 2023 శాసన సభ ఎన్నికల్లో తమను దెబ్బతీసిన దక్షిణ తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల సమర శంఖం పూరించాలన్నది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది.
2014, 2018 ఎన్నికల్లో అధిక సీట్లు దక్కించుకుని రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కు మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఈ సారి పెద్ద దెబ్బకొట్టాయి. ఈ కారణంగానే బీఆర్ఎస్ అధికారానికి దూరం కావాల్సి వచ్చింది.
లోక్ సభ ఎన్నికల్లో ఈ సారి ఆ పరిస్థితిని తారుమారు చేయాలని బీఆర్ఎస్ జల ఉద్యమానికి సిద్దమవుతోంది. ఈ నెల 13వ తేదీన నల్గొండలో భారీ బహిరంగ సభ జరపాలని నిర్ణయించింది.
ఏమిటీ.. జల వివాదం
క్రిష్ణా నదిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టులను క్రిష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కె.ఆర్.ఎం.బి)కి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందని, దీనివల్ల తెలంగాణ జుట్టును కేంద్రం చేతిలో పెట్టడమేనని విమర్శిస్తూ, కాంగ్రెస్ చేసిన ఈ చర్య వల్ల క్రిష్ణా నదీ పరీవాహక జిల్లాల తాగు, సాగునీటికి తండ్లాడాల్సి వస్తుందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
అయితే.. తెలంగాణ శాసన సభ ఎన్నికల ఓటింగ్ కు ఒక రోజు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నల్గొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకుపై దాడి చేసింది. తమ పోలీసులను, ఇరిగేషన్ అధికారులను పంపించి బలవంతంగా 2వేల క్యూసెక్కుల నీటిని తరలించుకు పోయింది.
అప్పటి తెలంగాణ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండిపోయింది. ఈ వ్యవహారమంతా ఆ సమయంలోని తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పరస్పర అవగాహనతోనే చేసిన పని అని, తెలంగాణలో అధికారానికి దూరం అవుతున్నామని భావించిన కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి ఓట్లు దండుకునేందుకు పన్నిన కుయుక్తిగా కాంగ్రెస్ ప్రచారం చేసింది.
రాష్ట్రం ప్రభుత్వం మారాక.. క్రిష్ణా నదిపై ప్రాజెక్టుల నిర్వహణపై కె.ఆర్.ఎం.బి గతేడాది డిసెంబరు 17వ తేదీన ఒక సమావేశం కూడా జరిపింది. ఈ సమావేశం మినిట్స్ బయటకు రావడంతో, క్రిష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణను కె.ఆర్.ఎం.బి పరిధికి ఇచ్చివేసినట్లు బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది.
అది గత ప్రభుత్వ హయాంలో జరిగిందని, తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయంలో అమీతుమీ తేలుచుకునేందుకు ఇరు పార్టీలు సిద్ధపడుతున్నాయి.
నల్గొండ వేదికగా... బహిరంగ సభలు
క్రిష్ణా ప్రాజెక్టుల నిర్వహణ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో లబ్దిపొందాలని బీఆర్ఎస్ చూస్తోంది. ఈ నెల 13వ తేదీన నల్గొండలో భారీ బహిరంగ సభను తలపెట్టింది. దీనికోసం ఇప్పటికే నియోజకవర్గాల వారీగా మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను ఇన్ ఛార్జులుగా నియమించింది.
ప్రతీ నియోజకవర్గం నుంచి కనీసం 15వేల మందిని సమీకరించాలని నిర్ణయించింది. దీనికి ప్రతిగా కాంగ్రెస్ సైతం కనీసం రెండు లక్షల మందికి తగ్గకుండా నల్లగొండలోనే ఓ బహిరంగ సభను జరపాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ఈ మేరకు నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇరిగేషన్ శాఖా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మధ్య చర్చ కూడా జరిగిందంటున్నారు. ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రిష్ణా ప్రాజెక్టుల నిర్వహణ అంశం ఎజెండగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పన్నుతున్న ఎన్నికల వ్యూహాలు ఆసక్తి గొల్పుతున్నాయి.
( రిపోర్టింగ్: క్రాంతీపద్మ, నల్గొండ )