TSPSC Paper Leakage : ఆమె కోసం పేపర్ కొనుగోలు! మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన సిట్
07 April 2023, 21:54 IST
- TSPSC Paper Leakage News: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ విచారణ ముమ్మరం చేస్తోంది. తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది.
పేపర్ లీకేజ్ లో మరో ఇద్దరు అరెస్ట్
TSPSC Paper Leakage Updates: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్(TSPSC Paper Leak) వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా... మరికొందరిని విచారిస్తోంది. తవ్వేకొద్ది అక్రమాలు బయటికి వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది సిట్. ఫలితంగా ఇప్పటివరకు ఈ కేసులో 17 మంది అరెస్ట్ అయ్యారు.
తాజాగా లౌకిక్, సుష్మితను అదుపులోకి తీసుకున్న పోలీసులు... విచారించారు. ప్రియురాలు సుస్మిత కోసం లౌకిక్ డీఏఓ(డివిజనల్ అకౌంట్ ఆఫీసర్) పేపర్‌ను కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ప్రవీణ్ నుంచి పేపర్‌ను రూ. 6 లక్షలకు లౌకిక్ ఈ పేపర్‌ను కొనుగోలు చేసినట్టు తేల్చారు. ఫిబ్రవరి 26వ తేదీన ఈ పరీక్ష జరగా... లీక్ అయినట్లు వార్తలు రావటంతో పరీక్షను రద్దు చేసినట్లు సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ కేసులో టీఎస్పీఎస్పీ ఛైర్మన్ వాంగ్మూలాన్ని కూడా తీసుకుంది సిట్. ఇక కమిషన్ కార్యదర్శితో పాటు పలువురి సభ్యులను కూడా విచారించింది. వారి వద్ద నుంచి పలు వివరాలను సేకరించింది. ఈ లీకేజీ కేసులో కార్యదర్శి పీఏ ప్రవీణ్‌కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డి ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరిని విచారిస్తుండటంతో మొత్తం వ్యవహారం బయటికొస్తోంది. ఇప్పటివరకు జరిగిన మొత్తం విచారణను పూర్తి చేసి రిపోర్టును సీల్డ్ కవర్‌లో ఈ నెల 11 వరకు కోర్టుకు సిట్ అధికారులు అందజేయనున్నారు.
మరోవైపు ఈ కేసులోకి ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఆధారాలతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పేపర్ లీక్ పై సిట్ తో పాటుగా ఈడీ అధికారులు విచారణ చేపట్టబోతున్నారు. పేపర్ లీక్ లో హవాలా ద్వారా నగదు లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ భావిస్తుంది. ఇప్పటివరకు సిట్ అరెస్ట్ చేసిన వారిని ఈడీ కూడా విచారించే అవకాశం ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై ఈడీకి కాంగ్రెస్ కూడా ఫిర్యాదు చేసింది. పేపర్ లీకేజ్ కేసును పారదర్శకంగా విచారణ జరిపి… వాస్తవాలను బయటపెట్టాలని కోరింది.