తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Kmc : వరంగల్ కేఎంసీ ఆసుపత్రిలో టైమ్ కు రాని వైద్యులు, రోగులకు తప్పని పడిగాపులు

Warangal KMC : వరంగల్ కేఎంసీ ఆసుపత్రిలో టైమ్ కు రాని వైద్యులు, రోగులకు తప్పని పడిగాపులు

HT Telugu Desk HT Telugu

Updated Jul 16, 2024 10:16 PM IST

google News
    • Warangal KMC : వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు రోగులకు చుక్కలు చూపిస్తున్నారు. సరైన సమయానికి వైద్యులు రాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వరంగల్ కేఎంసీ ఆసుపత్రిలో టైమ్ కు రాని వైద్యులు, రోగులకు తప్పని పడిగాపులు

వరంగల్ కేఎంసీ ఆసుపత్రిలో టైమ్ కు రాని వైద్యులు, రోగులకు తప్పని పడిగాపులు

Warangal KMC : ఉచిత వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు తిప్పలు తప్పడం లేదు. డాక్టర్లు సమయానికి రాక పేషెంట్లకు ఇబ్బందులు ఏర్పడుతుండగా, గంటల తరబడి పడిగాపులు కాచి, చివరకు వైద్య సహాయం పొందకుండానే కొంత మంది రోగులు ఇంటి బాట పడుతున్నారు. వరంగల్ కాకతీయ మెడికల్​ కాలేజీ ఆవరణలోని సూపర్​స్పెషాలిటీ ఆసుపత్రిలో మంగళవారం ఇదే జరిగింది. డాక్టర్లు ఆసుపత్రికి సకాలంలో రాకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

నిత్యం వెయ్యి మందికి పైగా రాక

కాకతీయ మెడికల్​ కాలేజీలో ప్రధానమంత్రి స్వాస్థ సురక్ష యోజన కిందట మూడేండ్ల కిందట రూ.150 కోట్లతో సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. కరోనా తరువాత దీనిని వినియోగంలోకి తీసుకురాగా, వివిధ విభాగాల్లో సూపర్​ స్పెషాలిటీ వైద్యం అందించే అవకాశం ఉంది. దీంతోనే ఎంజీఎం ఆసుపత్రిలో దొరకని చికిత్సల కోసం రోగులంతా ఇక్కడికే వస్తుంటారు. ఇలా నిత్యం 900 మంది నుంచి 1200 వరకు ఔట్​ పేషెంట్లు వస్తుండగా, అందులో పదుల సంఖ్యలో మంది ఇన్​ పేషెంట్లుగా అడ్మిట్​ అవుతుంటారు. ఇంతవరకు బాగానే ఉండగా, ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నా డాక్టర్లు మాత్రం సమయ పాలన పాటించక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి ఈ ఆసుపత్రిలో ఒక్కోరోజు కొన్ని విభాగాలకు సంబంధించిన సేవలందిస్తుండగా, మంగళవారం న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, పీడియాట్రిక్ సేవలు అందించాల్సి ఉంది. ఈ విభాగాలకు రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో మంగళవారం ఉదయం 7 గంటల నుంచే ఇక్కడ పేషెంట్లు క్యూ కట్టారు. కానీ ఉదయం 9 గంటల వరకల్లా డ్యూటీకి హాజరు కావాల్సిన వైద్య సిబ్బంది 11 గంటలు దాటినా అటెండ్ కాలేదు. దీంతో వైద్య సేవల కోసం పేషెంట్లు పడిగాపులు కాయాల్సి వచ్చింది.

పర్యవేక్షణ లేక సమస్యలు

కేఎంసీ సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​ ఎంజీఎం సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆర్​ఎంవో స్థాయి ఆఫీసర్​ ఇన్​ఛార్జ్​ గా వ్యవహరిస్తుండగా, వైద్య సిబ్బంది పనితీరును ఎవరూ పర్యవేక్షించడం లేదనే విమర్శలున్నాయి. దీంతోనే డాక్టర్లు సమయ పాలన పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మంగళవారం పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనాలు క్యూ లైన్లలో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కూర్చునేందుకు కుర్చీలు కూడా లేక కొంత మంది వరండాలో కింద కూర్చుని డాక్టర్ల రాక కోసం ఎదురు చూశారు. ఇదిలాఉంటే ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన రోగులను కనీసం లోపలికి తీసుకుని వెళ్లేందుకు స్ట్రెచ్చర్​ సదుపాయం కూడా లేక అవస్థలు పడాల్సి వచ్చింది. ఇదే విషయమై రోగులు అక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తే ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు వైద్య పరీక్షలు, ట్రీట్​ మెంట్​ చేసి వస్తుండటం వల్లే డాక్టర్లు ఆలస్యంగా చేరుకుంటున్నారని చెబుతుండటం గమనార్హం. కాగా దూర ప్రాంతాల నుంచి ఉదయమే ఆసుపత్రికి వచ్చినా డాక్టర్లు సకాలంలో డ్యూటీకి రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని అక్కడికి వచ్చిన రోగులు విజ్ఞప్తి చేశారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం