తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Viral Fevers : మంచం పట్టిన 'ఆదిలాబాద్'....! ఇంటింటా విషజ్వరాలు, రోగులతో ఆస్పత్రులు కిటకిట

Viral Fevers : మంచం పట్టిన 'ఆదిలాబాద్'....! ఇంటింటా విషజ్వరాలు, రోగులతో ఆస్పత్రులు కిటకిట

HT Telugu Desk HT Telugu

09 August 2024, 16:04 IST

google News
    • Viral Fever Cases in Adilabad: ఆదిలాబాద్ జిల్లాకు జ్వరమొచ్చింది. ఇక్కడా, అక్కడా అని తేడా లేకుండా ఇంటింటా విషజ్వరాలు, సీజనల్ వ్యాధులతో జనం సతమతం అవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బాధితుల సంఖ్య పెరుగుతోంది. 
నిర్మల్ జిల్లా ఏరియా ఆసుపత్రి
నిర్మల్ జిల్లా ఏరియా ఆసుపత్రి

నిర్మల్ జిల్లా ఏరియా ఆసుపత్రి

ఆదిలాబాద్ జిల్లాలో వైరల్ జ్వరాలు వెంటాడుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) నుంచి బోధనాస్పత్రుల దాకా రోజూ వేలాది మంది ఔట్ పేషెంట్లు క్యూకడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి కేసులూ నమోదవుతున్నాయి.

విష జ్వరాలకు తోడు డెంగ్యూ సైతం విస్తరిస్తోంది. ఇప్పటివరకు నిర్మల్ జిల్లాలో 14 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి పరీక్షల కోసం వస్తున్న వారిలో దాదాపు వంద మంది జ్వరాలతో బాధపడుతున్నవారు ఉంటున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు వేల మందికిపైగా వైరల్ జ్వరాలతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వర్షాలు కురవడంతో గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోని స్లమ్ ఏరియాల్లో పారిశుధ్యం లోపించడం, దోమలు విజృంభిస్తుండడంతో ప్రజలు విష జ్వరాల బారినపడుతున్నారు.

రిమ్స్ లో డెంగ్యూ వార్డు ఏర్పాటు…

జ్వర పీడితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో వైద్యాధికారులు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. జ్వరాలతో బాధపడుతున్న వారికోసం ఓపీ విభాగాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనికి తోడుగా డెంగ్యూ జ్వర బాధితులకు ప్రత్యేక సేవలందిం చేందుకు 20 పడకలతో కూడిన స్పెషల్ వార్డును ఏర్పాటు చేశారు.

ఇప్పటివరకు ఈ వార్డులో 8 మందికి పైగా డెంగ్యూ బాధితులు ట్రీట్మెంట్ తీసుకోగా, వారిలో నలుగురు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. అలాగే వివిధ పీహెచ్సీల పరిధిలో మరో 6 పాజిటివ్ కేసులు నమోదైనట్లు డీఎం అండ్ హెచ్ అధికారులు చెబుతున్నారు.

కిటకిటలాడుతున్న ఓపీ విభాగం:

జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రితో పాటు భైంసా, ఖానాపూర్ ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ ప్రతిరోజు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరాలతో బాధపడుతున్న రోగులు ఉదయం 9 గంటల నుంచే ఇక్కడి ఓపీ విభాగాల్లో క్యూ కడుతున్నారు. పట్టణాల్లోని ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ లోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాలలోని అన్నీ గ్రామాల్లో ఇదే తంతు కొనసాగుతోంది. దగ్గు, జలుబు, ఫ్లూ, విషజ్వరాలు, డెంగీ ఫీవర్ లు తదితర అంటూ వ్యాధులతో ఆసుపత్రులు కిటకిటలాడుతూన్నాయి.

విస్తారంగా వర్షాలు కురవడంతో వర్షపు నీటి నిల్వలు దోమలకు ఆవాసలుగా మారాయి. పరిసరాల పరిశుభ్రత లేకుండా పోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. పారిశుధ్య అవగాహనా కార్యక్రమలు చేపడుతున్నప్పటికి లాభం లేకుండాపోతోంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికి సుమారు 60 కేసులు నమోదు అయ్యాయి.

రోగులు ప్రభుత్వ ఆసుపత్రులు కంటే ప్రైవేటు ఆసుపత్రులను ఎక్కువగా ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలరోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్మల్, మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 10వేల మంది రోగులు వైద్య పరీక్షలు చేసుకున్నారని ఆసుపత్రి రికార్డులు చెబుతున్నాయి.

రిపోర్టింగ్: వేణుగోపాల కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి.

తదుపరి వ్యాసం